రామన్ రాఘవన్.... ఒకప్పుడు ముంబైని గడ గడలాడించిన పేరిది. ఈ పేరు వింటనే వెన్నులో వణుకు పుట్టేది అప్పట్లో ముంబై ప్రజలకు. అయితే ప్రపంచంలో ఎంతో మంది సీరియల్ కిల్లర్లు ఒళ్లు గగూర్పాటు కలిగించే హత్యలు, అత్యాచారాలు చేసి పోలీసులకు సవాళ్లు విసిరారు. కానీ ఎవరి పేరు అంత ఫేమ్ లోకి రాలేదు. కానీ రామన్ రాఘవన్ అనే సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినా..ఆ పేరు మీద కొన్ని సినిమాలు కూడా […]

రామన్ రాఘవన్.... ఒకప్పుడు ముంబైని గడ గడలాడించిన పేరిది. ఈ పేరు వింటనే వెన్నులో వణుకు పుట్టేది అప్పట్లో ముంబై ప్రజలకు. అయితే ప్రపంచంలో ఎంతో మంది సీరియల్ కిల్లర్లు ఒళ్లు గగూర్పాటు కలిగించే హత్యలు, అత్యాచారాలు చేసి పోలీసులకు సవాళ్లు విసిరారు. కానీ ఎవరి పేరు అంత ఫేమ్ లోకి రాలేదు. కానీ రామన్ రాఘవన్ అనే సీరియల్ కిల్లర్ చేసిన హత్యలు కొన్ని సంవత్సరాల క్రితం జరిగినా..ఆ పేరు మీద కొన్ని సినిమాలు కూడా తీశారు. అంత ఫేమస్ గా మారాడు రామన్ రాఘవన్.

టెక్నాలజీ డెవలప్ కాని రోజుల్లో ఎంతోమంది సీరియల్ కిల్లర్లు దారుణాలు చేసి సులభంగా తప్పించుకునేవారు. అత్యధిక సీరియల్ కిల్లర్లు.. ప్రజలు తమ గురించి మాట్లాడుకోవాలని, తమ పేరు వింటేనే భయపడాలని కోరుకొనేవారు. అందులో మొదటి వ్యక్తి రామన్ రాఘవన్. ఈ పేరు నిత్యం వార్తల్లో ఉండేలా హత్యలు చేయడం అతడి సైకో నైజం. ఇతరులు ప్రాణాల కోసం చేసే ఆర్తనాదాలు విని ఆనందిచేవారు కొందరైతే.. ఏ కారణం లేకుండానే ప్రాణాలు తీసేసే ఉన్మాదులు మరికొందరు ఈ కోవలోకే వస్తాడు రామన్ రాఘవన్. ఇతను చేసే హత్యల వెనుక బలమైన కారణం ఏదీ ఉండదు. అతని మానసిక పరిస్థితి హత్యలకు పురిగొల్పుతుంది. ఇలాంటి సీరియల్ కిల్లర్ ముంబైలో పుట్టాడు. ఇతను చేసిన హత్యలు గురించి తెలిస్తే వణికిపోతారు. ఒక వ్యక్తి సాధారణంగా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను హత్య చేయడాన్ని సీరియల్ కిల్లర్ అంటారు. అసాధారణ మానసిక సంతృప్తి కోసం, ఒక నెల కంటే ఎక్కువ కాలం పాటు హత్యలు చేస్తూ ఉంటారు. కొందరు మానసిక లోపంతో చేస్తే మరి కొందరు పగతో చేస్తారు. కానీ ఏ కారణం లేకుండా రామన్ రాఘవన్ 41 మందిని చంపి నరరూప రాక్షసుడయ్యాడు.
వరుస హత్యలకు ముఖ్య ఉద్దేశ్యం మానసిక తృప్తి. వరుస హత్యలు బాధితురాలితో లైంగిక సంబంధంతో చనిపోయిన ఆడవాళ్లే ఉంటారని అంచనా. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సీరియల్ కిల్లర్స్ సాదారణ లక్షణాల్లో కోపం, థ్రిల్, కోరిక, ఆర్థిక లాభం, ఫేమస్ అవాలని కోరిక వంటివి ఉంటాయి హత్యలు. ఈ కారణాలతోనే కిల్లర్లు హత్యలు చేస్తున్నారని ఆధారాలు చెబుతున్నాయి. ఉదాహరణకు, తరచుగా FBI సీరియల్ కిల్లర్స్ అనుసరించే నిర్దిష్ట నమూనాపై దృష్టి పెడుతుంది. ఈ నమూనా ఆధారంగానే, హంతకుడి ఉద్దేశ్యాలతో పాటు కీలకమైన ఆధారాలను అందిస్తుంది.

