బెంగళూరులో(Banalore) ఉంటున్న సన్ని మహిపాల్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు.
బెంగళూరులో(Banalore) ఉంటున్న సన్ని మహిపాల్ అనే వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. టెలివిజన్ సీరియల్స్‌లో(TV serials) కూడా నటిస్తున్నాడు. గత జనవరిలో ఫేస్‌బుక్ ద్వారా ఓ అమ్మాయి ఇతడికి పరిచయం అయ్యింది. ఆ పరిచయాన్ని మహిపాల్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు. శారీరకంగా ఒక్కటవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. దాంతో కంగారుపడిన ఆమె పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. జూన్ 15వ తేదీన ఓ గుడిలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు సన్ని మహిపాల్. పెళ్లయిన తర్వాత వారం రోజుల పాటు ఆమెతోనే ఉన్నాడు. తల్లిదండ్రులను ఒప్పించి నిన్ను ఇంటికి తీసుకెళతానని మాటిచ్చాడు. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గానే ఉందామని, అలాగే మేనేజ్ చేయాలని చెప్పాడు. పాపం ఆ అమ్మాయి ఇతడిని గుడ్డిగా నమ్మేసి తలూపింది. తర్వాత మంగళూరుకు వెళ్లిపోయాడు. కొద్ది రోజుల కిందట తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ యువతి అర్థరాత్రి విజ్ఞాననగరలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో సన్ని మహిపాల్ ఆమెపై చాకుతో దాడి చేశాడు. తర్వాత ఆమెను కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘర్షణలో ఆమెకు అబార్షన్ కూడా అయ్యింది. ఇదిలా ఉంటే తనను బలవంతంగా పెళ్లి చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని సన్ని మహిపాల్ ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ఆమెపై హెచ్‌ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు.