వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story) సెన్సార్‌ పూర్తయ్యింది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు మాజీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూతో పాటు పది దృశ్యాలపై కత్తెర వేసింది. మత సామరస్యానికి పెట్టని కోటగా ఉన్న కేరళలో ఈ సినిమా ద్వారా విద్వేషాలు రగల్చడానికి చేస్తున్న కుటిల ప్రయత్నంగా కొందరు ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి వ్యతిరేకంగా కేరళలో నిరసనలు హోరెత్తుతున్నాయి.

వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story) సెన్సార్‌ పూర్తయ్యింది. మరో మూడు రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఏ సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు మాజీ ముఖ్యమంత్రి ఇంటర్వ్యూతో పాటు పది దృశ్యాలపై కత్తెర వేసింది. మత సామరస్యానికి పెట్టని కోటగా ఉన్న కేరళలో ఈ సినిమా ద్వారా విద్వేషాలు రగల్చడానికి చేస్తున్న కుటిల ప్రయత్నంగా కొందరు ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి వ్యతిరేకంగా కేరళ(Kerala)లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ నెల 5న సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఆలోపుగానే చిత్రాన్ని బ్యాన్‌ చేయించాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అధికార సీపీఐ(ఎం), ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఈ సినిమాను ప్రొపగాండ చిత్రమని విమర్శలు చేస్తున్నాయి. కట్టకథల ద్వారా కశ్మీర్‌ఫైల్స్‌ను రూపొందించి సంఘీయులు ఏం సాధించారో ఈ సినిమా ద్వారా అదే సాధించాలని కుటిలయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ఇక ది కేరళ స్టోరీలో చూపించిన దృశ్యాలు వాస్తవాలని నిరూపించాలని కొందరు ఆ చిత్ర దర్శక నిర్మాతలకు సవాళ్లు విసురుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో రెండో అతిపెద్ద భాగస్వామి పార్టీ అయిన ఐయూఎంఎల్‌ తరపున యువజన విభాగం ‘ది కేరళ స్టోరీ’పై భారీ నజరానా ప్రకటించింది. ఆ సినిమా కథాంశం నిజమని ఎవరైనా నిరూపిస్తే వారికి కోటి రూపాయలను కానుకగా ఇస్తామని ఐయూఎంఎల్‌ యూత్‌ వింగ్‌ ముస్లిం యూత్‌ లీగ్‌ చీఫ్‌ పి.కె.ఫిరోజ్‌ ప్రకటించారు. నజీర్‌ హుస్సేన్‌ అనే బ్లాగర్‌ కూడా నజరానాలు ప్రకటించారు. నిజంగా జరిగిన సంఘటనతో సినిమాను తీశారని నిరూపించాలని, అందుకు తగిన ఆధారాలు చూపితే పది లక్షల రూపాయలు ఇస్తానని నజీర్‌ హుస్సేన్‌ ప్రకటించారు. సినిమాల్లో నటిస్తూ, లాయర్‌ వృత్తిని కూడా కొనసాగిస్తున్న షుక్కుర్‌ కూడా ఛాలెంజ్‌ విసిరారు. మీరు చెబుతున్నట్టు మతం మార్చుకుని ఐసిస్‌లో చేరిన అమ్మాయిల పేర్లతో కూడిన లిస్ట్‌ను ఇస్తే వారికి 11 లక్షల రూపాయలు ఇస్తానని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.