ముంబై నిద్రపోతున్న వేళ....

అది 1965వ సంవత్సరం.. ముంబయి నగరం ప్రశాంతంగా నిద్రపోతోంది. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లే దారిలో ఓ గుడిసెలో ఉన్న కుటుంబం ఉదయానికల్లా శవాలుగా మారారు. ఆ గుడిసెలోని కుటుంబాన్ని, అందులో ఒక యువతిని హంతకుడు కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తున్నాడు. కారణం ఆమె మెడలో ఉన్న చైన్. ఆ యువతిని తన గుడిసె వెనకాల ఉన్న పొదల్లో ఉండి గమనిస్తూ ఉండేవాడు. ప్రతి రోజు రాత్రి ఆ యువతి తన భర్త వచ్చే వరకు ఎదురు చూసేది. ఆ యువతి ఎప్పుడు నిద్ర పోతుందా అని హంతకుడు ఎదురు చూసేవాడు. ఒక రోజు యువతి భర్త తొందరగా రావడంతో ఆ కుటుంబం తొందరగా నిద్రపోయింది. అంతా నిద్రపోయిన తర్వాత మెల్లిగా గుడిసెకు ఉన్న తడకను తీసేసి లోపలికి వెళ్లి యువతి భర్త తలపై ఒక ఇనుప రాడ్డుతో గట్టిగా బాదాడు. అతడు తల పగిలి రక్తం కారుతూ గిలగిల కొట్టుకుంటున్నాడు. అలానే ఇంకో రెండు మూడు సార్లు తల మీద అతను చనిపోయేవరకు కొట్టాడు. అతను చనిపోయాడు. భర్త శబ్ధం విని లేచిన ఆ యువతి గట్టిగా అరవడం మొదలు పెట్టింది. ఆమెను కూడా తలపై రెండు మూడు సార్లు ఇనుప రాడ్డుతో బాది చంపేశాడు. అదే గుడిసెలో ఉన్న చిన్న పిల్లాడిని కూడా తల మీద రాడ్డుతో కొట్టి చంపేశాడు. ముగ్గురిని ఒకే సారి చంపేశాడు. తర్వాత ఆమెపై లైంగిక దాడి చేసి ఆ యువతి మెడలో ఉన్న చైన్ ను తీసుకుని పారిపోయాడు. అతడే రామన్ రాఘవన్. అతను విలువైన వస్తువుల కోసమే కాదు..చిన్న చిన్న వస్తువుల కోసం కూడా హత్యలు చేశాడు.

ఒకసారి ఒక వ్యక్తి భోజనం చేస్తుంటే అదే తరహాలో ఇనుప రాడ్డుతోనే తలపగల కొట్టి చంపేశాడు. తర్వాత ఆ శవం పక్కనే ఆ వ్యక్తి తింటున్న ప్లేట్ లో మిగిలిపోయిన అన్నాన్ని తిని, ఆ వ్యక్తి జేబులో ఉన్న బీడీ కట్టను తీసుకుని వెళ్లిపోయాడు. మరో సారి ఒక ఇంట్లో వారిని హత్య చేసి ఇంట్లో ఉన్న గోదుమపిండిని, నూనెను ఎత్తుకెళ్లాడు. అలా రామన్ రాఘవన్ ఆరు సంవత్సరాల్లో 42 హత్యలు చేశాడు.
ప్రతి రోజూ ఏదో ఒక చోట శవం ముంబైలో ప్రత్యక్షమయ్యేది. మనుషుల నుంచి జంతువుల వరకు.. ఏదో ఒక కళేబరం కనిపిస్తూనే ఉండేది. దీంతో ప్రజలకే కాదు.. ముంబయి పోలీసులకు కూడా నిద్ర కరవైంది. ఏదో శక్తి ప్రజలను చంపేస్తుందనే ప్రచారం సాగింది. రాత్రయితే ప్రజలు బయటకు రావాలంటేనే భయపడేవారు. కానీ.. ఉదయం చూసేసరికి ఏదో ఒక హత్య వార్త వినాల్సి వచ్చేది. తల లేని మొండెం లేదా ఛిద్రమైన శరీరాలు ఇలా.. ఏదో ఒకటి బయటపడేది. ముంబయి నగరానికి లాక్‌డౌన్‌లు కొత్త కాదు. అయితే, కరోనా రాకముందే ముంబయిలో 1965 సంవత్సరంలో లాక్‌డౌన్ విధించారు. అయితే, వైరస్‌కు భయపడి కాదు.. సీరియల్ కిల్లర్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు. హంతకుడు ఎక్కువగా మురికివాడల్లో నివసించే ప్రజలనే టార్గెట్ చేసుకొనేవాడు. అనాథలు, రోడ్డు పక్కన నిద్రపోయే నిరాశ్రయులను అత్యంత దారుణంగా చంపేవాడు. ఆ హత్యలను చూస్తే.. అతడికి కొంచెం కూడా కనికరం లేదేమో అనిపించేవి. పోలీసులు రాత్రివేళ కర్ఫ్యూ విధించినా సరే.. ఆ కిల్లర్ దొరికేవాడు కాదు. హత్యలు మాత్రం జరుగుతూనే ఉండేవి.

