దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఒక సైనికుడు, ముగ్గురు అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారు.

Major Ashish Dhonchak Of Panipat Haryana Martyred In Kashmir
దక్షిణ కాశ్మీర్(South Kashmir)లోని అనంత్‌నాగ్(Ananth Nag)లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఒక సైనికుడు, ముగ్గురు అధికారులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్(Encounter)లో పానిపట్ నివాసి మేజర్ ఆశిష్ ధౌంచక్(Major Ashish Dhonchak) వీరమరణం పొందాడు. ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించిన ఆశిష్ ధౌంచక్ అక్టోబర్ 23న గృహప్రవేశం కార్యక్రమానికి రావాల్సి ఉంది. ఆ రోజే ఆయన పుట్టినరోజు.
ఆశిష్ జింద్‌లో జరిగిన తన బావ పెళ్లికి హాజరైన తర్వాత మే నెలలోనే తిరిగి విధుల్లో చేరాడు. ఆశిష్ బింఝౌల్ గ్రామ నివాసి. ప్రస్తుతం ఆయన కుటుంబం పానిపట్(Panipat) సెక్టార్-7లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆయన కొత్త ఇల్లు టీడీఐ ప్రాంతంలో నిర్మాణంలో ఉంది. ఆ ఇంటి గృహప్రవేశం వేడుకకు హాజరయ్యేందుకే సెలవు కూడా తీసుకున్న ఆశిష్.. అనుకోకుండా మృత్యువాత పడ్డారు.
ఆశిష్ తండ్రి లాల్‌చంద్ NFL లో సేవలందించి రిటైర్ అయ్యారు. తల్లి కమల గృహిణి. మేజర్ ఆశిష్‌కు మూడేళ్ల కుమార్తె వామిక, భార్య జ్యోతి ఉన్నారు. ఆశిష్ ధౌంచక్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ముగ్గురు సోదరీమణులు అంజు, సుమన్, మమత వివాహం చేసుకున్నారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఏకైక సోదరుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో, గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. 1987 అక్టోబర్ 23న జన్మించిన ఆశిష్ ధౌంచక్ 2012లో సిఖ్లాయి రెజిమెంట్ ఆర్మీలో రిక్రూట్ అయ్యారు.
ఆశిష్ రెండున్నరేళ్ల క్రితం మీరట్ నుంచి కాశ్మీర్‌కు పోస్టింగ్ అయ్యారు. సమాచారం అందుకున్న నగర ప్రజలు కూడా ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆశిష్ కు చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఆయన స్నేహితులు అతన్ని చాలా గౌరవించేవారని గ్రామస్తులు చెబుతున్నారు. మేజర్ ఆశిష్ ధౌంచక్ వీరమరణం పొందిన వార్త విన్న తర్వాత అందరు విషాదంలో మునిగిపోయాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నేడు ఆశిష్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.