కేరళలోని అధికార, విపక్షాలు తమ రాష్ట్రంలో ఈ సినిమాను విడుదల కానివ్వబోమని అంటున్నాయి. ఈ విషయంలో బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపై ఉన్నాయి. సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ నిషేధించాల్సిందేనని పట్టుబడుతున్నాయి. ఈ చిత్రం రూపకల్పన వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉందని అంటున్నాయి. కేరళ నుంచి 32 వేల మంది అమ్మాయిలను మతం మార్పించి సిరియాకు తీసుకెళ్లారని, ఆ లెక్కల తమ దగ్గర ఉన్నాయని సంఘీయులు అంటున్నారు. ప్రతీ పంచాయితీ నుంచి 30 మందిని తీసుకెళ్లారని చెబుతున్నారు. కానీ వాళ్ల అడ్రస్‌లు అడిగితే మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారని అని పి.కె.ఫిరోజ్‌ చెబుతున్నారు. ఒకవేళ చిత్రం రిలీజ్‌ అయితే మాత్రం ప్రజలు స్వచ్ఛంగా దాన్ని బహిష్కరించాలని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి షాజి చెరియన్‌ పిలుపిచ్చారు. ది కేరళ స్టోరీ సినిమా కచ్చితంగా మత విద్వేషాలను రగల్చడానికి తీసిందేనని ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో లబ్ధి పొందడానికి బీజేపీ కమ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంతకైనా దిగజారుతాయని విమర్శించారు. నలుగురు కాలేజీ అమ్మాయిలు ప్రధానపాత్రలుగా ఈ సినిమాను రూపొందించారు. 2018-2019 మధ్య కేరళలో 32 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వారికి బ్రెయిన్‌వాష్‌ చేయడంతో వారంతా ఇస్లాంలోకి మారిపోయారని, ఆ తర్వాత ఐసిసి వంటి ఉగ్రవాద సంస్థలలో చేరానని, స్వదేశానికి వచ్చి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నది ది కేరళ స్టోరీలో చెప్పబోతున్నారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధీ ఇద్నాని, సోనియా బలానీ ప్రధానపాత్రలు పోషించారు. విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుదిప్తో సేన్‌ దర్శకత్వం వహించారు. సూర్యపాల్‌సింగ్‌, విపుల్‌ అమృత్‌లాల్‌ షా కథను అందించారు. చిత్రమేమిటంటే వీరెవ్వరికీ కేరళతో సంబంధం లేదు. కేరళ సంస్కృతీ సంప్రదాయాలపై అవగాహన లేదు. తాము తీసింది కరెక్టేనని చెప్పుకుంటున్నారు. వాస్తవాలు చేదుగా ఉన్నా అంగీకరించక తప్పదని విపుల్‌ అమృత్‌పాల్‌ షా అంటున్నారు.

కేరళకు చెందిన ఓ హిందూ యువతి ఇస్లాం మతం తీసుకుని సిరియాకు వెళ్లిందని, ఇప్పుడు అఫ్గనిస్తాన్‌ జైలులో ఉందని చెబుతున్న విపుల్‌ ఆమె కుటుంబసభ్యల నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే సినిమాను తీశామని అంటున్నారు. సెన్సార్‌ ఓకే అన్న తర్వాత సినిమాను ఎలా నిషేధిస్తారు అని ప్రశ్నిస్తున్నారు సుదిప్తో సేన్‌. షూట్‌ అవుట్‌ ఎట్‌ లోఖాండ్‌వాలా సినిమా అంతా ముంబాయిలోనే షూటింగ్‌ జరుపుకుంది. అంత మాత్రాన ముంబాయిలో మొత్తం రౌడీలు ఉన్నట్టు అర్థం కాదు కదా అంటూ లాజిక్కులు తీస్తున్నారు. గాడ్స్‌ ఓన్‌ కంట్రీగా పిలుచుకునే కేరళలో కూడా కొన్ని నేరాలు జరిగాయి. తాను కేరళను అభిమానిస్తాను కాబట్టి ఆ నేరాల వెనుక ఎవరు ఉన్నా వారికి శిక్ష పడాలన్నదే తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇది ముస్లింలకు వ్యతిరేకంగా తీసిన సినిమా కాదని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసిన సినిమా అని వివరణ ఇచ్చుకున్నారు.

Updated On 1 May 2023 11:41 PM GMT
Ehatv

Ehatv

Next Story