పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ పై
గతంలో 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవలి కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రకటనలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాష్ట్ర రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపన కంటే డబ్బు పంపిణీపైనే జగన్ దృష్టి సారించారంటూ పీకే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక బెంగాలీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ వైఖరిలో స్థిరత్వం లేకపోవడంతో చాలా కాలం క్రితమే అతనితో పనిచేయడం మానేసినట్లు చెప్పారు. అతను మా కోసం పని చేయడం లేదు.. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం పనిలో బిజీగా ఉన్నారని అన్నారు మమతా బెనర్జీ. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో TMC రాజకీయ వ్యూహాల కోసం ప్రతీక్ జైన్ నేతృత్వంలోని I-PAC బృందం పనిచేస్తోందని ఆమె చెప్పారు. ఈ టీమ్‌కి ప్రశాంత్ కిషోర్‌కి ఎలాంటి సంబంధం లేదన్నారు. మొన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ బీజేపీని వ్యతిరేకించేవాడని.. ఇప్పుడు కాషాయ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. అందుకే ఇండియా బ్లాక్ అధికారంలోకి రాదని, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని ఆయన చెబుతున్నారని మమతా అన్నారు.