శబరిమల వద్ద ఊహించని రద్దీ ఉండడంతో క్రిస్మస్ రోజున హైకోర్టు ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
శబరిమల(Sabarimala) వద్ద ఊహించని రద్దీ(Sabarimala Rush) ఉండడంతో క్రిస్మస్ రోజున హైకోర్టు(High Court) ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శబరిమలకు వెళ్లే వాహనాలను దారిలో అడ్డుకుంటే అవసరమైన సౌకర్యాలు కల్పించాలని.. అవసరమైతే రాష్ట్ర పోలీసు చీఫ్ నేరుగా జోక్యం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు దేవస్వం బెంచ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. అయిదు చోట్ల అయ్యప్ప భక్తుల వాహనాలను ఆపుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. పాలా, పొన్‌కున్నం, ఏటుమనూరు, వైకోమ్, కంజిరిపల్లిలో వాహనాలను అధికారులు ఆపుతున్నారు. వాహనాలను అడ్డుకునే సమయంలో భక్తులకు సరిపడా ఆహారం, నీరు అందేలా చూడాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం ఈ విషయంలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మరో రెండు రోజులకు వర్చువల్ క్యూ బుకింగ్‌ల సంఖ్య తొంభై వేలు దాటింది. స్పాట్ బుకింగ్‌లతో దాదాపు 10,000 మంది భక్తులు రావడంతో రానున్న రెండు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు శబరిమలను దర్శించుకోనున్నారు. దీంతో పాటు దాదాపు ఇరవై వేల మంది ఎలాంటి బుకింగ్ లేకుండానే శబరిమలకు చేరుకుంటున్నారు. ఎలాంటి బుకింగ్ లేకుండా వచ్చే వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారో తెలియజేయాలని శబరిమల భద్రతను చూసే ఏడీజీపీ ఎం.ఆర్.అజిత్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.
ఇక ఎరుమేలికి వచ్చే వాహనాలను ఎంఈఎస్ కాలేజీ వద్ద పోలీసులు నిలిపివేస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు పోలీసులు వాహనాలను నిలిపివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ వాహనాలను అనుమతించాలని ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు చెందిన పలువురు అయ్యప్ప స్వాములు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పంబ నుంచి సన్నిధానం వరకు భారీగా క్యూలైన్‌లు నిలిచిపోయాయి. ఈనెల 27తో మండల పూజలు ముగియనున్నాయి. వరుస సెలవులు రావడంతో కూడా అయ్యప్పలు భారీగా శబరిమలకు చేరుకున్నారు.