హత్య జరిగిన ప్రాంతాల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరికేది కాదు. హత్యల తీరును చూస్తే ఏదో బలమైన కడ్డీ లేదా సుత్తితో మోది హత్యలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో అప్పటి డీసీపీ రమాకాంత్ కులకర్ణి హత్యలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. హత్యల తీరును చూసి ఒక్కడే ఈ హత్యలు చేస్తున్నారని తెలుసుకున్నారు. అయితే, అతడిని చూశామని చెప్పే ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా లభించలేదు. 1965 నుంచి 1966 వరకు ఈ హత్యల పరంపర సాగింది.

హంతకుడు ఎక్కువగా సెంట్రల్ రైల్వేలోని తూర్పు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ హత్యలు జరిగేవి. అయితే, సుమారు ఏడాదిపాటు.. హత్యలేవీ చోటుచేసుకోలేదు. దీంతో ముంబయి ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. హంతకుడి చనిపోయి ఉంటాడని లేదా వేరే చోటుకు వెళ్లి పోయి ఉంటాడని భావించారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితికి జరుగుతున్న సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ తరహాలో మరోసారి హత్యలు మొదలయ్యాయి. 1968 సంవత్సరంలో ఆ సీరియల్ కిల్లర్ మరోసారి నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే, ఈ సారి తూర్పు వైపు కాదు, ఉత్తరం వైపు శివారు ప్రాంత ప్రజలను హంతకుడు టార్గెట్ చేసుకున్నాడు. పోలీసులు అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. అనుమానితులను సైతం అరెస్టు చేసి కొద్ది రోజులు జైల్లో పెట్టారు. కానీ, హత్యలు మాత్రం ఆగలేదు. ఇంకా కొనసాగతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో పోలీసులకు ఓ అవకాశం దక్కింది. కార్తిక అనే మహిళ ఆ కిల్లర్ దాడి నుంచి తప్పించుకుని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నిరాశ్రయ వ్యక్తి తనపై దాడికి ప్రయత్నించాడని పేర్కొంది. అయితే, అతడే దాడి చేశాడని చెప్పేందుకు తగిన సాక్ష్యాలు లభించకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోలేదు. దీంతో ఆ కిల్లర్ మరింత రెచ్చిపోయాడు. చివరికి వరుస హత్యల నేపథ్యంలో డీసీపీ రమాకాంత్ కులకర్ణి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకొనేందుకు అతడి స్కెచ్ గీయించారు. అతడి బొమ్మను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అప్పటికే ముంబయిలో సుమారు 41 మంది హత్యకు గురయ్యారు. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతి ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. సబ్ ఇన్స్‌పెక్టర్ అలెక్స్ ఫియాల్హో.. ఆ స్కెచ్‌ను గుర్తుపట్టాడు. అతడు ఓ కేసులో అరెస్టయిన పాత నేరస్తుడు ‘రమణ్ రాఘవ’. త్వరలోనే అతడిని అరెస్టు చేస్తామని అలెక్స్ ఉన్నతాధికారులకు తెలిపాడు. చెప్పినట్లే అలెక్స్ అనుమానితుడు రమణ్‌ను అరెస్టు చేశాడు. అతడు నివసిస్తున్న ఇంట్లో హత్యలకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా కనిపించలేదు. సోదాల్లో పోలీసులకు ఒక జత కళ్లజోళ్లు, రెండు దువ్వెనలు, రెండు కత్తెరలు, ఒక సబ్బు పెట్టే, అల్లం, టీ పొడి, రెండు పేపర్లు మాత్రమే కనిపించాయి. హత్యలకు ఉపయోగించిన ఆయుధం కనిపించలేదు. కానీ అతడు దుస్తులపై ఉన్న రక్త మరకలను పరిశీలిస్తే.. అతడి దాడిలో చనిపోయిన ఓ వ్యక్తి రక్తంతో సరిపోలాయి. అతడి వేలి ముద్రలు సైతం సంఘటన స్థలంలో లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు చేసిన హత్యలన్నీ రామణ్ చేసినవేనని పోలీసులు నిర్ధరించారు.

