కేరళ(Kerala) ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది.
కేరళ(Kerala) ప్రభుత్వం ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేరళ సీనియర్ ఐఏఎస్(IAS) అధికారిణి వాసుకి(Vasuki)ని విదేశాంగ కార్యదర్శిగా(Foreign Secretary) నియమించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన పినరయి విజయన్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కార్మిక, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు. విదేశీ సహకారానికి సంబంధించిన అంశాలు సైతం చూసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు గానూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఎంబసీలతో సమన్వయం కోసం న్యూఢిల్లీలోని కేరళ హౌజ్ రెసిడెంట్ కమిషనర్ సహకరిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదో లేదో వెంటనే విపక్షాలు విమర్శనాస్త్రాలను గుప్పించడం మొదలు పెట్టాయి. బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ తీవ్రంగా రియాక్టయ్యారు. ఈ నిర్ణయం రాజ్యాంగంలోని కేంద్ర అధికారాల జాబితాను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ఇది తీవ్రమైన అతిక్రమణ అని, విదేశీ వ్యవహారాలపై ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని , ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అని పేర్కొన్నారు.