మనదేశంలో ఎన్ని జీవనదులున్నా గంగానదికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఓ పవిత్రతా ఉంది. గంగానదిలో స్నానమాచరిస్తే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి పావన నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గంగా నది వైభవాన్ని ఓసారి తెలుసుకుందాం! హరిపాదాల పుట్టిన గంగ. ఆ విష్ణువు పాదాలు కడిగి తాను మొత్తం పావనమైపోయిన గంగ. ఆ పుణ్య జలాల ప్రవాహాలతో భారతం మొత్తాన్ని నిత్య పుణ్యావచనం చేస్తోన్న గంగ. భారతీయులు గంగను నదిగా చూడరు.

మనదేశంలో ఎన్ని జీవనదులున్నా గంగానదికి ఓ ప్రాముఖ్యత ఉంది. ఓ పవిత్రతా ఉంది. గంగానదిలో స్నానమాచరిస్తే సకలపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇలాంటి పావన నదికి పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గంగా నది వైభవాన్ని ఓసారి తెలుసుకుందాం!

హరిపాదాల పుట్టిన గంగ. ఆ విష్ణువు పాదాలు కడిగి తాను మొత్తం పావనమైపోయిన గంగ. ఆ పుణ్య జలాల ప్రవాహాలతో భారతం మొత్తాన్ని నిత్య పుణ్యావచనం చేస్తోన్న గంగ. భారతీయులు గంగను నదిగా చూడరు. భగవత్స్వరూపంగా భావిస్తారు. భగవతిగా ఆరాధిస్తారు. గంగ వైభవాన్ని వర్ణించడం ఆదిశేషునికే సాధ్యం కాలేదట! హరిహరుల వైభవాన్ని తనలో నింపుకున్న గంగమ్మ తల్లి భూమ్మీద ప్రవహించడం మనుషులు చేసుకున్న పుణ్యం. భారతీయులు చేసుకున్న సుకృతం. ఆ పవిత్ర జలాల వైభవాన్ని వేదాలు కీర్తించాయి. పురాణాలు శ్లాఘించాయి. భాగీరథీ సుఖదాయినీ మాతా. తవ జల మహిమా నిగమే ఖ్యాతా. నాహం జానే తవ మహిమా. పాహి కృపామయూ మమాజ్ఞానమ్‌.

గంగ భారతీయులకు పవిత్ర నదీమతల్లి. భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ఆకాశమంత ఎత్తున నిలబెట్టిందా చల్లని తల్లి. భారతీయులకు అది కేవలం ఉదకం మాత్రమే కాదు. తీర్థం కంటే ఎక్కువ. గంగ కోటాను కోట్ల జనవాహినికి హృదయ గంగ. కరుణాంతరంగ. హిమనీనదంలో అవతరించి సముద్రంలో సంగమించేంత వరకు ప్రహహించిన ప్రతి చోటునూ ఆ భగీరథి పావనం చేస్తోంది. సస్యశ్యామలం చేస్తోంది. ప్రజల పాపాలను కడిగివేస్తోంది. సర్వ రోగాలను హరించివేస్తోంది. అదో జీవనధార...

హిమశైల శిఖరంలో పుట్టిన గంగోత్రి మందగమనంతో మందాకినియై దేవ ప్రయాగ దగ్గర అలకనందతో కలిసి గంగ అవుతుంది... అక్కడ్నుంచి వాగులు వంకలను మిళితం చేసుకుంటూ హరిద్వార్‌లో జనగంగ అవుతుంది. కోసి, గోమతి, శోణ వంటి నదులు ప్రవాహ మార్గంలో గంగలో కలుస్తాయి. ప్రయాగ దగ్గర యమున కలుస్తుంది. ఆ తర్వాత ఎన్నో నదులు గంగలో సంగమిస్తాయి. ప్రవాహ ఉధృతిని అమాంతం పెంచుతాయి. బెంగాల్‌లోని మాల్దా దగ్గర గంగ పాయలుగా చీలుతుంది. ఓ చీలిక హుగ్లీనదిగా మారుతుంది. ప్రధాన గంగ మాత్రం పద్మానదిగా మారి బంగ్లాదేశ్‌లో అడుగు పెడుతుంది. అక్కడ బ్రహ్మపుత్ర చీలిక అయిన జమునానదిలో కలుస్తుంది. అటు పిమ్మట మేఘన తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో పాయలుగా మారి బంగాళాఖాతంలో కలుస్తుంది..

గంగమ్మతల్లికి అనంతమైన చరిత్రవుంది. వేదాల్లో గంగ ప్రస్తావన వుంది. ఉపనిషత్తులో చోటు చేసుకుంది. రామాయణంలో వుంది. భారతంలో వుంది. భాగవతంలోనూ వుంది. భగవద్గీతతో పాటు పురాణాల్లో, జానపద కథల్లో, జనపదులు పాడుకునే పాటల్లో, భక్తి విశ్వాసాల్లో గంగ వుంది. గంగ సమస్త భారతీయులకు తల్లివంటిది. జన హృదయాల్లో ప్రవహించే అనంత వాహిని అది.
పర్వ దినాలు. పండుగ రోజుల్లో గంగలో స్నానం. జీవితాలకు పుణ్యఫలం. సాధారణ రోజుల్లో కూడా గంగానదిలో సుమారు పాతిక లక్షల మందికిపైగా పుణ్యస్నానమాచరిస్తారట! రోజుకు కోటి మందికి పైగా గంగమ్మను స్మరించుకుంటారట! అంత పవిత్రమైనది కాబట్టే ఆ చల్లని తల్లికి ప్రతిరోజు మంగళహారతి పట్టేది. సాగిలపడి మొక్కేది. శరణు వేడుకునేది.