రామన్ చరిత్ర....

రామన్ రాఘవన్ 1929 లో జన్మించాడు. ఇతనిని సింధీ తల్వాయి, అన్నా, తంబి, వేలుస్వామి అని కూడా పిలుస్తారు. రామన్ రాఘవన్ తమిళనాడు నుంచి ముంబైకి వచ్చినట్టు తెలుస్తోంది. తమిళనాడులో ఇతనికి గురువమ్మ అనే యువతితో పెళ్లి కాగా అప్పటికే అతనికి దొంగతనాలు చేసే అలవాటు ఉంది. పెళ్లి తర్వాత ఓ చోరీ కేసులో రామన్ రాఘవన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతను జైలులో ఉండగానే గురువమ్మ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. జైలునుంచి రాగానే గురువమ్మ వేరే వ్యక్తితో ఉండటం రామన్ తట్టుకోలేకపోయాడు. అప్పుడే అతను మానసికంగా డిస్టబ్ అయ్యాడు. రామన్ కు ఇంకో పెళ్లి చేయడానికి తన కుటుంబీకులు ఎంత ప్రయత్నించినా అతను ఒప్పుకోలేదు. ఆ తర్వాత రామన్ రాఘవన్ ముంబైకి వచ్చి, అక్కడ భవన నిర్మాణ కూలీగా పనిలో చేరాడు.

ఇక ఆగష్టు 1968లో ముంబై శివార్లలో వరుస హత్యలు జరిగాయి. మురికివాడల్లో నిద్రించే వారే హత్యకు గురయ్యేవారు. అన్ని హత్యలు రాత్రి సమయంలో జరగడమే కాకుండా కఠినమైన, మొద్దుబారిన వస్తువును ఉపయోగించి హత్యలు జరిగినట్టు తేలింది. అయితే ముంబైలోని తూర్పు శివారు ప్రాంతాల్లో 1965–66 మధ్యలో ఇదే విధమైన హత్యలు జరిగాయి. ఆ సంవత్సరంలో, 19 మంది వ్యక్తులు దాడికి గురయ్యారు. వారిలో 9 మంది బాధితులు మరణించారు.
అయితే అప్పుడే పోలీసులు రమణ్ రాఘవపై అనుమానం వ్యక్తం చేసి అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు దోపిడీ కేసులో ఐదు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. కానీ కొత్త నేరాలకు సంబంధించి అతనిపై ఎటువంటి బలమైన సాక్ష్యం లేకపోవడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. 1968లో హంతకుడు మళ్లీ దాడి చేయడంతో పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు. అప్పటి డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ సిఐడి రమాకాంత్ కులకర్ణి దర్యాప్తు చేపట్టి నగరంలో భారీ కూంబింగ్ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. ఈ ప్రయత్నంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అప్పుడే 1966లో GIP (గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే సెంట్రల్ రైల్వే లైన్‌లోనే దాదాపు 41 మందిని, 1968లో దాదాపు డజను మందిని శివారు ప్రాంతాల్లో హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ అలెక్స్ ఫియాల్హో రాఘవ్‌ను చూసిన వారి నుండి పొందిన వివరాలతో గుర్తించాడు. అతను తన పేరు రామన్ రాఘవ అని చెప్పుకున్నాడు, కానీ పాత రికార్డులు అతనికి "సింధీ దల్వాయి", "తల్వాయి", "అన్నా", "తంబి", "వేలుస్వామి" వంటి అనేక మారుపేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అప్పుడు రామన్ వేసుకున్న బుష్ షర్ట్, ఖాకీ షార్ట్ రక్తపు మరకలతో, తన బూట్లు చాలా బురదగా ఉన్నాయి. అతని వేలిముద్రలు రికార్డులో ఉన్న వాటితో సరిపోలాయి. అతను రామన్ రాఘవ్ అలియాస్ "సింధీ దల్వాయి" అని నిర్ధారించారు. ఇద్దరు వ్యక్తుల హత్యకు పాల్పడ్డారనే అభియోగంపై సెక్షన్ 302 ఇండియన్ పీనల్ కోడ్ కింద అతన్ని అరెస్టు చేశారు.
అదనపు చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రాథమిక విచారణ జరిగింది. చాలా రోజులు రాఘవ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అయితే, తినడానికి చికెన్ వంటకాలు కావాలనే అతని అభ్యర్థనను పోలీసులు నెరవేర్చిన తర్వాత అతను వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. అప్పుడు అతను తన ఆయుధాన్ని, అతని కార్యనిర్వహణ విధానాన్ని వివరిస్తూ వివరణాత్మక ప్రకటన ఇచ్చాడు. ఆ తర్వాత కేసును ముంబైలోని సెషన్స్ కోర్టుకు అప్పగించారు. ఇతని కారణంగా 1965 - 1966 మధ్యలో మొదటి రౌండ్ హత్యలు జరిగాయి. 19 మందిపై దాడి జరిగింది. 1968లో రెండవ రౌండ్ హత్యలు జరిగాయి. అప్పుడే అతను పట్టుబడ్డాడు.

