కేరళలో(Kerala) మరోసారి నిపా వైరస్‌(Nipah virus) భయాందోళనలు రేకెత్తిస్తోంది.

కేరళలో(Kerala) మరోసారి నిపా వైరస్‌(Nipah virus) భయాందోళనలు రేకెత్తిస్తోంది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు నిపా బారిన పడ్డాడని తెలిసి రాష్ట్రం ఉలిక్కిపడింది. ఆరోగ్యశాఖ(Health ministry) అప్రమత్తమయ్యింది. ఆరోగ్య కేంద్రాలను అలర్ట్‌ చేసింది. బాలుడికి నిపా వైరస్‌ సోకినట్టు పూణే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(Natinal institute Of virology) నిర్ధారించింది. ప్రస్తుతం ఆ పిల్లవాడు ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలిస్తామని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. ఆ పిల్లోడిని పూర్తి వైద్యుల పరిశీలనలో ఉంచి చికిత్స చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు. హైరిస్క్‌ కాంటాక్ట్‌లు ఇప్పటికే వేరుచేసి నమునాలను పరీక్ష కోసం పంపినట్లు కూడా చెప్పారు. ప్రస్తుతం ఆ 14 ఏళ్ల బాలుడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సమీప ఆస్పత్రులన్నింటిలోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు మాస్క్‌ ధరించాలని, రోగులు ఆస్పత్రులను సందర్శించే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలని వీణా జార్జ్‌ తెలిపారు. బాధిత బాలుడి పాండిక్కాడ్‌ గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించారు అధికారులు. సమీప ప్రాంతాల్లోని ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమీప మంజేరి వైద్య కళాశాలలో ఆరోగ్య శాఖ 30 ఐసోలేషన్‌ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసింది. నిపా వైరస్‌ సోకిన బాలుడితో పరిచయం ఉన్నవారందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు.

నిపా వైరస్‌ సోకితే తీవ్రమైన తలనొప్పి, అలసట, వాంతులు, మూర్ఛతో పాటు చూపు కూడా మందగిస్తుంది. జ్వరం వస్తుంది. ఈ వ్యాధి శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుందని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా దగ్గు, తుమ్ముల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెబున్నారు. సాధ్యమైనంత వరకు చేతులను వీలైనన్ని సార్లు కడుక్కోవాలని, వ్యాధిగ్రస్తులను సందర్శించడం, అంటు వ్యాధులు ప్రబలే ప్రాంతాలకు వెళ్లకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పక్షులు లేదా జంతువులు సగం తిన్న పండ్లను తినకూడదని హెచ్చరిస్తున్నారు. బహిరంగ కంటైనర్లలో నిల్వ ఉంచిన కల్లు వంటి పానీయాలను అసలు తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story