జాతి జనులు సగర్వంగా, సంతోషంగా జరుపుకునే జెండా పండుగకు యావత్తు దేశం సమాయత్తమయ్యింది. భారతదేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న శుభఘడియలను స్మరించుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ ఇది! దేశమాత శృంఖలాలను తెంచడానికి స్వాతంత్ర్య సంగ్రామంలో దూకిన మహనీయులకు అంజలి ఘటించే సందర్భం ఇది!

జాతి జనులు సగర్వంగా, సంతోషంగా జరుపుకునే జెండా పండుగకు యావత్తు దేశం సమాయత్తమయ్యింది. భారతదేశ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న శుభఘడియలను స్మరించుకుంటూ జరుపుకునే గొప్ప పండుగ ఇది! దేశమాత శృంఖలాలను తెంచడానికి స్వాతంత్ర్య సంగ్రామంలో దూకిన మహనీయులకు అంజలి ఘటించే సందర్భం ఇది! జాతిని నడిపి, నీతిని నిలిపిన ఆ మహానుభావుల త్యాగనిరతిని మననం చేసుకునే శుభదినం ఇది! ఈ సందర్భంగా జెండా పండుగ జరిగే ఎర్రకోట ప్రత్యేకతలను పరికిద్దాం!
ఎర్రకోట. కేవలం ఎర్రరాతితో నిర్మించిన సౌధం కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు అది సాక్షిభూతం. మొగల్‌ పాలకుల వైభవాన్ని చూసిన ఆ కోటే అంతిమకాలంలో వారి దుస్థితినీ చూసింది. శాంతికాముకులను చూసి సంబరపడింది. యుద్ధోన్మాదులను చూసి వణికిపోయింది. బ్రిటిష్‌ పాలకుల దురాగతాలను భరించింది.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించింది. భారతీయుల ఆత్మగౌరవానికి సంకేతమైన ఆ లాల్‌ ఖిలా రహస్యాలతో పాటు స్వాతంత్ర్యదినోత్సవాలకు అదే ఎందుకు వేదికగా మారిందో తెలుసుకుందాం!

ఎర్రకోట. భారతీయుల ఆత్మగౌరవానికి పెట్టని కోట! స్వాభిమానానికి ప్రతీక! స్వాతంత్ర్య కాంక్ష రగిలించిన చోటు! తెల్లదొరల దాష్టీకాలకు తెరపడిన చోటు! ఎర్రకోట. 375 సంవత్సరాల వయసులో ఇంకా నవ యవ్వనపు సింగారింపులతో మెరిసిపోతున్నదీ కోట! ఎన్ని అనుభూతులను నిక్షిప్తం చేసుకున్నదో కదా! బాదుషాల వైభవాలను కళ్లారా చూసిన ఈ కోటే రక్తపుటేరుల బీభత్స భయానక దృశ్యాలనూ వీక్షించింది.. ఆనందకేళీలను చూసిన కన్నులతోనే ఆంగ్లేయుల జులుంను చూసింది. స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మబలిదానాలను చూసి మౌనంగా రోదించింది.స్వతంత్ర భారతదేశపు పరిమళాలను ఆస్వాదించింది. ఆ ఎర్రటి కోట ఎన్ని జ్ఞాపకాలను దిగమింగుకుందో కదా!

పంద్రాగస్టున ప్రధానమంత్రులు ఎర్రకోట(Red Fort) మీద జెండాను ఎందుకు ఎగరేస్తారు..? అంటే ఆ కోట స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు సూచిక కాబట్టి! మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి ఇక్కడే బీజం పడింది కాబట్టి!

మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించిన కోట ఇది! అప్పట్లో మొగల్‌ చక్రవర్తుల రాజధాని ఆగ్రా. షాజహాన్‌కు పెద్ద పెద్ద కట్టడాలను నిర్మించాలన్న కోరిక ఉండేది. రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి తరలించాలనుకున్న ఆ బాద్‌షా ఓ బ్రహ్మాండమైన కోటను నిర్మించాలనుకున్నాడు. తన సలహాదారులు ఉస్తాద్‌ హమీద్‌, ఉస్తాద్‌ హైమద్‌లకు ఆ బాధ్యతను అప్పగించాడు. యమునా నది ఒడ్డున ఉన్న విశాల మైదానం కోట నిర్మాణానికి అనువైన ప్రదేశంగా వారు గుర్తించారు. 1638లో శంకుస్థాపన జరిగింది. పదేళ్ల పాటు కార్మికులు. శిల్పకారులు.భవన నిర్మాతలు అహర్నిశమూ పని చేసి ఓ అద్భుతమైన కోటను సృష్టించారు. అదే లాల్‌ ఖిలా!

