కర్ణాటకలో ఎన్నికలు(Karnataka Elections) వచ్చిన ప్రతీసారి టిప్పు సుల్తాన్(Tipu Sultan) తెరమీదకు వస్తుంటారు. అదేమిటో చనిపోయి 224 ఏళ్లయినప్పటికీ టిప్పు పేరు వాడుకోనిదే రాజకీయ పార్టీలకు నిద్రపట్టదు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని కమలదళం పదే పదే ఆరోపిస్తూ వస్తున్నది. ఆ విధంగా హిందువుల ఓట్లు పొందాలన్నది ఆ పార్టీ ఉద్దేశం.. ఇప్పుడు టిప్పు సుల్తాన్ మంచివాడా చెడ్డవాడా అన్నది వదిలేసి ఆయనను అసలు చంపింది ఎవరు? అన్నదానిపై రాజకీయ పార్టీలు తెగ చర్చించుకుంటున్నాయి.
కర్ణాటకలో ఎన్నికలు(Karnataka Elections) వచ్చిన ప్రతీసారి టిప్పు సుల్తాన్(Tipu Sultan) తెరమీదకు వస్తుంటారు. అదేమిటో చనిపోయి 224 ఏళ్లయినప్పటికీ టిప్పు పేరు వాడుకోనిదే రాజకీయ పార్టీలకు నిద్రపట్టదు. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని కమలదళం పదే పదే ఆరోపిస్తూ వస్తున్నది. ఆ విధంగా హిందువుల ఓట్లు పొందాలన్నది ఆ పార్టీ ఉద్దేశం.. ఇప్పుడు టిప్పు సుల్తాన్ మంచివాడా చెడ్డవాడా అన్నది వదిలేసి ఆయనను అసలు చంపింది ఎవరు? అన్నదానిపై రాజకీయ పార్టీలు తెగ చర్చించుకుంటున్నాయి. టిప్పు సుల్తాన్‌ను యుద్ధంలో చంపింది ఊరిగౌడ(Uri Gowda), నంజెగౌడ(Nanje Gowda) అంటూ బీజేపీ(BJP) కొత్త వాదనకు తెరతీసింది. ఇది బీజేపీ, కాంగ్రెస్BJP Vs Congress) మధ్య మాటలయుద్ధానికి నాంది పలికింది. జేడీ(ఎస్) కూడా బీజేపీ తీరును తిట్టిపోస్తోంది.
కర్ణాటకలో బలమైన సామాజికవర్గాలలో ఒకటైన ఒక్కలిగలలు దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిపై పోరాడిన వీరుడు. స్వాతంత్ర సమరయోధుడు. కాంగ్రెస్, జేడీ (ఎస్)లు ఈ స్టాండ్‌పైనే ఉన్నాయి. బీజేపీ మాత్రం టిప్పు సుల్తాన్‌ను హిందువులపై దాడులు చేసిన వ్యక్తి అంటూ వాదిస్తోంది. కళ్ల ముందు ఉన్న చరిత్రను మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఊరిగౌడ, నంజెగౌడ అనే రెండు పాత్రలను ప్రవేశపెట్టింది. 1799లో తెల్లవారితో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించారు. ఆ యుద్ధంలో బ్రిటిష్ తరఫున యుద్ధంలో పాల్గొన్న ఊరి గౌడ, నంజెగౌడ చేతుల్లోనే టిప్పు చనిపోయారంటూ బీజేపీ అంటోంది. . వీరిద్దరూ ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన యోధులని, చరిత్రలో వీరికి తగిన గుర్తింపు లభించలేదని బీజేపీ ప్రచారం చేస్తోంది. బీజేపీ ప్రచారాన్ని పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్, జేడీ (ఎస్) అధినేత కుమారస్వామిలు తప్పుపట్టారు. ఒక్కలిగ వర్గం ఐక్యతను దెబ్బ తీయడానికే బీజేపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కలిగ సామాజికవర్గం మఠాధిపతి నిర్మలానందస్వామి ఉద్యమం చేయాలని వారన్నారు.
