PM Modi : డెవలప్‌డ్ ఇండియా-2047 అంటే కేవలం మాటలు కాదు.. దీని వెనుక కఠోర కృషి జరుగుతోంది
నేడు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు
నేడు దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చారిత్రాత్మక ఎర్రకోట ప్రాకారంపై నుంచి జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. 11వ సారి ఆయన ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎర్రకోట నుంచి చేస్తున్న మొదటి ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో పెద్ద సంస్కరణలు అమలు చేశామని ప్రధాని మోదీ అన్నారు. పేదవారైనా, మధ్యతరగతి వారైనా, అణగారిన వారైనా, మన యువతకు సంబంధించిన తీర్మానాలు, కలలు లేదా పెరుగుతున్న మన పట్టణ జనాభా, వారందరి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మేము సంస్కరణ మార్గాన్ని ఎంచుకున్నామన్నారు. దేశాన్ని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని.. సంస్కరణల పట్ల మా ప్రభుత్వానికి నిబద్ధత ఉందని నేను దేశప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను అని ప్రధాని అన్నారు. ఒకప్పుడు ఉగ్రదాడుల బారిన పడిన భారత్.. ఇప్పుడు ధైర్యంగా, బలంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ వంటి మన బలవంతపు చర్యలు మన ప్రజల్లో గర్వాన్ని నింపుతాయి. నేడు, 140 కోట్ల మంది భారతీయులు విశ్వాసం నిండి ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సంస్కరణల సంప్రదాయం ద్వారా సాధికారత పొందారని అన్నారు.
డెవలప్‌డ్ ఇండియా-2047 అంటే కేవలం మాటలు కాదని ప్రధాని మోదీ అన్నారు. దీని వెనుక కఠోర కృషి జరుగుతోంది, దేశ ప్రజల నుండి సూచనలు తీసుకుంటున్నాం. దేశంలోని కోట్లాది మంది పౌరులు అభివృద్ధి చెందిన భారతదేశం-2047 కోసం లెక్కలేనన్ని సూచనలు ఇచ్చారు. దేశంలోని సామాన్య పౌరులు మాకు అమూల్యమైన సూచనలు చేశారని ప్రధాని అన్నారు. దేశంలోని సామాన్య ప్రజలలో దృఢ సంకల్పం కనిపించినప్పుడు.. మనలో కొత్త సంకల్పం ఏర్పడుతుందని.. మన మనస్సులో విశ్వాసం కొత్త శిఖరాలకు చేరుతుందని ప్రధాని అన్నారు. టూరిజం, విద్య, ఆరోగ్యం, ఎంఎస్‌ఎంఈ, రవాణా, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ కొత్త ఆధునిక వ్యవస్థ రూపొందుతోందని ప్రధాని మోదీ అన్నారు. సాంకేతికత అనుసంధానంతో అత్యుత్తమ పద్ధతులను అవలంబిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు.