శరన్నవరాత్రులు(Sharan Navaratri,) మొదలయ్యాయి. దేశమంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
శరన్నవరాత్రులు(Sharan Navaratri,) మొదలయ్యాయి. దేశమంతటా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయాలకు భక్తులు తరలివెళుతున్నారు. ముఖ్యంగా అమ్మవారి శక్తి పీఠాలలో భక్తుల రద్దీ ఎక్కువయ్యింది. అమ్మవారు వివిధ అలంకాలలో దర్శనమిచ్చే అపురూప సందర్భం ఇదే. దేవీ నవరాత్రులప్పుడు రాజస్తాన్‌లోని(Rajasthan) ఇడాన మాత ఆలయం(Idana mata temple) గుర్తుకు రాకుండా ఉండదు. ఈ గుడిలో ఓ అద్భుతం జరుగుతుంటుంది. అది సైన్స్‌కే అంతుపట్టని మిస్టరీగా ఉంది. ఉదయ్‌పూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో గాయత్రి శక్తి పీఠ్ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు ఇడానమాతగా పూజలందుకుంటున్నారు. చతురస్రాకారంలో ఉన్న ఈ ఆలయానికి పై కప్పు ఉండదు. ఈ అమ్మవారికి వసంత నవరాత్రులు నిర్వహిస్తారు. చైత్రమాసంలో జరిగే ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో అక్కడో అద్భుతం జరుగుతుంది. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు అగ్ని స్నానమాచరిస్తుది. వాటంతట అవే పుట్టిన అగ్నికీలలు అన్ని చోట్లకు వ్యాప్తిస్తాయి. అమ్మవారికి స్నానం చేయిస్తాయి. పది నుంచి 20 అడుగుల మేర అగ్ని కీలలు వ్యాపిస్తాయి. అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు, వస్త్రాలు కాలి బూడిద అవుతాయే తప్ప అమ్మవారి విగ్రహానికి ఏమీ కాదు. అది అమ్మవారి మహిమగానే భావిస్తారు భక్తులు. నవరాత్రులు ప్రారంభమయ్యే మొదటి రోజున ఇలా అమ్మవారు అగ్ని స్నానమాచరిస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోయారు. పోనీ అగరవత్తుల నుంచి మంటలు అంటుకుంటున్నాయా అంటే అసలు అక్కడ అగరవత్తులనే వెలిగించరు. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించారని స్థానికులు చెబుతుంటారు. ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు జైసమంద్‌ను నిర్మిస్తున్న సమయంలో అప్పటి రాజస్తాన్‌ను పాలించిన జైసింగ్ మహారాజు ఇక్కడి అమ్మవారికి పూజలు చేశారని, అప్పటి నుంచి అమ్మవారు ఇడానా మాతగా పూజలు అందుకుంటున్నారని అంటుంటారు. మానసిక రోగులు, పక్షవాతం వచ్చినవారు ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే స్వస్థత చేకూరుతుందని నమ్మకం. ఈ ఆలయంలో ఎక్కడ చూసినా త్రిశూలాలు కనిపిస్తాయి. అమ్మవారు అగ్నిస్నానమాచరించిన తర్వాత భక్తులు మాతకు త్రిశూలాన్ని సమర్పిస్తారు. పిల్లలు లేని వారు ఈ త్రిశూలాన్ని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల విశ్వాసం!