కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Assembly Elections)లు సమీపిస్తున్నాయి. అధికార, విపక్షాలు కుల సంఘాలతో సభలు సమావేశాలు పెడుతున్నాయి. తమకు అండగా నిలవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించమని ప్రాధేయపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగే సామాజికవర్గం ఏదైనా ఉందంటే అది లింగాయత్‌ మాత్రమే! లింగాయత్‌ను రాజకీయాల నుంచి వేరు చేయడం అసాధ్యం. అభ్యర్థులెవరైనా సరే, వారి గెలుపు ఓటములను శాసించేది మాత్రం లింగాయత్‌లే!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక(Karnataka Assembly Elections)లు సమీపిస్తున్నాయి. అధికార, విపక్షాలు కుల సంఘాలతో సభలు సమావేశాలు పెడుతున్నాయి. తమకు అండగా నిలవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించమని ప్రాధేయపడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగే సామాజికవర్గం ఏదైనా ఉందంటే అది లింగాయత్‌ మాత్రమే! లింగాయత్‌ను రాజకీయాల నుంచి వేరు చేయడం అసాధ్యం. అభ్యర్థులెవరైనా సరే, వారి గెలుపు ఓటములను శాసించేది మాత్రం లింగాయత్‌లే! అంత పవర్‌ఫుల్‌ సామాజికవర్గం ఇది. కర్ణాటకలో లింగాయత్‌లు ఒకటిన్నర కోట్ల మందికి పైగానే ఉంటారు. మొత్తం వంద నుంచి 120 స్థానాలను వీరు ప్రభావితం చేయగలరు. ప్రస్తుత అసెంబ్లీలో 54 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలు(Lingayat MLAs) ఉన్నారు. వీరిలో బీజేపీకి చెందిన వారే 37 మంది ఉన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన పది మంది ముఖ్యమంత్రులయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చారు లింగాయత్‌లు. కొన్నేళ్లుగా బీజేపీ(BJP)కి అండగా నిలుస్తున్నారు. కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకోగలిగే స్థానాలు గెల్చుకోగలుగుతున్నదంటే అది లింగాయత్‌ల పుణ్యమే. అయితే తమ నాయకుడు యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి బీజేపీ తప్పించడాన్ని లింగాయత్‌లు తట్టుకోలేకపోయారు. లింగాయత్‌(Lingayat) మఠాధిపతులు బహిరంగంగానే బీజేపీని తిట్టిపోశారు. యడియూరప్పను బీజేపీ అధిష్టానం పట్టించుకోకపోవడాన్ని కూడా లింగాయత్‌లు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో లింగాయత్‌లు బీజేపీ వైపు ఉంటారా? లేక మళ్లీ కాంగ్రెస్‌కు చేయూతనిస్తారా? అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్‌గానే ఉంది. కర్ణాటక జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్‌లదే కీలక ఓటు బ్యాంకు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లింగాయత్‌లు కాంగ్రెస్‌ వెంటే ఉన్నారు. 1990 తర్వాత నెమ్మదిగా బీజేపీవైపు జరిగారు. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటకలోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయంటే అందుకు కారణం లింగాయత్‌లే! అందుకే బీజేపీ కూడా లింగాయత్‌లలో ఎలాంటి అసంతృప్తి రాకుండా పని చేస్తూ వస్తోంది. ఆ మాటకొస్తే ఇతర సామాజికవర్గాలను పట్టించుకోవడం మానేసింది కూడా! ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించేసి లింగాయత్‌, వక్కలిగలకు చెరో రెండుశాతం పంచింది కూడా ఇందుకే. ఇవన్నీ ఎన్నికల్లో పని చేస్తాయా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. కాకపోతే యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తీరు లింగాయత్‌లకు ఆగ్రహం తెప్పించింది. ఆ కోపం ఇంకా చల్లారలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై లింగాయత్‌ సామాజికవర్గానికి చెందినవారే అయినప్పటికీ యడుయూరప్పను సొంతం చేసుకున్నట్టుగా బొమ్మైను లింగాయత్‌లు చేసుకోలేకపోతున్నారు.

బీజేపీపై లింగాయత్‌లలో ఉన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్‌ గట్టిగానే కృషి చేస్తోంది. లింగాయత్‌(Lingayat)లకు అత్యధిక టికెట్లు ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ప్రకటించిన 166 మంది అభ్యర్థులలో 43 మంది లింగాయత్‌లే! 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్‌ల గురువు బసవేశ్వర చిత్రపటాన్ని ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. తమను మతపరమైన మైనారిటీలుగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండ్‌ను కూడా నెరవేర్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు కూడా చేసింది. కేంద్రం మాత్రం దీనిపై ఇప్పటి వరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మలచుకుంది కాంగ్రెస్‌. లింగాయత్‌లు కాంగ్రెస్‌ పక్షాన ఉన్న ప్రతీసారి కాంగ్రెస్‌ బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. 1990లో లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 224 స్థానాల్లో 179 చోట్ల విజయం సాధించింది. తర్వాత కర్ణాటకలో కొన్ని మత ఘర్షణలు జరిగాయి. దీనికి సాకుగా తీసుకుని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ ముఖ్యమంత్రి పదవి నుంచి వీరేంద్ర పాటిల్‌ను తప్పించారు. రాజీవ్‌ చేసిన పెద్ద తప్పిదం ఇదే. అప్పట్నుంచే లింగాయత్‌లు కాంగ్రెస్‌ను వదిలి బీజేపీ పంచన చేశారు. ఈ కారణంగానే 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 36 స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. బీజేపీలో యడియూరప్ప ముఖ్యమైన నాయకుడిగా మారడంతో లింగాయత్‌లు పూర్తిగా బీజేపీ వైపుకు వెళ్లారు. అయితే అవినీతి ఆరోపణల కారణంగా యడియూరప్పను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. యడియూరప్ప ఊరికే ఉండలేదు. కర్ణాటక జనతాపార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఫలితంగా 2013 ఎన్నికల్లో లింగాయత్‌ ఓట్లు చీలిపోయాయి. బీజేపీ 40 స్థానాలను మాత్రమే గెల్చుకోగలిగింది. అలాగని కర్ణాటక జనతా పార్టీ గొప్పగా గెలిచిందా అంటే అదీ లేదు. పార్టీని నడపలేక యడియూరప్ప మళ్లీ బీజేపీ గూటికే చేరారు. కర్ణాటకలో ఉన్న లింగాయత్‌ మఠాల చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. మఠాధిపతులు చెప్పింది పాటిస్తారు లింగాయత్‌లు. అందుకే యడియూరప్ప మఠాల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఈసారి యడియూరప్ప మాటను లింగాయత్‌లు వింటారా? కాదని కాంగ్రెస్‌కే ఓటేస్తారా? అన్నది చూడాలి.

Updated On 18 April 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story