పబ్జీ ప్రేమ వెనుక గూఢచర్యం ఉందా? చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన సచిన్‌ మీనాతో(Sachin Meena) పబ్జీ గేమ్‌(PubG) ద్వారా పరిచయం పెంచుకుని, దాన్ని ప్రేమగా మార్చి, ఆ ప్రేమ పేరుతో భర్తను ఏమార్చి, సరిహద్దులు దాటిన భారత్‌లో ప్రవేశించిన సీమా హైదర్‌పై(Seema Hyder) ఇప్పుడు అనేక అనుమానాలు రేగుతున్నాయి. ఆ అనుమానాలకు బలం కూడా చేకూరుతోంది. ఆమె పక్కా ప్రణాళికతోనే భారత్‌కు వచ్చారని భావిస్తున్నారు. ఆమెను విచారిస్తున్న ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ముందు సీమా హైదర్‌ పలు విషయాలు వెల్లడించారట.

పబ్జీ ప్రేమ వెనుక గూఢచర్యం ఉందా? చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన సచిన్‌ మీనాతో(Sachin Meena) పబ్జీ గేమ్‌(PubG) ద్వారా పరిచయం పెంచుకుని, దాన్ని ప్రేమగా మార్చి, ఆ ప్రేమ పేరుతో భర్తను ఏమార్చి, సరిహద్దులు దాటిన భారత్‌లో ప్రవేశించిన సీమా హైదర్‌పై(Seema Haider) ఇప్పుడు అనేక అనుమానాలు రేగుతున్నాయి. ఆ అనుమానాలకు బలం కూడా చేకూరుతోంది. ఆమె పక్కా ప్రణాళికతోనే భారత్‌కు వచ్చారని భావిస్తున్నారు. ఆమెను విచారిస్తున్న ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ముందు సీమా హైదర్‌ పలు విషయాలు వెల్లడించారట.

సీమా సోదరుడు ఆసిఫ్‌ పాకిస్తాన్‌ సైన్యంలో పని చేస్తున్నాడన్న విషయం అధికారుల విచారణలో బయటపడింది. అలాగే ఆమె మామ గులాం అక్బర్‌ కూడా పాకిస్తాన్‌(Pakistan) సైన్యంలో పని చేస్తున్నారట. ఈ విషయాన్ని సీమా హైదర్‌ భర్త గులాం హైదర్‌ విచారణ అధికారులకు స్వయంగా చెప్పడం గమనార్హం.
ప్రేమ పేరుతో ఈ ఏడాది మే మాసంలో దుబాయ్‌ నుంచి నేపాల్ మీదుగా వీసా లేకుండా భారత్‌లో అక్రమంగా అడుగుపెట్టిన సీమా హైదర్‌ను ఈ నెల 4వ తేదీన ఏటీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఆమెతోపాటు సచిన్‌ మీనా, అతని తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఓ రహస్య ప్రదేశంలో ఉంచినట్టు సమాచారం. సీమా హైదర్‌ను ఏటీఎస్‌ పోలీసులు రెండో రోజు కూడా అనేక ప్రశ్నలు అడిగారు. అక్రమ ప్రవేశం వెనుక ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో కూడా రంగంలోకి దిగింది. సీమా హైదర్‌ తన మొబైల్‌ ఫోన్‌ నుంచి డాటాను తొలిగించిందని అధికారులు పసిగట్టారు. ఆ డాటాను రస్టోర్‌ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అసలు సీమా హైదర్‌ సరిహద్దుల్లో సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ) కన్నుగప్పి దేశంలోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సీమా హైదర్‌ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్టు, ఆమె పిల్లలకు సంబంధించిన ఇతర పత్రాలను కూడా పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇటీవల ఓ అనుమానాస్పద వ్యక్తిని లక్నోలో అరెస్టు చేసిన తర్వాత తాజా పరిణామాలు చోటుచేసుకొన్నాయి. భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అతను సరిహద్దులోని తన సహచరులతో పంచుకొంటున్నట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

మరి సీమా హైదర్‌ కూడా ఆ పనిమీదనే వచ్చిందా? లక్నోలో అరెస్టయిన వ్యక్తికి ఈమెకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సరిహద్దులపై నిఘా పెట్టి ఎవరైనా గైడ్‌ చేస్తున్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నోయిడాలోని రబుపురా గ్రామానికి చేరుకోవడానికి ఎవరు సాయం చేశారన్న ప్రశ్నకు సీమా నుంచి జవాబు రావడం లేదు. ఇది కాకుండా కొంత మంది ఆర్మీ అధికారులకు కూడా సీమా ఫ్రెండ్‌ రిక్వెస్ట్ పంపినట్టు ఏటీఎస్ విచారణలో తేలింది.

భారత్‌కు రాకముందు ఆమె 70 వేల పాకిస్తాన్‌ రూపాయలతో ఒక మొబైల్‌ ఫోన్‌ కొనుకున్నది. మొబైల్‌ ఫోన్‌లో మెసేజ్‌ చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్‌లో చాటింగ్‌ చేసేసమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా చెప్పారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. ఏదైనా కోడ్‌ పదాలను ఉపయోగించారా అని కూడా అడిగారు ఏటీఎస్‌ అధికారులు. దానికి కూడా జవాబివ్వలేదామె!

