బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దింపడానికి ఇండియా కూటమిగా ఒక్కటైన విపక్షాలు ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను గద్దె దింపడానికి ఇండియా కూటమిగా ఒక్కటైన విపక్షాలు ఇప్పుడు ఎవరిదారి వారు చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బహిర్గతమయ్యాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు హాజరుకాలేదు. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో జరిగిన ఇండియా కూటమి భేటీకి కూడా తృణమూల్ కాంగ్రెస్ హాజరు కాలేదు. మంగళవారం కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు తృణమూల్ కాంగ్రెస్‌తో పాటుసమాజ్‌వాదీ పార్టీ కూడా గైర్హాజరయ్యాయి.మంగళవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. అయితే స్పీకర్ ఇందుకు అంగీకరించకపోవడంతో నిరనసగా సభ నుంచి కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (Uddhav), ఎన్సీపీ (Sharad Pawar) పార్టీలు వాకౌట్ చేశాయి. తర్వాత పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ధర్నా చేపట్టింది. ఈ ప్రదర్శనకు కూడా సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు డుమ్మా కొట్టాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడం గమనార్హం. కాంగ్రెస్‌కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని అనుకుంటున్నదని టీఎంసీ తెలిపింది.