తైమూరు, పర్షియన్, యూరప్‌, ఇండో భవన నిర్మాణ శైలులు ఈ కోట నిర్మాణంలో కనిపిస్తాయి. కోట చుట్టుపక్కల ప్రాంతం నగరంగా రూపుదిద్దుకుంది. ఆ నగరమే షాజహానాబాద్‌. ఇదే ఇప్పుడు ఢిల్లీ అయ్యింది. ఓ పక్క యమునా నది. మూడువైపులా కందకాలు కోటకు రక్షణ కవచాలు.భూమ్మీద స్వర్గమంటూ ఉంటే అది ఇక్కడే.. అది ఇక్కడే. అది ఇక్కడే...! ఈ కవితా పంక్తులు పర్షియన్‌ కవి అమీర్‌ ఖుస్రోవి! ఈ పంక్తులనే షాజహాన్ ఆంతరంగిక సమాలోచనలు జరుపుతూ ఉండే దివాన్‌-ఇ-ఖాస్‌ గోడ మీద చెక్కించాడు ఆయన పెద్ద కుమారుడు దారా షిఖో. ఏ ఉద్దేశంతో షిఖో చెక్కించాడో కానీ.. నిజంగానే ఎర్రకోట ఓ స్వర్గధామం! వర్తకం నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటిష్‌వారు నెమ్మదిగా ఒక్కో గణతంత్ర రాజ్యాన్ని ఆక్రమించుకోసాగారు. వారి కన్ను ఎర్రకోటపైన పడింది. ఎర్రకోటను ఆక్రమించుకుంటే సమస్త భారతావనిని గుప్పిట్లో పెట్టుకున్నట్టేనన్నది తెల్లవాళ్ల దురాలోచన! సరిగ్గా ఈ సమయంలోనే అంటే 1857లో బ్రిటిష్‌ పాలకులపై సిపాయిల తిరుగుబాటు జరిగింది. మొదట మీరట్‌లో ప్రారంభమైన తిరుగుబాటు మహా సంగ్రామంగా రూపుదిద్దుకుంది. ఆశేష ప్రజానీకం బ్రిటిష్‌ వారిపై పోరుకు సిద్ధమైంది. సిపాయిలు ఆగమేఘాల మీద ఢిల్లీకి వచ్చి ఈ ఎర్రకోటలోనే బహదూర్‌ షా జఫర్‌ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు. ఆయన నాయకత్వం కిందే సమరయోధులంతా ఒక్కటయ్యారు. ఇది బ్రిటిష్‌ వారికి రుచించలేదు. ఎర్రకోటను ఆక్రమిస్తే స్వాతంత్ర్య కాంక్ష చల్లారినట్టేనని భావించారు. దాడికి దిగారు. తిరుగుబాటు విఫలమయ్యాక సెప్టెంబర్‌ 17న బహదూర్‌షా జఫర్‌ కోటను వదిలి వెళ్లాడు. ఆయన్ను బ్రిటిష్‌ వాళ్లు ఖైదీగా తిరిగి ఎర్రకోటకే తెచ్చారు. ఆఖరి మొగల్‌ మీద న్యాయ విచారణ జరిపించారు. రాజ్యబహిష్కరణ పేరుతో బందీగా బర్మాకు తీసుకెళ్లారు..

ఎర్రకోటను ఆక్రమించిన తెల్లవాళ్లు ఆ కోటను చాలా మట్టుకు ధ్వంసం చేశారు. కోట వెలుపల. లోపల అందమైన ఉద్యానవనాలుండేవి. వాటిని పూర్తిగా నాశనం చేశారు. రంగమహల్‌, ముంతాజ్‌ మహల్‌, చాంద్‌నీ మహల్‌ను పూర్తిగా నేలమట్టం చేశారు.. తోటను నాశనం చేశారు. సైనిక కేంద్రంగా మార్చేశారు. ఎర్రకోటనైతే ఆక్రమించగలిగారు కానీ.. భారత ప్రజల్లో రోజురోజుకి పెరుగుతున్న స్వాతంత్ర్య కాంక్షను మాత్రం అదుపు చేయలేకపోయారు. ఈ ఎర్రకోటలోనే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు చెందిన ముగ్గురు వీరులు గురుభక్షక్‌ సింగ్‌ ధిల్లాన్‌, ప్రేమ్‌కుమార్‌ సెహగల్‌, సయ్యద్‌ షానవాజ్‌లపై రాజద్రోహం నేరాన్ని మోపి కోర్ట్‌ మార్షల్‌ జరిపింది బ్రిటిష్‌ ప్రభుత్వం. ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేయాలన్నది నేతాజీ ఆశయం. కోట లోపల విచారణ జరుగుతుంటే. బయట వేలాది మంది 'లాల్‌ఖిలేసే ఆయీ ఆవాజ్‌..సెహగల్‌..ధిల్లాన్‌..షానవాజ్‌..తీనోంకీ హో ఉమర్‌ దరాజ్‌' అని దిక్కులు పిక్కటిల్లేలా తెల్లవాళ్ల గుండెలు అదిరేలా నినాదాలు చేశారు. స్వాతంత్ర్య పోరాటాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన మహోద్విగ్న ఘట్టాలవి. ఆ నినాదాలే దేశమంతా ప్రతిధ్వనించాయి. బారిస్టర్‌ విద్యను అభ్యసించినప్పటికీ స్వాతంత్ర్య సమరరంగాన దూకిన జవహర్‌లాల్‌ నెహ్రు, అసఫ్‌ అలీ, భులాబాయ్‌ దేశాయ్‌, తేజ్‌ బహదూర్‌ సప్రూ, కైలాస్‌నాథ్‌ కట్జులు మళ్లీ న్యాయవాదులుగా మారి ఈ ముగ్గురు యోధుల తరఫున వాదించారు. అఖండ భారత ప్రజల ఆగ్రహావేశాలను ప్రత్యక్షంగా చూసిన బ్రిటిష్‌ పాలకులు ఆ ముగ్గురు వీరులను విడుదల చేశారు..

ఇది జరిగిన కొద్ది కాలానికే ఆంగ్లేయులు భారత్‌ను విడిచిపెట్టి వెళ్లారు. ఎర్రకోటతో సహా! ఈ కోటకు అయిదు దర్వాజాలున్నాయి. అందులో ప్రధానమైనది లాహోర్‌ గేట్‌! భారత ప్రధానమంత్రులు జాతీయ పతాకాన్ని ఎగురవేసేది లాహోర్‌ గేట్‌ నుంచే! దక్షిణం వైపు ఉన్న మరో ప్రధాన ద్వారం ఢిల్లీ గేట్‌! దీని ఎదురుగా జామామసీదు ఉంది. షాజహాన్‌ ఈ ద్వారం నుంచే జామా మసీదుకు వెళ్లి నమాజ్‌ చేసేవాడు. 1947 పంద్రాగస్టున తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రు మువ్వన్నెల జెండాను ఎగరేశారు.. అప్పట్నుంచి ఎర్రకోటపై త్రివర్ణ పతకాన్ని ఎగరేసి భారత ప్రజలకు సందేశం ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఎర్రకోట నుంచి ఎక్కువ సార్లు జాతీయ పతాకాన్ని ఎగరేసిన ఘనత కూడా నెహ్రూదే! మొత్తం 17 సార్లు జెండాను ఆవిష్కరించారాయన! ఇందిరాగాంధీ 16 సార్లు, మన్మోహన్‌ పదిసార్లు, మోదీ తొమ్మిది సార్లు, వాజపేయి ఆరుసార్లు, రాజీవ్‌గాంధీ, పి.వి.నర్సింహరావులు చెరో అయిదుసార్లు ఎర్రకోట నుంచి ప్రసంగించారు. లాల్‌బహదూర్‌శాస్త్రికి రెండుసార్లు ఈ అదృష్టం దక్కింది. ఇక చరణ్‌సింగ్‌, వి.పి.సింగ్‌, దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లకు ఒక్కోసారి ఈ అవకాశం లభించింది.. ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పటికీ ఎర్రకోటపై జెండా ఎగరేసే భాగ్యం దక్కని ప్రధానమంత్రులు ఇద్దరే ఉన్నారు.ఒకరు గుల్జారీలాల్‌ నందా కాగా, రెండో వారు చంద్రశేఖర్‌.

ఎర్రకోట నుంచి ప్రధానులు చేసే ప్రసంగాలకు ప్రజలు దూరం కాలేదు కానీ ప్రధానులే క్రమక్రమంగా దూరమవుతూ వచ్చారు. నెహ్రూ కాలంలో ప్రజలు ప్రధానికి అత్యంత సమీపంలో ఆసీనులయ్యేవారు. ఇప్పుడేమో కొన్ని వందల మీటర్ల దూరం నుంచే ప్రధానులు మాట్లాడుతున్నారు. పైగా బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాల రక్షణ నుంచి. ఇప్పుడు ప్రజల కంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువగా ఉంటారంటే అతిశయోక్తి కాదేమో! రిపబ్లిక్‌ డే రోజున అతి విశిష్టమైన రిపబ్లిక్‌ డే పెరేడ్‌ రాష్ర్టపతి భవన్‌ నుంచి మొదలై.. ఇండియా గేట్‌.. కనాట్‌ ప్లేస్‌ల మీదుగా ఎర్రకోటకు చేరుతుంది.. త్రివిధ దళాల పాటవ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది..

Updated On 11 Aug 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story