ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఒక్కొక్కరు.. ఒక్కో లొకేషన్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రినే ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్ గా ఫిక్స్ చేసుకున్నారు.
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్(Pre wedding shoot) కోసం ఒక్కొక్కరు.. ఒక్కో లొకేషన్ ను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అయితే కర్ణాటక(Karnataka)లోని చిత్రదుర్గ(chithra Durga)లోని ఓ ఆసుపత్రినే ప్రీ వెడ్డింగ్ షూట్ లొకేషన్ గా ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఆపరేషన్ థియేటర్(Operation Theatre)లో కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవడం వివాదానికి దారితీసింది. చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రాంతంలోని జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఆధారిత వైద్యుడు డాక్టర్ అభిషేక్(Abhishek) తన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు. వీడియోలో, డాక్టర్ అభిషేక్ ఒక రోగికి శస్త్రచికిత్స చేయడాన్ని చూడవచ్చు, అతని భాగస్వామి అతనికి సహాయం చేస్తూ కనిపించారు.
ప్రీ-వెడ్డింగ్ వీడియోను చిత్రీకరించడానికి ఆపరేషన్ థియేటర్‌లో కెమెరాలు, లైట్లు పట్టుకుని అనేక మంది వ్యక్తులు కూడా ఉండడం వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. దుమారం రేగడంతో కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు(Dinesh Gundu Rao), డాక్టర్ అభిషేక్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశించారు. "చిత్రదుర్గలోని భరమసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన డాక్టర్‌ని సర్వీసు నుండి తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉన్నాయి. వ్యక్తిగత పనుల కోసం కాదు. డాక్టర్ల నుండి ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని నేను సహించలేను" ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.
వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది సహా కాంట్రాక్టు ఉద్యోగులందరూ ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారమే విధులు నిర్వర్తించాలని, ప్రభుత్వంలో ఇలాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తపడాలని సంబంధిత వైద్యులను, సిబ్బందిని ఇప్పటికే ఆదేశించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు సేవ చేయడానికే కానీ ఇలాంటి పనుల కోసం కాదని అధికారులు తేల్చి చెప్పారు.