కేసు నమోదు....

40 పైగా హత్య కేసుల్లో అతడు నిందింతుడుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అయితే, రామణ్ మాత్రం నేరాన్ని అంగీకరించలేదు. పోలీసులు అతడితో నిజం కక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ, ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. దీంతో అతడు ఆ హత్యలు ఎందుకు చేశాడనేది మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులతో చావు దెబ్బలు తిన్న కొన్ని వారాల తర్వాత రమణ్ నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు ఓ షరతు పెట్టాడు. తనకు కోడి కూరతో లంచ్ పెడితే.. అన్నీ చెబుతానని తెలిపాడు. దీంతో పోలీసులు అతడికి కోడి కూర వడ్డించారు. కోడి కూరతో భోజనం పూర్తయిన తర్వాత.. ‘‘మీకు ఏ వివరాలు కావాలో అడగండి చెబుతా’’ అని పేర్కొన్నాడు. చివరికి.. 41 మందిని హత్య చేశానని నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు అతడిని హత్యలు జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రమణ్ హత్యలు చేసిన విధానాన్ని పోలీసులకు వివరించాడు. ఒంటరిగా కనిపించే వ్యక్తులను, జంతువులను ఇనుప కడ్డీతో కొట్టి చంపేవాడినని రమణ్ తెలిపాడు. అనంతరం హత్యలకు ఉపయోగించిన ఇనుప రాడ్డును దాచి పెట్టిన ప్రాంతాన్ని పోలీసులకు చూపించాడు. హత్యలు చేయడానికి చాలా చిత్రమైన కారణాలు చెప్పాడు. ‘‘ఈ ప్రపంచం ‘చట్టం’ చుట్టూ తిరుగుతుంది. కానీ నా ప్రపంచమే వేరు. నేను ఒక శక్తిని’’ అని పేర్కొన్నాడు. కోర్టులో రమణ్ తరఫు న్యాయవాది.. అతడికి మతి స్థిమితం సరిగా లేకపోవడం వల్లే హత్యలు చేసినట్లు తెలిపారు.

