వసంతానికి స్వాగతం పలుకుతూ రంగుల పండుగ వెళ్లిపోయింది. అయినా ప్రపంచం రంగులమయంగానే ఉంది. వసంతానికి స్వాగతం పలుకుతున్న ప్రకృతే రంగులు దిద్దుకుంటోంది. రంగుల పండుగ హోలీ(Holi Festival) తర్వాత మూడు రోజులకు గుజరాత్‌లోని(Gujarat) కవంట్లో(kavant ) బ్రహ్మాండమైన ఓ సమ్మేళనం జరుగుతుంది. ఆకర్షణీయమైన ఆ ఉత్సవాన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా కవంట్కు వెళతారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం మార్చి 28వ తేదీన మొదలు కాబోతున్నది. మార్చి 29వ తేదీన మేళాను ముగిస్తారు. రాథ్వా తెగ(Rathva tribes) ప్రజలు ఈ వేడుకను జరుపుకుంటారు.
హోలీ పండుగకు ఇది కొనసాగింపు అయిన ఈ ఉత్సవాన్ని కవంట్ ఫెయిర్(Kavant Fair) అంటారు. అచ్చ తెలుగులో కవంట్ మేళా అన్నమాట! గుజరాత్‌లోని వదోదరకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కవంట్ అనే గ్రామం. ఛోటా ఉదేపూర్ జిల్లాలో ఉందీ గ్రామం! అక్కడ నివసిస్తున్నది రాథ్వా అనే గిరిజన తెగ! మేళా రోజున రాథ్వా తెగ ప్రజలంతా ఒక్క చోటకు చేరతారు. అదో సమ్మేళనం. పెద్ద ఉత్సవం . రోజంతా ఆ ఉత్సవంలో ఉత్సాహంగా గడుపుతారు.
కవంట్ పండుగ ఓ రకంగా వ్యవసాయ పండుగ! ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని వివరించే పండుగ! ఎన్నేళ్ల నుంచి ఈ వేడుక జరుగుతుందో తెలియదు కానీ కొన్నేళ్ల చరిత్రే ఉంది! చరిత్రలో మిగిలిపోయేటంత గొప్పదనం ఉంది.! సాంస్కృతిక దాడులో మరోటో తెలియదు కానీ చాలా ఉత్సవాలు , పండుగలు మరుగున పడుతున్న సమయంలో రాథ్వా ప్రజలు మాత్రం తమ సంప్రదాయాలను మరవకుండా కవంట్ మేళాను జరుపుకుంటూ వస్తున్నారు. ఆడ మగ అన్న తేడా లేకుండా , చిన్నా పెద్ద అన్న అంతరం లేకుండా అందరూ కలసి ఆనందోత్సవాలతో జరుపుకునే వేడుక ఇది!
ఆ సమ్మేళనం రాథ్వా ప్రజలకు ఓ కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. ఉత్సవాలలో కాసింత విరామం దొరికితే ఎడతెగని ముచ్చట్లతో గడిపేస్తారు. ఆ కొద్ది సమయంలోనే సంబంధ బాంధవ్యాలన్నీ చర్చకు వస్తాయి. అసలు ఆ రోజున వారిలో వెల్లివెరిసే ఉత్సాహాన్ని చూస్తే ఆశ్చర్యపోతాం! రాథ్వా సంస్కృతి మోహంలో కొట్టుకునిపోతాం! రాథ్వా తెగ ప్రజలు గుజరాత్లో అధిక సంఖ్యలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోనూ రాథ్వా ప్రజలు నివసిస్తున్నారు. ఒకప్పుడు వేట వీరి ప్రధాన వృత్తి.
ఇప్పుడు వేట లేదు. బతుకుతెరువు కోసం అన్ని పనులు చేస్తున్నారు. ఏ వృత్తిలో ఉన్నా అందరూ ఒక్కటిగానే జీవిస్తారు. సంగీతం ,అందులోనూ వేణువు వీరి జీవితంలో భాగం. చిత్రలేఖనం వీరికి సహజసిద్ధంగా అబ్బే కళ! తమ నివాసాలను ఎంతో చక్కగా అలంకరించుకుంటారు. మేళాలో వింత వింత వేషధారణలతో రాథ్వా ప్రజలు ఆకట్టుకుంటారు. ఎక్కువగా దేవుళ్ల వేషాలనే వేస్తారు. అలా వేషాలు వేసినవారు ఆటపాటలతో ఊరేగింపుగా వెళతారు. కొంతమంది చేతుల్లో చెరుకుగడలు ఉంటాయి. వ్యవసాయానికి ఇది ప్రతీక అనుకోవచ్చు. మొత్తం మీద కవంట్ మేళాను సందర్శించడం ఓ తీయని అనుభూతి!