కర్నాటకలో ఓ లేడి కిలాడీ చట్టాలను అడ్డుపెట్టుకుని అమాయక యువకులను ముప్పు తిప్పలు పెట్టింది.

కర్నాటకలో ఓ లేడి కిలాడీ చట్టాలను అడ్డుపెట్టుకుని అమాయక యువకులను ముప్పు తిప్పలు పెట్టింది. వారిపై తప్పుడు కేసులు పెట్టి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా పది మంది యువకులు ఆమె చేతిలో దారుణంగా మోసపోయారు. కర్నాటక హైకోర్టు(Karnataka High Court)జడ్జిని కూడా ఆశ్చర్యానికి గురి చేసిన ఆ మహిళ క్రైమ్‌ కథ ఏమిటో చూద్దాం. ఆ మహిళ పేరు దీపిక(Deepika). ఇప్పటి వరకు పది మంది యువకులకు వల విసిరింది. పాపం ఈమె ఎలాంటిదో తెలియక ఆ పది మంది యువకులు ఆ సాలెగూట్లో చిక్కుకున్నారు,. ఒకరి తర్వాత ఒకరిని ఇలా పది మందిని ఆమె పెళ్లి చేసుకుంది. వారితో సంబంధాలు పెట్టుకుంది. కొన్ని రోజులు వారితో కాపురం చేసిన తర్వాత వారిపై అత్యాచారం కేసు పెట్టేది. ఇలాగే కొడగు జిల్లాలోని కుశాల్‌నగర్‌కు చెందిన నితిన్‌ను బుట్టలో వేసుకుంది. మైసూర్‌లోని హోటల్‌ లలిత్‌ మహల్‌ ప్యాలెస్‌లో ఓ వ్యాపార పనికి సంబంధించి 2022 ఆగస్టు 28న కలుసుకున్నారు. తర్వాత అది ప్రేమగా మారింది. ఆ ప్రేమ మరింత గట్టిపడింది. ఇద్దరు కలిసి కొన్ని రోజులు కాపురం చేశారు. తర్వాత నితిన్‌(Nithin)పై దీపిక రేప్‌ కేసు పెట్టింది. కుశాల్‌నగర్ పోలీసులు ఇరువురిని కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 19వ తేదీన నితిన్‌పై మరో కేసు పెట్టింది దీపిక. తనను వివాహం చేసుకున్నాడని వెంటనే తనను విడిచిపెట్టాడని కంప్లయింట్‌ చేసింది. ఈ వ్యవహారం కర్ణాటక హైకోర్టుకు చేరింది. కోర్టులో నితిన్, అతని కుటుంబ సభ్యులు దీపిక పుట్టుపూర్వోత్తరాలను వివరించి చెప్పారు. దీపిక వేసిన 10వ కేసుకు నితిన్‌ బాధితుడని కోర్టుకు విన్నవించుకున్నారు. అత్యాచారం, క్రూరత్వం, బెదిరింపులు, మోసం తదితర ఆరోపణలపై 2011 నుంచి దీపిక వేరువేరు భర్తలు/ భాగస్వాములపై ​​10 ఫిర్యాదులు చేశారని జస్టిస్ నాగప్రసన్న(Justice nagaprasanna)తెలిపారు. బెంగళూరు(Bengaluru)లోని వివిధ పోలీస్ స్టేషన్లలో చాలా ఫిర్యాదులు నమోదయ్యాయని, చిక్కబళ్లాపూర్, ముంబాయిలలో ఒక్కో కేసు నమోదైందన్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఇది హనీ ట్రాప్ అని వెల్లడించారు. మహిళా కార్డును అడ్డుపెట్టుకుని దీపిక మోసాలకు పాల్పడుతుందని కోర్టు భావించింది. దీపిక నిరంతరాయంగా అబద్ధాలు చెబుతూ ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేస్తుందని కోర్టు విచారణలో తేలింది. ప్రతి విచారణలో కూడా ఆమె గైర్హాజరు అవుతోంది. ఫిర్యాదుదారు ఒకసారి కూడా ఈ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి తెలిపారు. ఫిర్యాదు దారుడు కేసు నమోదు చేయాలనుకునే పోలీస్ స్టేషన్ ముందు సరైన ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేయకూడదని సూచించింది. చట్టాలను అడ్డు పెట్టుకుని అమాయక యువకులపై తప్పుడు కేసులు నమోదు చేసేది. అందువల్ల, డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజి-ఐజిపి)కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మహిళ గురించి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయండి. యువకులను జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని కోర్టు సూచించింది. నితిన్‌పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని కోర్టు ఆదేశించింది.

ehatv

ehatv

Next Story