కేరళలోని(Kerala) శబరిమల ఆలయం(Sabarimala Temple) భక్తులతో కిటకిటలాడుతోంది. అయ్యప్ప స్వామిని(Ayyappa swamy) దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతోంది.

Sabarimala Temple
కేరళలోని(Kerala) శబరిమల ఆలయం(Sabarimala Temple) భక్తులతో కిటకిటలాడుతోంది. అయ్యప్ప స్వామిని(Ayyappa swamy) దర్శించుకోవడానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అయ్యప్ప స్వామి దర్శనానికి సుమారు 20 గంటలకు పైగా సమయం పడుతోంది. మరోవైపు దర్శనం ఆలస్యం అవుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. ఇదిలా ఉంటే క్యూలైన్ల నిర్వహణలో ఆలయ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. అయ్యప్ప దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుండటంతో భక్తులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. కర్ణాటకకు(Karnataka) చెందిన భక్తులు పందళంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి, అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి తిరుగుపయనమయ్యారు. ఇక శబరిమల రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయిదు రోజులుగా ఇదే పరిస్థితి. శబరిమలకు చేరుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంబ చేరుకుని తిరిగి వెళ్లాలంటే వారికి కష్టమవుతోంది. తమ వాహనాలను అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు భక్తులు. రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడంతో తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్ అంటున్నారు. ఇలాంటి సందర్భాలలో సమస్యలు తలెత్తడం సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిలో అత్యధికులు దర్శనం చేసుకోకుండానే వెనక్కి వచ్చేస్తున్నారు.
