పుత్రులు లేకపోతే పున్నామ నరకం తప్పదనే ఓ గుడ్డి నమ్మకం ఇంకా కొన్ని కుటుంబాలలో ఉంది. అపుత్రస్య గతిర్నాస్తి అని అనుకుంటూ కొడుకు కోసం కొండంత ప్రయత్నాలు చేసే దరిద్రులకు కూడా కొదవలేదు. కొడుకు పుడితే చాలు ఘనంగా వేడుకలు, ఉత్సవాలు చేస్తారు. కానీ మేఘాలయలో(Meghalaya) ఓ తెగవారికి మాత్ర ఆడపిల్ల పుడితేనే సెలెబ్రేషన్స్. ఆడపిల్లలకే ఆస్తిపాస్తులు రాసిస్తారు. చివరకు అక్కడి మహిళలు అత్తారింటికి వెళ్లరు.
అబ్బాయిలే అత్తారింటికి వస్తారు. పితృస్వామ్య వ్యవస్థకు పూర్తి భిన్నంగా వీరి జీవనశైలి ఉంటుంది. మేఘాలయలో ఖాసీ, గరో అనే గిరిజన తెగలు ఉన్నాయి. వీరు కొన్నేళ్లకు పూర్వం మయన్మార్, బంగ్లాదేశ్‌ల నుంచి వసల వచ్చినవారు. అలా వచ్చిన వారు మేఘాలయాలోని జైంటియా(Jaintia) అనే పర్వత ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ తెగ ప్రజలకు కొన్ని పద్దతులు, నియమాలు ఉన్నాయి.
వాటిని ఎవరూ ఉల్లంఘించరు. ఇప్పటికీ వాటిని ఆచరిస్తూ వస్తున్నారు. అక్కడ ఆడపిల్ల పుడితే సంబరపడతారు. సంతోషంగా వేడుక చేసుకుంటారు. ఇంట్లో పెత్తనమంతా అమ్మాయిలదే! వారికే ఆస్తి ముట్టచెప్పుతారు. ఇంటికి మహారాణి అన్నమాట! పెళ్లయ్యాక అత్తారింటికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వరుడే అత్తారింటికి వస్తాడు. ఇక్కడో చిన్న తిరకాసు ఉంది. అక్కడి అమ్మాయి తమ తెగలోని అబ్బాయిని కాకుండా మరో తెగ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఈ నియమాలేమీ వర్తించవు. అక్కడి కుటుంబాలలో ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఉంటే చిన్న కూతురు మినహా మిగతా వారంతా తమ తమ భర్తలతో ఇంట్లోనే ఉండవచ్చు.
అక్కడ చిన్న అమ్మాయిని ఖథూగా పరిగిణిస్తారు. ఆమెకు పెళ్లి చేసిన తర్వాత ఆస్తిపాస్తులు, ఇంటి బాధ్యతలు ఆమెకే ఇస్తారు. తల్లి మరణం తర్వాత ఇంటి బరువు బాధ్యతలను చూసుకోవాల్సింది ఆమెనే! పిల్లలకు ఇంటి పేరు కూడా తల్లి ఇంటిపేరే వస్తుంది. పిల్లల పోషణ విషయంలో ఆడవారికే ఎక్కువ హక్కులు ఉంటాయి. అక్కడి మహిళలు అన్ని రంగాలలో ముందుంటారు. వ్యవసాయం చేస్తారు.
ఉద్యోగాలు చేస్తారు. వ్యాపారాలు చేస్తారు. అన్నింటా మగవారి కంటే ఆడవారిదే పైచేయి. అందుకే అక్కడ గృహహింసలు ఉండవు. వేధింపులు, అత్యాచారాలు కూడా ఉండవు. చిత్రమైన విషయమేమింటే అక్కడ సమానత్వం(Gender equality) కోసం పురుషులు పోరాటం చేయడం! చాలా ఏళ్లుగా ఖాసీ, గరో తెగకు చెందిన పురుషులు సమాన హక్కుల కోసం, లింగ సమానత్వం కోసం పోరాటాలు చేస్తున్నారు.