సార్వత్రిక ఎన్నికల(Indian general elections)కు సమయం ఆసన్నమయ్యింది. మహా అయితే మరో తొమ్మిది నెలల గడువు మాత్రమే ఉంది. అంతకు అయిదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పనిలో పనిగా లోక్‌సభ ఎన్నికలకూ కసరత్తులు మొదలుపెట్టాయి. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగాయి.

సార్వత్రిక ఎన్నికల(Indian general elections)కు సమయం ఆసన్నమయ్యింది. మహా అయితే మరో తొమ్మిది నెలల గడువు మాత్రమే ఉంది. అంతకు అయిదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. పనిలో పనిగా లోక్‌సభ ఎన్నికలకూ కసరత్తులు మొదలుపెట్టాయి. ఇదే సమయంలో సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ప్రజల ఏమనుకుంటున్నారో, వారి మూడ్‌ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రముఖ ఛానెల్‌ ఇండియా టీవీ(India TV)తో కలిసి సిఎన్‌ఎక్స్‌(CNX) సంస్థ చేసిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎప్పటిలాగే నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్‌డీఎ కూటమి విపక్ష కూటమి కంటే బ్రహ్మండమైన ఆధిక్యాన్ని సంపాదించుకుంటుందని ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌ సర్వే నివేదిక చెబుతోంది.

దేశ్‌ కీ అవాజ్‌ పేరుతో ఇండియా టీవీ ఛానెల్‌ ఈ సర్వే నివేదికను ప్రసారం చేసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 265 స్థానాలకు జరిపిన సర్వే సారాంశాన్ని విడుదల చేసింది. మిగతా 278 స్థానాల్లో ఏం జరగబోతున్నదో శనివారం వివరించబోతున్నది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, బీహార్‌, జార్ఖండ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌, లడక్‌ ప్రాంతాల ప్రజల మనోగతం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది సర్వే సంస్థ. ఈ ప్రాంతాలలో ఉన్న మొత్తం 265 లోక్‌సభ స్థానాలలో ఎన్‌డీఏకు 114 స్థానాలు వస్తాయని ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌ అంచనా వేసింది.

ఇండియా(INDIA) కూటమి 85 సీట్లు గెల్చుకుంటుందని, మిగతా పక్షాలు 36 స్థానాలలో విజయం సాధిస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకుగాను ఎన్‌డీఏకు 21 స్థానాలు వస్తాయట! కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమికి కేవలం నాలుగు స్థానాలే వస్తాయట! అలాగే బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఉన్న 29 స్థానాలలో ఎన్‌డీఏకు 24 స్థానాలు వస్తాయట. మిగతా అయిదు స్థానాలలో కాంగ్రెస్‌ కూటమి గెలుస్తుందని సర్వే చెబుతోంది. తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ ఉన్న 39 స్థానాలలో ఇండియా కూటమి 30 స్థానాలు గెల్చుకునే అవకాశం ఉంది.

ఎన్‌డీఎ కూటమికి తొమ్మిది స్థానాలు లభిస్తాయి. బీహార్‌లో ఎన్టీయే కూటమి 24 స్థానాలు గెల్చుకుంటుందని ఇండియా టీవీ అంచనా వేస్తోంది. ఇండియా కూటమికి 16 లోక్‌సభ స్థానాలు వస్తాయని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 లోక్‌సభ స్థానాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 18 సీట్లు వస్తాయంటోంది సర్వే.. ఏడు స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కాంగ్రెస్‌, బీజేపీలకు ఒక్క సీటు కూడా రాదని చెప్పింది. తెలంగాణ సంగతికి వస్తే మొత్తం 17 లోక్‌సభ స్థానాలలో అధికార భారత్‌ రాష్ట్ర సమితి తొమ్మిది స్థానాలను గెల్చుకునే ఛాన్సుంది. ఎన్డీయేకు ఆరు సీట్లు వస్తాయని, కాంగ్రెస్‌ రెండు సీట్లు గెల్చుకుంటుందని సర్వే నివేదక చెబుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఏడు లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఒకవేళ ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party), కాంగ్రెస్‌(Congress) మధ్య పొత్తు ఉంటే మాత్రం బీజేపీ(BJP)కి అయిదు సీట్లు వస్తాయని, మిగతా రెండు ఇండియా కూటమికి వస్తాయని ఇండియా టీవీ అంటోంది. పంజాబ్‌లో మాత్రం ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని అంచనా వేసింది. మొత్తం 13 స్థానాలూ ఇండియా కూటమి ఖాతాలో వెళతాయట! ఎన్టీయేకు ఒక్క సీటు కూడా రాదట! జమ్ము కశ్మీర్‌, లడాక్‌ ప్రాంతంలో మొత్తం ఆరు లోక్‌సభ స్థానాలున్నాయి. ఇందులో ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు, ఇండియా కూటమికి రెండు స్థానాలు, ఇతరులకు ఒక స్థానం దక్కే అవకాశం ఉందని సర్వే అంటోంది. కాంగ్రెస్‌ పాలిత హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ఇందులో ఎన్డీయేకు మూడు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు వస్తాయని ప్రిడెక్ట్‌ చేస్తోంది. హర్యానాలో ఎన్డీయే కూటమికి ఎనిమిది స్థానాలు, కాంగ్రెస్‌ కూటమికి రెండు స్థానాలు వస్తాయట! జార్ఖండ్‌ ముక్తి మోర్చా పాలిస్తున్న జార్ఖండ్‌లో ఎన్టీయే కూటమికి 13 స్థానాలు వస్తాయని, ఇండియా కూటమి ఒకే ఒక్క స్థానంలో గెలుస్తుందన్నది అంచనా! కాంగ్రెస్ పాలిత చత్తీస్‌గఢ్‌లో 11 లోక్‌సభ స్థానాలలో ఏడు ఎన్డీయే కూటమికి వస్తాయని, మిగతా నాలుగు కాంగ్రెస్‌ కూటమి గెలుస్తుందని సర్వే చెబుతోంది. అస్సాంలో ఉన్న 14 లోక్‌సభ స్థానాలలో ఎన్డీయే కూటమికి 12 సీట్లు వస్తాయని అంటోంది. ఇండియా కూటమి, ఎఐయూడీఎఫ్‌లు చెరో ఒక స్థానాన్ని గెల్చుకుంటాయట! మణిపూర్‌లో ఉన్న రెండు లోక్‌సభ స్థానాలను ఇండియా కూటమి దక్కించుకుంటుంది. ఇవి పోను ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మేఘాలయ, నాగలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, త్రిపుర, సిక్కింలలో ఉన్న తొమ్మిది లోక్‌సభ స్థానాలు ఎన్టీయే ఖాతాలోకి వెళ్లిపోతాయట!

Updated On 29 July 2023 1:35 AM GMT
Ehatv

Ehatv

Next Story