ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌లోని మహారాజ్‌పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్‌ను ఉంచి ప్ర‌మాదానికి కుట్ర ప‌న్నిన ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది

ఢిల్లీ-హౌరా రైల్వే లైన్‌లోని మహారాజ్‌పూర్‌లోని ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై చిన్న గ్యాస్ సిలిండర్‌ను ఉంచి ప్ర‌మాదానికి కుట్ర ప‌న్నిన ఘ‌ట‌న‌ వెలుగులోకి వచ్చింది. అయితే.. రైలు లోకో పైలట్ ట్రాక్ మధ్యలో ఉంచిన సిలిండర్‌ను చూసి రైలును ఆపాడు. దీంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. గూడ్స్ రైలు కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్ వైపు లూప్ లైన్ మీదుగా వెళ్తోండ‌గా ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. పోలీసులు, రైల్వే అధికారులు సంఘటనా స్థలంలో ఉన్నారు. విచారణ జరుగుతోంది.

లూప్ లైన్ పై ఉంచిన ఖాళీ పెట్రోమాక్స్ సిలిండర్ కనిపించింది. ప్రయాగ్‌రాజ్ వైపు ప్లాట్‌ఫారమ్‌కు 100 మీటర్ల ముందు ఈ సిలిండర్ క‌న‌ప‌డింది. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్, ఇతర రైల్వే అధికారులు దీనిని ప‌రిశీలించారు. జీఆర్‌పీ దీనిని దుర్మార్గంగా పరిగణిస్తోంది. సమీపంలో నివాసాలు ఉండడంతో అక్క‌డి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. LIU బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది.

గూడ్స్ రైలు కాన్పూర్ నుండి ప్రయాగ్‌రాజ్ వైపు వస్తుండగా.. ప్రేమ్‌పూర్ స్టేషన్‌లోని లూప్ లైన్‌లో క‌దులుతుండ‌గా.. లోకో పైలట్ దేవ్ ఆనంద్ గుప్తా, అసిస్టెంట్ లోకో పైలట్ సిబి సింగ్ సిగ్నల్‌కు ముందు కొంత దూరంలో సిలిండర్ ఉంచడం చూశారు.

వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి సిలిండర్ ముందు వాహనాన్ని ఆపారు. అనంతరం సంబంధిత శాఖలందరికీ ఈ విషయాన్ని తెలియజేశారు. దీని తరువాత రైల్వే IOW, భద్రతా దళాలు, ఇతర బృందాలు సిలిండర్‌ను తనిఖీ చేసి ట్రాక్ నుండి తొలగించాయి.

ఈ సంఘటన ఉదయం 5:50 గంటలకు ప్రేమ్‌పూర్ స్టేషన్‌లో జరిగింది. ఈ సిలిండర్‌ను పరిశీలించగా.. అది సిగ్నల్‌కు ముందు ట్రాక్‌పై ఉంచిన ఖాళీ 5 లీటర్ల సిలిండర్ అని తేలింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story