కేరళలోని(Kerala) ఎట్టుమనూరులోని రతీశ్ పుథెట్‌కు(Ratish Puthet) ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ(Lorry transport company) ఉంది.
కేరళలోని(Kerala) ఎట్టుమనూరులోని రతీశ్ పుథెట్‌కు(Ratish Puthet) ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ(Lorry transport company) ఉంది. ఆ కంపెనీలో దాదాపు 30 లారీలు ఉన్నాయి. రతీశ్ పుథెట్ తన 19వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తన భార్య జలజకు ఓ మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఆమెకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. ఆమె మురిసిపోయింది. రెండేళ్ల కిందట ఫిబ్రవరిలో రతీశ్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయలుదేరింది జలజ. అప్పుడే ఆమెకు డ్రైవింగ్‌పై(Driving) అభిరుచి ఏర్పడింది. ఆసక్తి పెరిగింది. ఆమెకు 2014లోనే ఫోర్ వీలర్ లైసెన్స్ వచ్చింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లో జలజకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చాక ఊరికే ఉండలేదు కదా! పెరుంబవూరు నుంచి ఫ్లైవుడ్ తీసుకుని లారీలో పుణేకు బయలుదేరింది జలజ. ఆమెలో ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమైంది. వెంటనే అక్కడి నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకువెళ్లింది. ఆమెలో ఓ రకమైన ధైర్యం వచ్చేసింది. స్టీరింగ్ తిప్పుతూ ఆమె దూరాలను కూడా లెక్క చేయకుండా వెళ్ల సాగింది. ఓ మహిళగా జలజకు తోటి డ్రైవర్ల నుంచి గౌరవం వచ్చేది. పోలీసు అధికారులు ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చేవారు. స్థానికులు ఆసక్తి కనిపించేవారు. కాశ్మీర్‌కు వెళ్లి రావడానికి పన్నెండు రోజులు పట్టేది. మధ్యలో కొండచరియలు విరిగిపడితే మరింత ఆలస్యమయ్యేది. అయినా ఆమె ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఎలాంటి సమస్యా రాలేదు. దేశ వ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లను ఆమె తెలుసుకోగలిగారు. వివిధ సంస్కృతులపై అవగాహన ఏర్పింది. అలా ప్రతీ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయాణాలు ఆమెకు తోడ్పడుతున్నాయి. కమ్యూనికేషన్ కోసం జలజ హిందీ నేర్చుకుంటోంది. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో ఉన్న మరో ఇద్దరు మహిళలకు డ్రైవింగ్ పట్ల ఆసక్తి పెరిగింది. ఒకరు జలజ కూతురు దేవిక. మరొకరు రతీశ్ తమ్ముడి భార్య సూర్య! దేవిక డిగ్రీ చదువుతోంది. ఈ ఇద్దరు కూడా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. వీరి ఇష్టాన్ని రతీశ్ ఎప్పుడూ కాదనలేదు. పైగా ప్రోత్సహించాడు. ఈ ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్‌పోర్ట్ వ్లాగ్‌ను మొదలుపెట్టారు. ఈ ముగ్గరు మహిళామణులు తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో పెట్టసాగారు. జలజ కూతురు దేవిక అయితే లడఖ్ ప్రయాణంలో సుమారు 5,900 కిలోమీటర్లు ఏకబిగిన ట్రక్కును నడిపింది. లారీలోనే కేరళ నుంచి కశ్మీర్ వరకు వెళ్లిన జలజ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీల అంటే అత్తగారిని కూడా వెంట తీసుకెళ్లింది. అన్నట్టు దేవిక ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. ఆమె ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్‌గా చరిత్ర సృష్టించింది. సూర్య కూతురు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీశ్, జలజలది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు ఆ కుటుంబం వలస వచ్చింది. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక ఈ ఏడాది మే మాసంలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్‌లో ఏసీని అమర్చుకున్నారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను వారు వెంట తీసుకెళతారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నారు ఆ మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అందరూ కలిసి యాత్రలు చేస్తుంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరికి విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.