దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. దీంతో ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ..ఈడీ విచారణ నేపథ్యంలో ఈ ఉత్కంఠ నెలకొంది. మార్చి 9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది..కానీ ముందస్తు కార్యక్రమాలు ఉండటంతో మార్చి 11 న విచారణకు హాజరవుతానని చెప్పడంతో ... ఈ విచారణను ఈ రోజుకు వాయిదా వేసారు. పార్లమెంట్ లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ నిన్న ఢిల్లీలో నిరాహార ధర్నా చేసారు .
ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు కవిత ఈడీ విచారణ మొదలుకానుంది. మరోవైపు లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఏడుగురికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ ముందు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మరికొంతమందికి నోటీసులివ్వడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే నిందితులకు సంబంధించిన ఛార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టులలో కవిత పేర్లను పలుమార్లు ఈడీ ప్రస్తావించింది. దీంతో కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం టీ పాలిటిక్స్‌లో జోరుగా జరుగుతోంది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ...కవితను ఈడీ అరెస్ట్ చేయవచ్చని అనడంతో ఇవాళ ఏం జరగబోతుందనేది ఉత్కంఠకరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించే అవకాశాలున్నాయి.
ఇవాళ సౌత్ గ్రూఫ్ ఫండింగ్, లిక్కర్ స్కాంలోని పాత్ర, నిందితులతో భేటీలు లాంటి అంశాలపై కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ విచారణ పేపథ్యంలో హస్తినలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈడీ కార్యాలయం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు కవితకు సపోర్ట్‌గా ఉండేందుకు ఢిల్లీ వెళ్లారు. కవితను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో న్యాయ నిపుణులతో కేటీఆర్, హరీష్ సుదీర్ఘంగా చర్చలు జరపుతున్నారు. ఒకవేళ కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? ఎలా ఎదుర్కొవాలి? అనే అంశాలపై న్యాయవాదులతో లోతుగా చర్చిస్తున్నారు.