ఇస్లాంలో పెళ్ళైన వారికి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అవకాశం ఉండదని.. ముఖ్యంగా
ఇస్లాంలో పెళ్ళైన వారికి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అవకాశం ఉండదని.. ముఖ్యంగా అతని జీవిత భాగస్వామి జీవించి ఉన్నట్లయితే అసలు కుదరదని అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ తెలిపింది. ఇస్లామిక్ సిద్ధాంతాలు లివ్-ఇన్-రిలేషన్‌ను అనుమతించవని కోర్టు అభిప్రాయపడింది. జీవిత భాగస్వామి ఉండగా వేరొకరితో సహజీవనంలో ఉండే ముస్లింలు హక్కులు పొందలేరని, అలాంటి సంబంధం ఇస్లామిక్ సూత్రాలకు విరుద్ధమని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ అనే ఇద్దరు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ తమ కూతురిని కిడ్నాప్ చేశారంటూ స్నేహా దేవి తల్లిదండ్రులు మహ్మద్ ఖాన్‌పై కిడ్నాప్ కేసు పెట్టారు. ఆమెను భద్రతతో తల్లిదండ్రుల వద్దకు పంపించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము స్వేచ్ఛగా జీవించేందుకు రక్షణ ఇవ్వాలంటూ పిటిషనర్లు స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్ కోరారు. అలా సాధ్యపడదని కోర్టు తేల్చిచెప్పింది.
ఇస్లాం మత సూత్రాలు సహజీవన సంబంధాలను అనుమతించవు.. ఇద్దరు వ్యక్తులు అవివాహితులైతే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్నారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉంటుందని బెంచ్ స్పష్టం చేసింది. మహ్మద్ షాదాబ్ ఖాన్‌కి 2020లో ఫరీదా ఖాతూన్ అనే మహిళతో పెళ్లి అయ్యిందని విచారణలో తేలింది. దంపతులకు ఒక పాప కూడా ఉందని తెలుసుకున్న కోర్ట్ వివాహ వ్యవస్థల విషయంలో రాజ్యాంగ నైతికత, సాంఘిక నైతికతలు సమతుల్యంగా ఉండాలని తెలిపింది.