బీజేపీ ఇప్పుడే ఎందుకు ఊరి గౌడ, నంజెగౌడ పేర్లను ప్రస్తావిస్తున్నదో అందరికీ తెలుసు. ఒక్కలిగ వర్గం ఓట్ల కోసమేనని రాజకీయాలు తెలియని వారు కూడా చెబుతారు. దక్షిణ కర్ణాటకలో ఒక్కలిగలు బలమైన సామాజికవర్గం. మాజీ ప్రధాని దేవేగౌడ కూడా ఒక్కలిగనే! ఆ సామాజికవర్గం మైసూరు, దక్షిణ కర్ణాటకలలో ఎక్కువగా ఉంటుంది. జేడీ (ఎస్) ఎక్కువ సీట్లు గెల్చుకునే ప్రాంతాలు ఇవి! జేడీ(ఎస్)కు పెట్టని కోటలివి. బీజేపీకి ఒక్కలిగల ఓట్లు అంతగా పడవు. ఈ విషయం కమలనాథులకు తెలియంది కాదు. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఒక్కలిగ సామాజికవర్గం ఓటర్లను ఆకట్టుకోవడమే మార్గమని బీజేపీ భావించింది. అందుకే వ్యూహాత్మకంగా కల్పితపాత్రలైన ఊరిగౌడ, నంజెగౌడల పేర్లను తెరపైకి తెచ్చింది. ఇలా ఒక్కలిగ ఓట్లను సాధించడంతో పాటు ముస్లింలను ఒక్కలిగలకు దూరం చేయగలమని బీజేపీ అనుకుంటోంది. అసలు ఊరిగౌడ, నంజెగౌడ అనే పేర్లే చరిత్రలో లేవు. చరిత్రలో లేని వ్యక్తులను సృష్టించి వారి పేర్లతో రాజకీయం చేయడం బీజేపీకి సాధ్యమని కాంగ్రెస్ అంటోంది. ఓట్ల కోసం బీజేపీ ఎంతటి నీచానికైనా దిగజారుతుందని విమర్శించింది. చరిత్రకారులు, మేధావులు ఎంత చెబుతున్నా బీజేపీ మాత్రం ఆ ఇద్దరిని వీరులుగా ప్రచారం చేస్తోంది. రాష్ట్ర మంత్రి, సినీ నిర్మాత మునిరత్న(Munirathna)అయితే ఊరిగౌడ, నంజెగౌడ్‌లపై సినిమా ప్లాన్ చేశారు. బీజేపీ ప్రచారాన్ని కర్ణాటక రాజ్య ఒక్కలిగ సంఘం(Rajya Vokkaligara Sangha) కూడా తప్పుపడుతోంది. ఊరిగౌడ, నంజెగౌడ అనే వ్యక్తులు టిప్పు సుల్తాన్‌ను చంపారనటానికి రుజువులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తోంది. చారిత్రక ఆధారాలు, రుజువులు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని బీజేపీని హెచ్చరించారు ఒక్కలిగ మఠాధిపతి నిర్మలానంద స్వామి. ఒక్కలిగలపై ఇప్పుడు ప్రేమను ఒలకబోస్తున్న బీజేపీ ఇప్పటి వరకు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఒక్కలిగ వర్గం సమస్యలపై దృష్టిపెట్టండి, రుజువుల్లేని ఇలాంటి చౌకబారు అంశాల మీద కాదు అని నిర్మలానందస్వామి అన్నారు. ఈ పరిణామాలను సునిశితంగా గమనించిన బీజేపీ మొదటికే మోసం వచ్చే ప్రమాదాన్ని శంకించింది. అందుకే కాసింత వెనక్కు తగ్గింది. మంత్రి మునిరత్న కూడా రిస్క్ ఎందుకని సినిమా ప్లాన్‌ను ఉపసంహరించుకున్నారు. కానీ బీజేపీలో ఉన్న ఒక్కలిగ నేతలు మాత్రం ఊరిగౌడ, నంజెగౌడలపై రుజువులు సంపాదిస్తామని అంటున్నారు. నిర్మలానంద స్వామి అంటే తమకు అపారమైన గౌరవమని, ఆయనను ప్రత్యక్షంగా కలిసి ఊరిగౌడ, నంజెగౌడలపై రుజులు సమర్పిస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సి.టి.రవి అంటున్నారు.
నిజానికి టిప్పు సుల్తాన్ మరణంపై ఇప్పటికే ఎన్నోసార్లు చర్చ జరిగింది. గత ఏడాది టిప్పువిన నిజ కనసుగలు పేరుతో ఓ నాటకం వచ్చింది. ఆ నాటకంలోని కల్పిత పాత్రలైన ఊరి గౌడ, నంజేగౌడ పేర్లు అప్పుడే బయటకు వచ్చాయి. అంతకు ముందు వరకు వీరిద్దరి గురించి కన్నడ ప్రజలకు కూడా అంతగా తెలియదు. ఈ నాటకానికి రంగాయణ థియేటర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అడ్డండ కరియప్పా దర్శకత్వం వహించారు. మరి ఈసారి ఎన్నికల్లో బీజేపీని టిప్పు ఏ మేరకు ఆదుకుంటాడో చూడాలి.