హర్యానాలో(Haryana) బీజేపీ(BJP) ఓడిపోతుందని అన్ని రకాల సర్వేలు వెల్లడించాయి.
హర్యానాలో(Haryana) బీజేపీ(BJP) ఓడిపోతుందని అన్ని రకాల సర్వేలు వెల్లడించాయి. కాంగ్రెస్‌కు(Congress) అక్కడ కేక్ వాక్ అంటూ ప్రాపగండా నడిచింది. బీజేపీకి జాట్ వర్గీయులు వ్యతిరేకంగా ఉన్నారు. హర్యానాలో రెజ్లర్లు కూడా ఈ రాష్ట్రంలో అధికంగా ఉంటారు. వినేష్ పొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాలాంటి వారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. హర్యానాలో 10 ఏళ్లుగా బీజేపీదే అధికారం. ఈ సారి ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంటుందని భావించారు. ఇవన్నీ చూసి బీజేపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అందరూ విశ్లేషించారు. పైగా కర్నాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇవ్వగా ఈ సారి హర్యానాలో ఏకంగా ఏడు గ్యారెంటీలు ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని భావించారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ.. హర్యానా ప్రజలు ఎందుకు బీజేపీ వైపునకు మొగ్గు చూపారన్నదానికి విశ్లేషకులు రకరకాల కారణాలు చెప్తున్నారు. కర్నాటకలో ఐదు గ్యారెంటీలు, తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కావడం లేదని.. ఈ రెండు రాష్ట్రాల ప్రజలను కాంగ్రెస్ అన్ని విధాలా మోసం చేసిందని బీజేపీ రాష్ట్రంలో బలంగా వాదనలు తీసుకెళ్లిందని అంటున్నారు. కర్నాటకలో ఇప్పటికే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని.. అందుకు మొన్న పార్లమెంట్‌లో జరిగిన ఎన్నికలే ఉదాహరణని చెప్తున్నారు. తెలంగాణలో కూడా 10 నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. హర్యానా బీజేపీ అక్కడ ఎస్టాబ్లిష్ చేసిందంటారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణలో రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని స్వయంగా చెప్పడంతో దాని ఇంపాక్ట్ కూడా పడిందని భావిస్తున్నారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని సమస్యలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుంది. హైడ్రా బుల్డోజర్ అంటూ బీజేపీ తన అమ్ములపొదిలి నుంచి ఓ అస్త్రాన్ని బయటకు తీసింది. దేశంలో బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే పేదలు, మధ్యతరగతి ఇళ్లను కూలుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రచారం చేసింది. తెలంగాణలో ఇళ్లు కోల్పోయిన బాధితులు, పేద ప్రజల ఆర్త నాదానాలను, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియాలో బీజేపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. గత రెండు నెలలుగా తెలంగాణలో జరుగుతున్న ఈ కూల్చివేతలను, ప్రభుత్వంపై ప్రజల విరుచుకుపడడాన్ని అక్కడి ప్రజలకు వివరించారు. ఏడు గ్యారెంటీలు కావు.. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఆరా తీయాలని ప్రజలకు సూచించారు. రుణమాఫీ అంశాన్ని, రైతులు, మహిళలకు ఇస్తామన్న నగదు, పెన్షన్ల పెంపులో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని విస్తృత ప్రచారం చేశారు. దీంతో హర్యానా ప్రజలు పునరాలోచనలో పడ్డారని విశ్లేషిస్తున్నారు. హర్యానా ఓటమికి కర్నాటకలోని కాంగ్రెస్ ఒక కారణమైతే.. తెలంగాణ కాంగ్రెస్ కూడా మరొక కారణమని పరోక్షంగా గుసగుసలాడుకుంటున్నారు.