కోట్ల కొద్దీ డబ్బు ఉంటే సరిపోదు. మంచి మనసు కూడా ఉండాలి.
కోట్ల కొద్దీ డబ్బు ఉంటే సరిపోదు. మంచి మనసు కూడా ఉండాలి. అప్పుడే సంపన్నుడు అనిపించుకుంటారు. ఇలాంటి సంపన్నుడే లులు గ్రూపు(Lulu Group) అధినేత ఎంఎ యూసుఫ్ అలీ(Yusuf ali). అప్పుడు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు ఆయన అండగా నిలిచారు. ఆమె అప్పు మొత్తాన్ని చెల్లించడమే కాకుండా, అదనంగా మరో పది లక్షల రూపాయలు ఇచ్చారు. కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇంటి నిర్మాణం కసం ఓ ప్రైవేటు సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్‌గా తీసుకుంది. ఇంటి నిర్మాణ ఖర్చు పెరగడంతో మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను, పిల్లలను వదిలేసి భర్త ఎక్కడికో వెళ్లిపోయాడు. దాంతో సంధ్యకు కుటుంబ పోషణ చాలా కష్టమయ్యింది. వడ్డీలతో కలిసి అప్పు మరింత భారమయ్యింది. సకాలంలో ఆమె లోన్ తీర్చకపోవడంతో వడ్డీతో కలిసి 8 లక్షల రూపాయలయ్యింది. లోన్ ఇచ్చిన సంస్థ ఇంటిని స్వాధీనం చేసుకుంది. కట్టుబట్టలతో, పిల్లలతో సంధ్య రోడ్డున పడింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది తెలుసుకున్న యూసఫ్ అలీ వెంటనే రియాక్టయ్యారు. సంధ్య లోన్ మొత్తాన్ని చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. వారి జీవితం సాఫీగా సాగడానికి మరో పది లక్షలు ఇవ్వాలని చెప్పారు. దాంతో సంధ్య ఇప్పుడు హప్పీ. లులు మాల్ అధినేతను అందరూ మెచ్చుకుంటున్నారు.