మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నెలవారీ రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ రూ.21 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టి

మహారాష్ట్రలోని ప్రభుత్వ రంగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నెలవారీ రూ.13,000 జీతం కోసం పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ రూ.21 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టి, తన ప్రియురాలి కోసం లగ్జరీ కార్లు, 4 బీహెచ్‌కే ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ఉపయోగించాడు. ఛత్రపతి శంభాజీనగర్‌లోని డివిజనల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కాంట్రాక్టు సిబ్బంది హర్షల్‌ కుమార్‌ క్షీరసాగర్‌ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. హర్షల్‌కు మద్దతిస్తున్నారనే ఆరోపణలపై అతని సహోద్యోగి యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

23 ఏళ్ల యువకుడు డబ్బును స్వాహా చేసేందుకు అనుసరించిన పక్కా ప్రణాళికను దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాతాకు లింక్ చేసిన ఇమెయిల్ అడ్రస్‌లో మార్పు కోసం అభ్యర్థిస్తూ బ్యాంకుకు ఇమెయిల్ చేయడానికి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని పాత లెటర్‌హెడ్‌ను హర్షల్ ఉపయోగించాడు. అతను స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఖాతాకు సమానమైన చిరునామాతో కొత్త ఇమెయిల్ ఖాతాను తెరిచాడు. కేవలం ఒకే ఒక్క అక్షరం మాత్రమే మార్చాడు. ఈ ఇమెయిల్ చిరునామా ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడింది. దీంతో హర్షల్ OTPలు మరియు లావాదేవీలకు అవసరమైన ఇతర సమాచారాన్ని యాక్సెస్ చేసుకునే అవకాశం కల్గింది. డివిజనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమిటీ బ్యాంక్ ఖాతాలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని హర్షల్ యాక్టివేట్ చేశాడు. ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 7 మధ్య కాలంలో 13 బ్యాంకు ఖాతాల్లోకి రూ.21.6 కోట్లు బదిలీ చేసుకున్నాడు. ఆ డబ్బుతో మనోడు జల్సాలు మొదలు పెట్టాడు. ఈ డబ్బుతో రూ.1.2 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ కారు, రూ.1.3 కోట్ల విలువైన ఎస్‌యూవీ, రూ.32 లక్షల విలువైన బీఎండబ్ల్యూ బైక్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్షల్ తన ప్రియురాలికి ఛత్రపతి శంభాజీనగర్ విమానాశ్రయం సమీపంలో ఖరీదైన 4 బెడ్‌రూంల ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ కోసం వజ్రాలు పొదిగిన ఒక జత గాజులను కూడా ఆర్డర్ చేశాడు. ఈ భారీ మోసంలో మరికొంత మంది ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు, ఇప్పుడు డబ్బు కాజేసేందుకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన పత్రాలను సేకరిస్తున్నారు. హర్షల్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా లగ్జరీ వాహనాలను సీజ్ చేశారు.

ehatv

ehatv

Next Story