సెంట్రల్ నేపాల్‌లోని మార్స్యాంగ్డి నదిలో శుక్రవారం భారతీయ ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో 18 మంది మరణించారు

సెంట్రల్ నేపాల్‌లోని మార్స్యాంగ్డి నదిలో శుక్రవారం భారతీయ ప్రయాణీకుల బస్సు పడిపోవడంతో 18 మంది మరణించారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో డ్రైవర్, కో-డ్రైవర్, కండక్టర్ సహా మొత్తం 43 మంది ఉన్నారు. ప్రయాణికులంతా మహారాష్ట్రకు చెందిన వారని స‌మాచారం. 8 రోజుల పర్మిట్‌తో ఆగస్ట్ 20న రూపండేహిలోని బెల్హియా చెక్ పాయింట్ (గోరఖ్‌పూర్) నుంచి బస్సు నేపాల్‌లోకి ప్రవేశించింది. తనాహున్ జిల్లాలోని ఐనా పహాడా వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ నేపాల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ స్కూల్‌కు చెందిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పి) మాధవ్ పాడెల్ నేతృత్వంలోని 45 మంది సిబ్బంది బృందం ప్రమాద స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 17 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా ఎనిమిది మంది గల్లంతయ్యారు.

బస్సు పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తోంది. తనహున్ ఎస్పీ బీరేంద్ర షాహి ప్రమాదంపై సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో స్థానిక పోలీసు కార్యాలయ ఇన్‌స్పెక్టర్ అబు ఖైరేని ఉన్నారు. సైన్యం, సాయుధ బలగాలకు సమాచారం అందించారు. ప్ర‌మాదానికి గురైన‌ బస్సు నంబర్ UP 53 FT 7623. మరింత సమాచారం తెలియాల్సివుంది. నేపాల్ ఘటనకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నామని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ తెలిపారు.

ఈ ఏడాది జూలైలో కూడా రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 65 మంది నేపాల్‌లోని త్రిశూలి నదిలో కొట్టుకుపోయారు. అప్పుడు ఖాట్మండు వెళ్తున్న ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సు ప్రమాదానికి గురయ్యాయి. బస్సులు ఖాట్మండు నుంచి రౌతహాట్‌కు వెళ్తున్నాయి. ఈ ప్రాంతంలో భారీ వర్షం నేప‌థ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story