శత్రుదేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్‌ఐకు చేరవేసేవారిని ఫుఫిగా పిలుస్తారు. రూపాయికి బదులుగా ఫ్రూట్‌ అనే పదాన్ని వాడతారు. ఈ కోడ్‌ వర్డ్స్‌ మీకు తెలుసా అని సీమాను ప్రశ్నించారు అధికారులు. అలాగే ఇంత స్వచ్ఛమైన హిందీ ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందూ ఆచారాల గురించి మీకు ఎలా తెలిసింది? అన్న ప్రశ్నలకు కూడా సీమా నుంచి జవాబులు రాలేదట! పాక్‌లో స్థానిక భాషలతో పాటు ఉర్దూనే మాట్లాడతారు. హిందీ పదాలు వారికి అంతగా తెలియవు. కానీ సీమా మాట్లాడే భాషలో ఎక్కడా ఉర్దూ కనిపించడం లేదు.

హిందీ పదాలే ఎక్కువగా ఉంటున్నాయి. పాక్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ఓ నిరుపేద మహిళ భాష కేవలం కొన్ని నెలల్లో ఎలా మారుతుంది? సీమా హైదర్‌కు మే 8వ తేదీన ఓ మొబైల్‌ బిల్లు వచ్చింది. మే 8వ తేదీన ఆమెకు పాస్ట్‌ పోర్జ్‌ జారీ అయ్యింది. మే 10న ఆమె పాకిస్తాన్‌ను విడిచిపెట్టింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె కచ్చితంగా ఏదో మాస్టర్‌ ప్లాన్‌తోనే ఇండియాకు వచ్చినట్టు అర్థమవుతోంది. పాకిస్తాన్‌ సైన్యంలో పనిచేస్తున్న ఆసిఫ్‌కు తన భార్య సీమా స్వయాన సోదరి అని, వారిద్దరూ తరచూ మాట్లాడుకునేవారని గులాం హైదర్‌ అధికారుల సమక్షంలో వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో ఉంటున్న సీమ మామ పాకిస్తాన్‌ ఆర్మీలో ఉన్నత పదవిలో ఉన్నారని గులామ్‌ తెలిపారు.

పాకిస్తాన్‌ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా చొరబడిన తర్వాత సీమా ముందుగా సచిన్‌ మీనాను కలుసుకోలేదని విచారణలో తేలింది. ఆమెకు రాజధాని ఢిల్లీలో కొంతమందితో పరిచయం ఉన్నదట! ఏటీఎస్‌ అధికారులు అడిగే ప్రతీ ప్రశ్నకు సీమా ఎంతో ఆలోచించి చాలా తెలివిగా సమాధానాలు ఇస్తున్నదట! నలుగురు పిల్లలతో సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్‌ను మొదట చూసిన వారంతా సాధారణ గృహిణిగానే భావించారు. కానీ ఆమె తెలివితేటలను చూసి ఏటీఎస్‌ అధికారులే బిత్తరపోతున్నారు. విచారణలో ఆమె ఎంతో తెలివిగా వ్యవహరిస్తోందని, ఆమె నుంచి సమాధానాలను రాబట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తున్నదని ఏటీఎస్‌ అధికారులు తెలిపినట్టు సంబంధిత వర్గాలు అంటున్నాయి. విచారణ సందర్భంగా అధికారులు సీమా హైదర్‌కు పలు కీలక ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తున్నది. ఈ సందర్భంగా 5వ తరగతి చదివిన ఆమె ఇంగ్లీషులో స్పష్టంగా, అనర్గళంగా మాట్లాడటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఉత్తరప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారుల విచారణకు ముందు సీమా హైదర్‌ ఢిల్లీ పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్పుడే ఆమెను నోయిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాను పూర్తిస్థాయిలో హిందువుగా మారిపోయానని, తిరిగి పాకిస్తాన్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ వెళ్లబోనని పోలీసులకు తెలిపినప్పుడు కూడా ఆమెను అమాయకురాలుగానే అనుకున్నారు. ఇదిలాఉంటే సీమా హైదర్‌ పాకిస్తాన్‌ ఏజెంట్‌ అని, ఆమెను తిరిగి ఆ దేశానికి పంపాలని గుర్తుతెలియని వ్యక్తులు ముంబాయి పోలీసులకు మెసేజ్‌ పంపారు. ఈ బెదిరింపు సందేశంపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఇంత జరుగుతున్నా సీమా హైదర్‌ భర్త మాత్రం ఆమెను ఎలాగైనా పాకిస్తాన్‌కు పంపాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తన భార్యా పిల్లలను పాక్‌కు పంపాలని, వారితో కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని వేడుకుంటున్నాడు.

Updated On 19 July 2023 3:35 AM GMT
Ehatv

Ehatv

Next Story