కర్ణాటక ఎన్నికల(Karnataka Elections)కు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో టెన్షన్ పెరిగింది. ప్రచారం గడువు కూడా సమీపిస్తుండటంతో క్షణం కూడా వృధా చేయకుండా తిరుగుతున్నారు నేతలు. కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంగతి అటుంచితే అనాదిగా కొన్ని ప్రాంతాలు కొన్ని రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తూ వస్తున్నాయి. వాటిపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది.

కర్ణాటక ఎన్నికల(Karnataka Elections)కు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో టెన్షన్ పెరిగింది. ప్రచారం గడువు కూడా సమీపిస్తుండటంతో క్షణం కూడా వృధా చేయకుండా తిరుగుతున్నారు నేతలు. కర్ణాటకలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంగతి అటుంచితే అనాదిగా కొన్ని ప్రాంతాలు కొన్ని రాజకీయ పార్టీలకు అండగా నిలుస్తూ వస్తున్నాయి. వాటిపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. ఇంత వరకు ఓటేస్తూ వచ్చిన పార్టీకే ఓటేస్తారా? లేక మనసు మార్చుకుంటారా? అన్నది 13న వచ్చే ఫలితాల్లో కానీ తేలదు. ముంబాయి కర్ణాటకగా చెప్పుకునే ఏడు జిల్లాలు విజేతను నిర్ణయించబోతున్నాయి. బీజేపీకి ప్రధాన ఓటు బ్యాంకు అయిన లింగాయత్‌(Lingayat)లు ఇక్కడ అధికంగా ఉండటంతో అక్కడ ఎంతో కొంత బీజేపీ(BJP) బలంగా ఉంది. ఈసారి అక్కడ పాగా వేయాలన్నది కాంగ్రెస్‌(Congress) లక్ష్యంగా పెట్టుకుంది. జేడీ(ఎస్‌)కు ఇక్కడ పెద్దగా ఆదరణ లేదు.

2021 వరకు ముంబాయి కర్ణాటకగా పేరుపొందిన ఈ ప్రాంతాన్ని స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి కిత్తూరు చెన్నమ్మ పేరిట కిత్తూరు కర్ణాటకగా మార్చారు. ఒక్క ఉత్తర కన్నడ తప్పితే మిగతా ఆరు జిల్లాలలో లింగాయత్‌ సామాజికవర్గానిదే ఆధిపత్యం. కొన్నేళ్లుగా వీరంతా బీజేపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ఇది కాంగ్రెస్‌పార్టీకి పెట్టని కోట. 1990లో లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన అప్పటి ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్‌ పక్షవాతం బారిప పడటంతో ప్రధాని రాజీవ్‌గాంధీ ఆయనను తొలగించారు. దాంతో లింగాయత్‌లకు కోపం వచ్చింది. కాంగ్రెస్‌ తమకు నమ్మకద్రోహం చేసిందనే భావనకు వచ్చేశారు. అప్పుడు వారికి యడియూరప్ప ఆశాకిరణంగా కనిపించారు. ఆయన బీజేపీకి చెందినవారే అయినప్పటికీ యడియూరప్పకు మద్దతుగా నిలిచారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో బీజేపీ విస్తరించింది. యడియూరప్ప బీజేపీలో ఉన్నంత వరకు బీజేపీ హవా నడిచింది. 2013లో బీజేపీని కాదని యడియూరప్ప సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నారు. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలలో 30 స్థానాలను గెల్చుకుంది.

2014 ఎన్నికల తర్వాత యడియూరప్ప మళ్లీ బీజేపీ గూటికి చేరారు. దాంతో కిత్తూరు కర్ణాటకలో మళ్లీ బీజేపీ జెండాలు రెపరెపలాడాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 30 స్థానాలను గెల్చుకుంటే, కాంగ్రెస్‌ 17 స్థానాలతో సంతృప్తి చెందాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు లింగాయత్‌లు ఎటువైపు ఉన్నారన్నది గట్టిగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. యడియూరప్పను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పించిందే బీజేపీ అని కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారం లింగాయత్‌ మనస్సులో బలంగా నాటుకుపోతోంది. బీజేపీ అంతటి లింగాయత్‌ నేతను అవమానించిందని కొందరు అనుకుంటున్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ లింగాయత్‌లను దువ్వడం మొదలుపెట్టింది. వారి రిజర్వేషన్‌ను రెండు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచింది. రిజర్వేషన్లను పెంచాము కాబట్టి లింగాయత్‌లు తమతోనే ఉంటారని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. బెళగావి జిల్లాలో మొత్తం 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బెంగళూరు సిటీ తర్వాత ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఉన్నది ఇక్కడే.!

గత ఎన్నికల్లో బీజేపీ పది స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్‌కు 8 సీట్లు దక్కాయి. రెండు పార్టీలలోనూ బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఉమేశ్‌ కత్తి, సవదత్తీ మామని వంటి బలమైన నాయకులు చనిపోవడం బీజేపీకి ఇక్కడ మైనస్‌గానే మారింది. ఇక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్‌(Jagadish Shettar), మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ సవాది(Laxman Savadi) వంటి సీనియర్‌ నేతలు కూడా బీజేపీని వదిలిపెట్టిపోవడంతో కమలదళం కాసింత బలహీనపడింది. హుబ్లీ సెంట్రల్‌ నుంచి కాంగ్రెస్‌ గుర్తుపై పోటీ చేస్తున్న జగదీశ్‌ షెట్టర్‌ బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) ప్రాతినిధ్యం వహిస్తున్న శిగ్గావ్‌ స్థానం కూడా కిత్తూరు కర్ణాటకలోనే ఉంది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా కిత్తూరు కర్ణాటకకు చెందిన వారే! ఈయన 2018లో బాగలకోటె జిల్లా బాదామి నుంచి గెలుపొందారు. అప్పట్నుంచి కాంగ్రెస్‌ ఇక్కడ బలపడుతూ వస్తోంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ధారవాడ జిల్లా కూడా కీలకమే. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఇక్కడ ఎక్కువ సీట్లు రాకపోతే మాత్రం ప్రహ్లాద్‌ జోషి ఫెయిల్యూర్‌గానే భావించాల్సి ఉంటుంది. బీజేపీ సీనియర్‌ నేత బసవనగౌడ పాటిల్‌ది విజయపుర జిల్లా. ఇప్పుడు ఈయన నోటి దురుసే బీజేపీకి నష్టం తెచ్చిపెట్టేట్టుగా ఉంది. ఒకప్పుడు యడియూరప్పను నానా మాటలు అని పార్టీకి నష్టం తెచ్చిన పాటిల్‌ ఇప్పుడేమో ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనంటూ అంతటా చెప్పుకుని తిరుగుతున్నారు.

Updated On 2 May 2023 11:52 PM GMT
Ehatv

Ehatv

Next Story