Nimisha Priya : బ్లడ్ మనీ డీల్ అంటే ఏమిటి? నిమిషా మరణాన్ని తప్పించుకోగలదా?
దేశం కానీ దేశం వెళ్లి బిడ్డ కష్టాల్లో పడింది. చావు అంచున నిలుచుకుంది. ఇలాంటి సమయంలో ఏ తల్లి అయినా తల్లడిల్లుతుంది. కూతురును కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా వెళుతుంది. ప్రేమకుమారి(Prema Kumari) అనే మాతృమూర్తికి ఇలాంటి కష్టమే వచ్చిపడింది. దాన్ని కష్టమని ఆమె అనుకోవడం లేదు. తన కూతురు బతికుంటే అదే చాలనుకుంటోంది.
దేశం కానీ దేశం వెళ్లి బిడ్డ కష్టాల్లో పడింది. చావు అంచున నిలుచుకుంది. ఇలాంటి సమయంలో ఏ తల్లి అయినా తల్లడిల్లుతుంది. కూతురును కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా వెళుతుంది. ప్రేమకుమారి(Prema Kumari) అనే మాతృమూర్తికి ఇలాంటి కష్టమే వచ్చిపడింది. దాన్ని కష్టమని ఆమె అనుకోవడం లేదు. తన కూతురు బతికుంటే అదే చాలనుకుంటోంది. పరాయి దేశంలో అనుకోని పరిస్థితులలో హత్యకేసులో(Murder case) చిక్కుకుని ప్రాణాల మీదకు తెచ్చుకున్న కూతురును రక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఆ దేశం వెళ్లి బాధితులతో నేరుగా మాట్లాడి ఒప్పందం చేసుకుంటే కానీ తన బిడ్డ ప్రాణాలతో బయటపడదు. కాకపోతే ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ పౌరులకు అనుమతి లేదు. అయినప్పటికీ ఆ తల్లి న్యాయస్థానంలో పోరాడింది. అతి కష్టం మీద అనుమతి తెచ్చుకుంది. ఇప్పుడు ఆ దేశానికి వెళ్లేందుకు రెడీ అయ్యింది. అక్కడ వారితో బ్లడ్ మనీ డీల్ చేయబోతున్నది. ఇంతకీ బ్లడ్ మనీ డీల్ అంటే ఏమిటి? ఆ కన్నతల్లి కథ ఏమిటి?
కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నిమిషా ప్రియ(Nimisha Priya) అనే నర్సు 2011లో ఉద్యోగాన్ని వెతుక్కుంటూ యెమెన్‌కు(Yemen) వెళ్లింది. అక్కడ సనాలో నర్సుగా పని చేసేది. 2017లో యెమెన్ పౌరుడైన తలాల్ అబ్దో మహదీని హత్య చేసింది. అందుకు కారణం ఆమె పాస్‌పోర్ట్‌ను తీసుకుని ఇవ్వకపోవడమే! పైగా వేధింపులు కూడా ఎక్కువ కావడంతో గత్యంతరం లేక మహదీన్‌కు మత్తు మందులను ఇంజెక్ట్(Injection) చేసింది. దాంతో అతడు మరణించాడు. ఏం చేయాలో నిమిషాకు పాలుపోలేదు. తన సహోద్యోగి హనన్ సాయంతో ట్యాంకులో పడేసే క్రమంలో మహదీని శవాన్ని ముక్కలు చేసింది. తప్పించుకోవచ్చని అనుకుంది కానీ పోలీసులకు దొరికిపోయింది. యెమెన్ ట్రయల్ కోర్టు(Yemen Trial Court) కేసుని విచారించి నిమిషాకు మరణశిక్ష విధించింది. ఆమె సహోద్యోగికి జీవితఖైదు విధించింది. 2018 నుంచి నిమిషా యెమెన్ కారాగారంలోనే ఉంది. అప్పట్నుంచి నిమిషాను రక్షించడానికి ఆమె కుటుంబం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది. నిమిషా కుటుంబం యెమెన్ సుప్రీం కోర్టుకు(Supreme Court) కూడా అప్పీలు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక నిమిషా కుటుంబానికి మిగిలిన ఏకైక ఆశ బాధితుడి కుటుంబంతో చేసుకునే బ్లడ్‌మనీ డీల్(Blood Money Deal) ఒప్పందం ఒక్కటే. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం నిమిషాకు శిక్ష తప్పుతుంది. ప్రాణాలతో బయటపడుతుంది. ఇందుకోసం ప్రేమకుమారి యెమెన్‌కు వెళ్లాలనుకుంది. కానీ 2017లో కేంద్రం యెమెన్‌కు ట్రావెల్ బ్యాన్ విధించింది. అంటే ప్రభుత్వ అనుమతి లేకుండా యెమెన్‌కు వెళ్లడం అసాధ్యమన్నమాట!ఆమె ఢిల్లీ కోర్టు తలుపుతట్టింది. కోర్టు ధర్మాసనం ప్రేమ కుమారి విషయాన్ని మానవతాదృక్పథంతో తీసుకుంది. ప్రేమకుమారి విషయంలో సడలింపు ఇవ్వాలని, ఆమెకు తన కూతురుని రక్షించుకోవడానికి యెమెన్ వెళ్లేలా అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయితే యెమెన్‌తో భారత్‌కు దౌత్య సంబంధాలు లేవని, అక్కడి రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశామని కేంద్రం తెలిపింది. అందువల్ల ఆ దేశంతో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవని కేంద్రం హైకోర్టుకి తెలిపింది. దాంతో హైకోర్టు ఓ ఆలోచన చేసింది. భారత ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేకుండా తన సొంత పూచీతో ప్రయాణిస్తానని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రేమకుమారిని హైకోర్టు కోరింది. ఆమె దాఖలు చేసింది. ఫలితంగా యెమెన్ వెళ్లి తన కూతురు విడుదల కోసం బ్లడ్ మనీ డీల్ చేసుకోవడానికి అనుమతి మంజూరు చేసింది ఢిల్లీ. బ్లడ్ మనీ డీల్ అంటే నిమిషాను విడుదల చేయడానికి బాధితురాలి కుటుంబం నిర్ణయించిన పరిహారం ఇచ్చేలా నేరుగా చర్చలు జరపడం. ఇందుకు ఆ తల్లి అక్కడి వెళ్లడం చాలా ముఖ్యం. ఇవాళ ఆమె యెమెన్‌కు వెళ్లింది. చర్చలు కూడా ఫలప్రదమయ్యి, నిమిషా క్షేమంగా ఇండియాకు రావాలని కోరుకుందాం!