అసలు రామాలయం(Ramalayam) లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ మాటకొస్తే జగమే రామమయం! అయినప్పటికీ ఆ రఘురాముడికి ఆలయాలు నిర్మించి జన్మ ధన్యం చేసుకున్న మహనీయులెందరో ఉన్నారు. కుంభకోణంలోని రామస్వామి ఆలయం(Kumbakonam Sri Ramaswamy Temple) ఇలాంటిదే! తమిళనాడు(Tamil Nadu)లోని తంజావూర్ జిల్లాలో ఉంది కుంభకోణం!
అసలు రామాలయం(Ramalayam) లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఆ మాటకొస్తే జగమే రామమయం! అయినప్పటికీ ఆ రఘురాముడికి ఆలయాలు నిర్మించి జన్మ ధన్యం చేసుకున్న మహనీయులెందరో ఉన్నారు. కుంభకోణంలోని రామస్వామి ఆలయం(Kumbakonam Sri Ramaswamy Temple) ఇలాంటిదే! తమిళనాడు(Tamil Nadu)లోని తంజావూర్ జిల్లాలో ఉంది కుంభకోణం! ఇక్కడ ఆలయాలు అనేకం. అవి కూడా సుప్రసిద్ధం. ఇందులో రామస్వామి ఆలయం మరీ ప్రసిద్ధం! క్రీస్తుశకం 1614 నుంచి 1640 సంవత్సరం వరకు తంజావూరును పరిపాలించిన రఘునాయకుడికి రాముడంటే వల్లమాలిన భక్తి! గుండె గుడిలో కొలువైన రాముడి కోసం ఓ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు రఘునాయకుడు! అన్నట్టు ఆయన మంత్రి గోవింద దీక్షితార్ కూడా రామభక్తుడే! రాజుగారు ఆలయ నిర్మాణ కర్త అయితే మంత్రి నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను చూసుకున్నాడు. అలా ఈ అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంది.
ఈ ఆలయ నిర్మాణం వెనుక భగవంతుడి ప్రేరణ ఉంది. రామస్వామి ఆలయానికి సమీపంలోనే దారాసురం ఉంది. అక్కడ ఓ చెరువును తవ్వించాలనుకున్నాడు రఘునాయకుడు. భూమిని తవ్వగానే సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. దాంతోపాటే మిగతా విగ్రహాలు. రాజుకు అమితానందం వేసింది.వెంటనే కుంభకోణం మధ్యలో ఓ ఆలయాన్ని కట్టేసి దానికి రామస్వామి ఆలయం అని పేరు పెట్టారు. సుమారు నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. ఆలయంలోని విగ్రహాలను సాలిగ్రామ శిలలతో చెక్కారు. ఒక్కో విగ్రహం ఎనిమిది అడుగుల మించి ఎత్తు ఉంటుంది. సీతారాములిద్దరూ ఒకే పీఠంపై ఉంటారు. ఓ పక్క శత్రుఘ్నడు అన్నావదినలకు చామరం వీస్తూ ఉంటాడు. భరతుడేమో ఛత్రంపట్టి ఉంటాడు. లక్ష్మణుడు వీరి రక్షణ బాధ్యతలో ఉంటాడు. వీర భక్త హనుమంతుడేమో ఓ చేతిలో వీణ. మరో చేతిలో రామాయణం ధరించి రామగానం చేస్తున్నట్టు ఉంటాడు. వీణ చేతపట్టుకుని ఉన్న మారుతి విగ్రహం మరెక్కడా ఉండదేమో! అయోధ్యలో కూడా విగ్రహాలు ఇలాగే ఉంటాయి.అందుకే ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్యగా పిలుచుకుంటారు. ఇలా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి! ఆలయం ముందుభాగంలో 62 స్తంభాలతో కూడిన మండపం ఉంది. స్తంభాలన్నీ ఏకశిలలో నిర్మించినవే కావడం విశేషం. స్తంభాల మీద సుగ్రీవ పట్టాభిషేకం, విభీషణ పట్టాభిషేకం, అహల్యా శాప విమోచనం ఇత్యాది రామాయణ ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు రామాయణం కళ్లముందు కదలాడుతుంది. కారణం గోడలపై రామాయణంలోని ప్రముఖ ఘట్టాల చిత్తరువులు ఉండటమే! మొత్తం 219 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ సహజసిద్ధమైన రంగులతో చిత్రించినవే! ఈ ఆలయంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున అయితే ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.ఆ రోజున సీతారామకల్యాణం వైభవోపేతంగా జరుగుతుంది.