1969 జూన్ 2న ముంబయిలోని అదనపు సెషన్ జడ్జి కోర్టులో విచారణ ప్రారంభమైనప్పుడు, డిఫెన్స్ తరఫు న్యాయవాది, నిందితుడు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తనను తాను వాదించుకోలేడని దరఖాస్తు చేశాడు. అతను దానిని కూడా సమర్పించాడు. ఆరోపించిన నేరాల్లో నిందితుడు అస్థిరమైన మనస్సు, అతని చేసే పనుల స్వభావాన్ని గమనించారు. అయితే రామన్ 41 హత్యలు చేసినట్లు అంగీకరించాడు. తన ఒప్పుకోలు తర్వాత, అతను తను చేసే హత్యల నేపథ్యాన్ని, తను ఉన్న ప్రదేశాలను చూపించడానికి, ఉత్తర శివారు ప్రాంతాల్లో దాచిన రాడ్‌ను పొందేందుకు పోలీసు బలగాలు నగరవ్యాప్తంగా పర్యటించాయి. తర్వాత నిందితుడిని ముంబైలోని పోలీస్ సర్జన్‌కి పంపారు. అతను 28 జూన్ 1969 నుండి 23 జూలై 1969 వరకు రామన్ ను గమనించాడు. తర్వాత సర్జన్ అభిప్రాయం ప్రకారం "నిందితుడు సైకోసిస్‌తో బాధపడటం లేదు, మానసిక వికలాంగుడు కాదు. అతని జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది, అతని తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయి. అతను చేసే హత్యల గురించి, దాని ఉద్దేశ్యం గురించి అతనికి తెలుసు. అతను అతనిపై చేస్తున్న విచారణను కూడా అర్థం చేసుకోగలడు కూడా. ఇంకో ముఖ్య అంశం ఏంటంటే అతనిది ధృవీకరించదగిన పిచ్చి కాదు." అని పేర్కొన్నాడు.

ఈ సర్జన్ అభిప్రాయంతో, విచారణ మళ్లీ కొనసాగింది. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. విచారణలో ముంబయిలోని నాయర్ ఆసుపత్రికి చెందిన మానసిక వైద్యుడు డిఫెన్స్ సాక్షిగా పేర్కొన్నారు. అతను 5 ఆగష్టు 1969న ఆర్థర్ రోడ్ జైలులో నిందితుడిని ఇంటర్వ్యూ చేసాడు. నిందితుడు దీర్ఘకాలంగా క్రానిక్ పారానోయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని కానీ..అతని చర్యలు చట్టానికి విరుద్ధమని అర్థం చేసుకోలేకపోయాడని రుజువు చేశాడు.
అంటే డిఫెన్స్‌లో, "నిందితుడికి మనుషులను చంపడం తెలుసు. కానీ అది తప్పో, చట్టానికి విరుద్ధమో తెలియదు" అని చెప్పబడింది. దీంతో ముంబైలోని అడిషనల్ సెషన్స్ జడ్జి, హత్యానేరంలో నిందితుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. కానీ రామన్ తిరిగి అప్పీల్ చేయడానికి నిరాకరించారు. శిక్షను నిర్ధారించే ముందు, ముంబయిలోని సర్జన్ జనరల్ ముగ్గురు మానసిక వైద్యులతో కూడిన ప్రత్యేక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే నిందితుడికి మాత్రం మానసిక స్థితి సరిగా లేదు. అతని మానసిక స్థితి సరిగా లేకపోవడమే తనను తాను రక్షణ కల్పించుకోలేక పోయాడు.

స్పెషల్ మెడికల్ బోర్డు సభ్యులు రామన్‌ను ఐదు సందర్భాలలో ప్రతిసారీ రెండు గంటలపాటు ఇంటర్వ్యూ చేశారు. వారి చివరి ఇంటర్వ్యూలో వారు అతనికి వీడ్కోలు పలికి, అతనితో కరచాలనం చేయడానికి ప్రయత్నించినప్పుడు, అతను నిరాకరించాడు. రామన్ చిన్నప్పుడు సంబంధించిన వివరాలు అందుబాటులో లేవు. అతని కుటుంబంలో మానసిక అనారోగ్యం గురించి ఎలాంటి ఆదారాలు లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అతనికి చిన్నప్పటి నుండి ఎప్పుడూ దొంగతనాలు చేసే అలవాటు ఉంది. అతనికి పాఠశాల విద్య అంతగా లేదు. అతను 1968లో పూణే నుండి వచ్చి ముంబై శివారు ప్రాంతాల్లోని అడవిలో ఉండేవాడు.

రమణ్ చేసిన హత్యలకు కోర్టు మొదట మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. రమణ్ 1995లో అనారోగ్యంతో చనిపోయాడు. కానీ, అతడి హత్యలు మాత్రం ఇప్పటికీ చర్చనీయంగానే ఉన్నాయి. రమణ్ ఈ హత్యలు ఎందుకు చేశాడనే విషయంపై స్పష్టత లేదు. అలాగే, 1966-1968 మధ్య హత్యలను ఎందుకు నిలిపాడనేది కూడా తెలియరాలేదు. ఆ నిజాలు రమణ్‌తోనే మట్టిలో కలిసిపోయాయి. రామన్ హత్యలపై తాజాగా నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ కూడా విడుదలైంది.

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story