పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. పాఠాలు చెప్పడమన్నది టీచర్లకు కత్తి మీద సామే! పాఠాలపై పిల్లలు ఇష్టాన్ని పెంచుకునేలా చేయడం మరింత కష్టం. చాలా కొద్ది మంది టీచర్లే పిల్లల మనసును గెల్చుకోగలరు. అలాంటి వారిలో జాహ్నవి యదు ఒకరు.
పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. పాఠాలు చెప్పడమన్నది టీచర్లకు కత్తి మీద సామే! పాఠాలపై పిల్లలు ఇష్టాన్ని పెంచుకునేలా చేయడం మరింత కష్టం. చాలా కొద్ది మంది టీచర్లే పిల్లల మనసును గెల్చుకోగలరు. అలాంటి వారిలో జాహ్నవి యదు ఒకరు. చత్తీస్‌గడ్‌లోని(Chhattisgarh) రాయ్‌పూర్‌కు(Raipur) చెందిన ఈ టీచర్ పిల్లలను వినూత్నంగా ఆకట్టుకుంటున్నారు. రాయ్‌పూర్‌లోని గోకుల్‌రామ్ వర్మ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో(Gokulram Verma Government Primary School) జాహ్నవి యదు(Jahnavi Yadu) టీచర్. అందులో చదివే పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.
శనివారం అయితే మరింత ఉత్సాహంగా ఉంటారు. అందుకు కారణం జాహ్నవినే! 'నేను కూడా మీలో ఒకదాన్ని' అన్న భావన పిల్లలో కలిగించడం కోసం జాహ్నవి వారిలాగే తయారవుతారు. వారిలాగే యూనిఫామ్(school Uniform) వేసుకుని వస్తారు. ఆ రోజు ఆమె కుర్చీలో కూర్చోరు. పిల్లల మధ్య కూర్చొని పాఠాలు, కబుర్లు చెబుతారు. వారితో ముచ్చటిస్తారు. అందుకే పిల్లలకు జాహ్నవి యదు ఇష్టమైన టీచర్‌గా మారిపోయారు. ఈమె కారణంగానే స్కూల్‌కు డుమ్మా కొట్టకుండా పిల్లలంతా వస్తున్నారు. పిల్లలలో ఆత్మ విశ్వాసం నింపడానికి జాహ్నవి చేస్తున్న చిరు ప్రయత్నం అందరి మెప్పును పొందుతోంది.
గోకుల్‌రామ్ వర్మ ప్రైవరీ స్కూల్‌లో 350 మంది పిల్లలు ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు చదువుకుంటున్నారు. వారంతా ఆ చుట్టుపక్కల ఉన్న బస్తీలలో ఉంటారు. ఆ పిల్లల తల్లిదండ్రులు పెద్దగా చదువుకున్నవారు కాదు. ఆ కారణంగా పిల్లలు క్రమశిక్షణ తప్పారు. స్కూల్‌కు వెళ్లడమంటే వారికి పెద్ద చిరాకు. ఒకవేళ స్కూల్‌కు వచ్చినా పాఠాలు వినడంపై ఆసక్తి చూపరు. యూనిఫామ్ వేసుకోరు. లాస్టియరే స్కూల్‌లో టీచర్‌గా చేరిన 30 ఏళ్ల జాహ్నవి ఇదంతా గమనించారు.
పిల్లలను తన దారిలోకి తెచ్చుకోవడానికి చాలా శ్రమపడ్డారు. వారిని దారిలో పెట్టడం ఆమెకు చాలా కష్టంగా మారింది. 2023 వేసవి సెలవుల తర్వాత జూన్‌లో స్కూల్ రీ ఓపెన్ అయ్యింది. అప్పుడే జాహ్నవి మదిలో ఓ ఆలోచన మెదిలింది. తనకొచ్చిన ఆలోచనను ఏ మాత్రం మొహమాటపడకుండా ఇంప్లిమెంట్ చేశారు. హఠాత్తుగా ఓ రోజు పిల్లల్లాగే యూనిఫామ్ వేసుకుని వచ్చారు. టీచర్‌ను చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు. ఆమె చుట్టూ చేరారు. నవ్వారు. సంతోషించారు.
'ఎందుకు టీచర్ యూనిఫామ్ వేసుకొచ్చావు' అని అడిగారు. 'మీరు కూడా స్కూల్‌కు ఇలాగే రావాలి. అందుకే నేను యూనిఫామ్ వేసుకుని వచ్చా. మనమందరం ఒక టీమ్. మనందరం చక్కగా చదువుకోవాలి' అంటూ వారిని మనం చేశారు జాహ్నవి. దానికి వారు సంతోషించారు. టీచర్‌లాగే యూనిఫామ్ వేసుకుని రావాలని వారికి అనిపించింది. టీచర్ కోసం రోజూ స్కూల్ రావాలని కూడా అనిపించింది.
నెమ్మదిగా స్కూల్‌కు వచ్చే పిల్లల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఫుల్ స్ట్రెంత్! దటీజ్ జాహ్నవి! వారానికి ఓ రోజు అంటే ప్రతి శనివారం స్కూల్ యూనిఫామ్‌లో జాహ్నవి రావడం రాయ్‌పూర్‌లో పెద్ద వార్త అయ్యింది. జాహ్నవి యదు కారణంగా పిల్లలలో బెరుకు పోయింది. స్కూల్ అంటే టీచర్లు కొట్టే ప్లేస్ కాదని పిల్లలు తెలుసుకున్నారు. తమ మనసులో ఏమున్నదో భయం లేకుండా జాహ్నవితో చెప్పుకుంటున్నారు పిల్లలు.
ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. అందరూ జాహ్నవిని తెగ మెచ్చుకుంటున్నారు. అయితే స్కూల్ యూనిఫామ్‌లో స్కూల్‌కు వెళ్లడానికి జాహ్నవి తొలుత సంకోచించారు. అత్తామామలు ఏమనుకుంటారోనని అనుకున్నారు. విషయం చెబితే వారు అంగీకరించారు. ప్రోత్సహించారు. ఉత్సాహపరిచారు. అత్తామామలు గో అహెడ్ అనడంతో జాహ్నవి పిల్లలలో ఒకరయ్యారు. వారితో ఆడిపాడుతున్నట్టుగా కనిపిస్తూ వారికి పాఠాలు చెబుతున్నారు. వారిని దారిలో పెడుతున్నారు. ఇప్పుడు స్కూల్ మొత్తానికి జాహ్నవి యదునే ఫేవరెట్ టీచర్..