ఉపరాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్..!
ఉప రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈమధ్య ప్రధాని మోదీ, ఇతర కీలక నేతలతో చిరింజీవి సాన్నిహిత్యంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నిర్వహించే ప్రతి ఈవెంట్‌లో చిరంజీవి హాజరు వెనుక అసలు కారణం ఇదేనంటున్నారు కొన్ని మీడియా వర్గాలు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కసరత్తులతోనే ఉప రాష్ట్రపతి పదవి చిరంజీవికి వరించే ఛాన్స్ ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈమధ్య కాలంలో జయదేవ్ ధన్కర్ వివాదాలకు కేరాఫ్‌గా మారిన తరుణంలో ఆయన్ను తొలగించి.. చిరంజీవి ఉప రాష్ట్రపతి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారా అన్న కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్న మెగాస్టార్.. మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. చిరంజీవిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కమలదళం ఆసక్తి ప్రదర్శిస్తోందా..! గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానితో పాటుగా చిరంజీవి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చిరంజీవి బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు ఆయనకు ఉపరాష్ట్రపతి లేదా కేంద్రమంత్రి పగ్గాలు అప్పజెప్పనున్నారని వార్తలైతే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.