విశ్వ విఖ్యాత ఆర్ధిక వేత్త, నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్(Amartya Sen) ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ(Visva Bharati Central University)నోటీసులు ఇవ్వడంపై బెంగాల్ ముఖ్యమంత్రి(Bengal CM) మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. ఎలా కూలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అదే జరిగితే ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని తానేనన్నారు. బుల్డోజర్ ముందు తాను కూర్చుంటానని తెలిపారు.

Mamata Banerjee Strong Warning
విశ్వ విఖ్యాత ఆర్ధిక వేత్త, నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్(Amartya Sen) ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ విశ్వభారతి సెంట్రల్ యూనివర్సిటీ(Visva Bharati Central University)నోటీసులు ఇవ్వడంపై బెంగాల్ ముఖ్యమంత్రి(Bengal CM) మమతా బెనర్జీ(Mamata Banerjee) తీవ్రంగా మండిపడ్డారు. ఎలా కూలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అదే జరిగితే ధర్నాతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే మొదటి వ్యక్తిని తానేనన్నారు. బుల్డోజర్ ముందు తాను కూర్చుంటానని తెలిపారు. బుల్డోజరా? మానవత్వమా? ఏది పవర్‌ఫుల్లో తేల్చుకుంటానని మమతాబెనర్జీ అన్నారు.
శాంతినికేతన్ తెలుసుగా? అందులో తరతరాలుగా అమర్త్యసేన్ కుటుంబసభ్యులు ఉంటున్న ప్రతీచి నివాసం ఉంది. ఆ నివాసం అమర్త్యసేన్ తండ్రి అశుతోష్ పేరిట ఉంది. సేన్ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆ ఇల్లు సేన్ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఇంత వరకు బాగానే ఉంది. ఇప్పుడు విశ్వభారతి యూనివర్సిటీ అధికారులు కొత్త వాదన తీసుకొచ్చారు. అమర్త్యసేన్ కుటుంబసభ్యులు అక్రమంగా కొంత స్థలాన్ని ఆక్రమించారంటున్నారు అధికారులు. అంగుళం జాగా కూడా ఆక్రమించలేదంటోంది సేన్ కుటుంబం. పైగా ఈ ఏడాది జనవరిలో ప్రతీచికి చెందిన 6, 600లకు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్వయంగా అమర్త్యసేన్‌కు అందించారు. ఆ స్థలం సేన్ కుటుంబానికి చెందుతుందని అప్పుడే గట్టిగా చప్పారు దీదీ!
అబ్బే.. ఇందులో 600 గజాల స్థలం యూనివర్సిటీది అని విశ్వభారతి విశ్వవిద్యాలయం అంటోంది. వచ్చే నెల 6వ తేదీ లోపు ఈ స్థలాన్ని ఖాళీ చేయకుంటే మాత్రం బలవంతంగా ఖాళీ చేయిస్తామని, అందులో ఉన్న కట్టడాలను కూల్చేస్తామని సేన్‌కు యూనివర్సిటీ అధికారులు నోటీసులు పంపారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడుసార్లు నోటీసులు అంటించింది.
అది తమకు వారసత్వంగా వచ్చిన నివాసమని, ఎలాంటి ఆక్రమణలు జరగలేదని ప్రస్తుతం అమెరికాలో ఉన్న అమర్త్యసేన్ నోటీసులకు బదులిచ్చారు. '1943 నుంచి మా కుటుంబం అక్కడే నివసిస్తోంది. తర్వాతి కాలంలో చుట్టుపక్కల కొంత స్థలాన్ని కొన్నాం. నా తల్లిదండ్రులు మరణించినాక ఆ స్థలం నా పేరిట బదిలీ అయ్యింది. నేను జూన్‌లో శాంతినికేతన్‌కు వచ్చి పూర్తి వివరాలు అందిస్తా' అని యూనివర్సిటీ అధికారులకు మెయిల్ పంపారు అమర్త్యసేన్.
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై ప్రతీచికి కేర్‌టేకర్‌గా ఉన్న గీతికాంతా మజుందార్ కోర్టుకు వెళ్లారు. జూన్ ఆరు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, బీర్భూమ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ స్టేటస్ కో ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పోలీసుల పహారా ఉంది. జిల్లా అధికారులేమో కూల్చివేతకు తాము అనుమతించమని అంటున్నారు. యూనివర్సిటీ అధికారులేమో కూల్చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు. అమర్త్యసేన్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీ అధికారులు అదే పంతం మీద ఉన్నారు. బలవంతంగా ఖాళీ చేయించి , బుల్డోజర్‌లతో కూల్చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అంత గట్టిగా చెబుతున్నా, యూనివర్సిటీ అధికారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. విశ్వభారతి యూనివర్సిటీ వ్యవహారశైలిని మేథావులు కూడా తప్పుపడుతున్నారు. బీజేపీకి యూనివర్సిటీ పూర్తిగా సరెండరయ్యిందని, ఉద్దేశపూర్వకంగానే అమర్త్యసేను వేధిస్తున్నదని విమర్శిస్తున్నారు.
