దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఓ రకంగా దయార్ధ్రహృదయులు. అధికార పక్షానికి అయిదేళ్లకు మించి పాలన చేసే అవకాశాన్ని చాలా అరుదుగా ఇస్తుంటారు. మరో నెల రోజులలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)ను ఎదుర్కోబోతున్న కర్ణాకట(Karnataka)లో ఏం జరుగుతుందన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన ఉదంతాలు లేవు కాబట్టి. మరి ఆ సంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ(BJP) బద్దలు కొట్టగలదా? లేకపోతే కన్నడీగులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌(Congress)ను గద్దెనెక్కిస్తారా?

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఓ రకంగా దయార్ధ్రహృదయులు. అధికార పక్షానికి అయిదేళ్లకు మించి పాలన చేసే అవకాశాన్ని చాలా అరుదుగా ఇస్తుంటారు. మరో నెల రోజులలో అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)ను ఎదుర్కోబోతున్న కర్ణాటక(Karnataka)లో ఏం జరుగుతుందన్నదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే గత 38 ఏళ్లుగా అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలిచిన ఉదంతాలు లేవు కాబట్టి. మరి ఆ సంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ(BJP) బద్దలు కొట్టగలదా? లేకపోతే కన్నడీగులు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌(Congress)ను గద్దెనెక్కిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. కన్నడ సీమలో 1985 నుంచి అధికారపార్టీ వరుసగా రెండోసారి విజయం సాధించలేదు. సర్వే నివేదకలన్నీ కాంగ్రెస్‌వైపు ఉంటున్నాయి. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నాయి. బీజేపీ మాత్రం సర్వేలను నమ్మడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లను గెల్చుకుంటామన్న ధీమాతో ఉంది. అత్తెసరు సీట్లతో అవతలి పక్షం సహాయాన్ని కోరడం వల్ల ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో బీజేపీకి తెలియంది కాదు. అందుకే ఈసారి సొంతంగా చాలినన్ని స్థానాలు గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

కర్ణాటకలో విజయం బీజేపీకి అనివార్యం. కర్నాటక ఫలితం ప్రభావం జాతీయ రాజకీయాలలో తప్పనిసరిగా పడుతుంది. ముఖ్యంగా పక్కనే ఉన్న తెలంగాణ(Telangana)పై ఎంతో కొంత ఉండే తీరుతుంది. పైగా దక్షిణాదిన పాగా వేయాలన్న ఉబలాటంతో ఉన్న బీజేపీ అధిష్టానానికి కర్ణాటక ఒక్కటే పెద్ద దిక్కుగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీ(PM Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah)లు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections)ను సీరియస్‌గా తీసుకున్నారు. 1983లో ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ(TDP) ఎలాగైతే విజయం సాధించిందో, అదే సమయంలో కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే(Ramakrishna Hegde) నేతృత్వంలోని జనతా పార్టీ గెలుపొందింది. ఏపీలోలాగే కర్ణాటకలో కూడా ఇదే తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం కావడం గమనార్హం. కాకపోతే తెలుగుదేశం పార్టీలా ఘన విజయాన్ని అందుకోలేకపోయింది జనతాపార్టీ. దాంతో అధికారం కోసం ఇతర పక్షాల మద్దుతు కూడగట్టుకోవాల్సి వచ్చింది. 1983 నుంచి 1985 వరకు మైనార్టీ ప్రభుత్వమే కొనసాగింది. 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతాపార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై సానుభూతిని కనబర్చారు ఓటర్లు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్టీఆర్‌ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ సానుభూతి నిలువలేకపోయింది. 1984 ఎన్నికల్లో జనతాపార్టీకి పెద్దగా సీట్లు రాకపోయేసరికి రామకృష్ణ హెగ్డే అసెంబ్లీని రద్దు చేశారు. మూడు నెలల తర్వాత చ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీ ఘన విజయం సాధించింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో జనతా పార్టీకి 139 స్థానాలు లభించాయి. అలా రామకృష్ణ హెగ్డే నేతృత్వంలో రెండోసారి జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత జనతాపార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. జనతాపార్టీ మూడు ముక్కలయ్యింది. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసింది (ఏపీలోనూ ఇదే సీన్‌.. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది). కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. వీరేంద్ర పాటిల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది మొదలు తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతూ వస్తోంది.

1989 నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరిగాయి. అధికార పార్టీ వరుసగా రెండోసారి గెలిచింది లేదు. ఏ ముఖ్యమంత్రికి కూడా మళ్లీ అదే పదవి వరుసగా రెండసారి దక్కింది లేదు. మరి బసవరాజ బొమ్మై ఈ సంప్రదాయానికి తెర దించుతారా? మూడున్నర సంవత్సరాల కిందట ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన బొమ్మై ఈ మూడున్నరేళ్లలో ప్రజల మనసును గెల్చుకోగలిగారా? బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురాగలిగే సామర్థ్యం ఆయనలో ఉందా? ప్రభుత్వ వ్యతిరేకను ఎదుర్కొనే సత్తా ఉందా? ఈ సందేహాలకు వచ్చే నెల 13న సమాధానం లభిస్తాయి. బీజేపీ ప్రభుత్వంపై ప్రజలలో అసంతృప్తి ఉన్నదన్న విషయం ఎమ్మెల్యేలు ఓట్ల కోసం వెళుతున్నప్పుడు తెలుస్తోంది. ప్రతీ చోటా ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు ప్రజలు. అందుకే కేంద్ర ప్రభుత్వ పథకాలపైనే బీజేపీ ఎక్కువ నమ్మకం పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో కోట్లాది మంది లబ్ధి పొందారని, వారు బీజేపీకే ఓటు వేస్తారని అధిష్టానం భావిస్తోంది. 2008, 2018లలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లను సాధించింది కానీ సంపూర్ణ మెజారిటీని సాధించలేకపోయింది. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పూర్తి మెజారిటీ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. నరేంద్రమోదీ, అమిత్‌షాలు నేరుగా రంగంలోకి దిగారు. సామాజికవర్గాల లెక్కలు, ప్రాంతీయ సమీకరణాలను పరిశీలిస్తున్నారు. అభ్యర్థులను స్వయంగా ఎంపిక చేస్తున్నారు. గెలిచే అభ్యర్థికే టికెట్‌ ఇస్తున్నారు. ఇక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బొమ్మై ప్రభుత్వం రిజర్వేషన్‌ కార్డును ప్రయోగించింది.

ఎన్నికల ప్రకటన వస్తుందని తెలుసుకున్న బొమ్మై కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. ఓబీసీ కేటగిరీలో ముస్లింలకు అమలవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగించారు. వాటిని లింగాయత్‌లు, వొక్కళిగలకు సమానంగా ఇచ్చారు. ముస్లింలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కేటగిరీలో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు బొమ్మై. అలాగే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచారు. మరి ఇది ఎన్నికల్లో వర్క్‌ అవుటవుతుందా అన్నది చూడాలి. అయితే, రిజర్వేషన్ల విషయంలో బొమ్మై సర్కారు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు కాబట్టి ఆ ప్రభావం ఓటర్లపై ఉండకపోవచ్చని కొందరు అంటున్నారు.

Updated On 12 April 2023 3:55 AM GMT
Ehatv

Ehatv

Next Story