ఆ నదీ తీరాల్లో అనేక నాగరికతలుఆవిర్భవించాయి. మహోన్నతంగా విలసిల్లాయి. ఆ తీరం వెంబడే గుళ్లు గోపురాలు నిర్మితమయ్యాయి. హరిత వనాలు వెలిశాయి. పాడిపంటలతో భాగ్యసీమలయ్యాయి. వర్తక వాణిజ్యాలకు ఆధారాలయ్యాయి. గంగ లేని భారతావనిని ఊహించుకోవడం కష్టం. గంగతో ముడిపడిలేని బతుకును భరించడం మరీ కష్టం. గంగను స్మరించకుండా వుండటం మహా కష్టం. గంగలో స్నానం చేయడమంటే యజ్ఞ యాగాదులు చేసినంత పుణ్యమట! గంగాజలాన్ని తాకితే చాలు. పూజలు వ్రతాలు చేసింతన ఆధ్యాత్మిక సంపత్తి కలుగుతుందట! ఏడేడు తరాలు పవిత్రమైపోతాయట! గంగ లేని దేశం సోమం లేని యజ్ఞంలాంటిదట! చంద్రుడు లేని రాత్రిలాంటిదట! విరులివ్వని చెట్టులాంటిదట! ఆ గంగాతనయుడు భీష్ముడు అంపశయ్య మీద వున్నప్పుడు గంగ గురించి పలికిన పలుకులివి!

గంగావతరణంపై అనేక పురాణ కథలున్నాయి. భాగవతంలోనూ, బృహద్ధర్మ పురాణంలోనూ, దేవీ భాగవతంలోనూ గంగావరణ గాధలున్నాయి. రామాయణంలోనూ గంగ ప్రస్తావన కనిపిస్తుంది. అరణ్యవాసానికి వెళుతున్న సీతారామలక్ష్మణులను గుహుడు దాటించింది గంగానదినే! భారతంలో భీష్ముడి గాధ తెలిసిందే. శంతన మహారాజు గంగను ప్రేమిస్తాడు.పెళ్లి చేసుకుంటాడు. ఆ గంగాదేవికి భీష్ముడనే గాంగేయుడు జన్మిస్తాడు. గంగను దేవతగా, చల్లని తల్లిగా భావించడం అనాదిగా వస్తుందన్నది చారిత్రక సత్యం. వామనావతారంలో వున్న విష్ణుమూర్తికి బలిచక్రవర్తి మూడడుగుల నేలను దానమిస్తాడు. ఆ నేలను ఆక్రమించడానికి తివిక్రముడవుతాడు మహా విష్ణువు. ఊర్ధ్వ ముఖంగా సాగిన ఆయన ఒకానొక పాదం బ్రహ్మలోక పర్యంతం సాగుతుంది. ఎంత భాగ్యానికి నోచుకుంటే విష్ణుమూర్తి పాదం గడపదాక వస్తుంది. ముంగిట్లోకి వచ్చిన హరిచరణాన్ని తన కమండంలోని జలంతో బ్రహ్మ కడుగుతాడు. హరిపాద ప్రక్షాళనంతో ఆ తీర్థం అద్వితీయమైన పవిత్రను సంతరించుకుని సురగంగగా అవతరించింది. అందుకఏ గంగను విష్ణు పాదోద్భవ అంటారు...

ఆకాశంలో హరిపాదాల దగ్గరున్న ఆ సురగంగను భగీరథుడు నేలకు దించుతాడు. తన పూర్వీకులకు ఉత్తమలోక ప్రాప్తి కోసం నభోమండలంలో చరించే గంగమాతను భూమికి తేవడానికి కఠోర తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. గంగ అయిష్టంగానే కదలివస్తుంది. అనితరసాధ్యమైన ఉధృతితో, ఉద్వేగంతో పరవళ్లు తొక్కుతూ కదలివస్తున్న గంగాదేవి వేగానికి లోకాలన్నీ భీతి చెందుతాయి. ఆ ప్రవాహాన్ని తట్టుకునే శక్తి భూమికి లేకపోవడంతో పరమశివుడిని ప్రార్థిస్తాడు భగీరథుడు. నీలకంఠుడు గంగను నెత్తినెక్కించుకోడానికి అంగీకరిస్తాడు.

ఉత్తుంగతరంగగా ఉరికి ఉరికి వస్తున్న గంగను తన జఠాలతో బంధించి సిగపువ్వుగా జూటంలో అలంకరించుకుని ఒకే ఒక పాయను భువికి వదులుతాడు శివుడు. ఆ ధార హిమాలయాల్లోని బిందు సరస్సు ప్రాంతంలో ఏడు పాయలుగా తాకుతుంది. తూర్పున హ్లాదిని, పావని, నళిని, పశ్చిమాన సుచక్షు, సీత, సింధు-ఈ ఆరు పాయలు అక్కడే వుంటే, ఏడో పాయ మాత్రం భగీరథుడి వెంట వెళుతుంది. దార్లో వున్న జహ్ను ముని ఆశ్రమాన్ని కూడా ముంచేస్తుంది. ముని ఆగ్రహం చెందుతాడు. గంగను తాగేస్తాడు. పాపం భగీరథుడు కనిపించని ఆ గంగ కోసం జహ్నువును వేడుకుంటాడు. లోకకళ్యాణం కోసం రుషి సరేనంటాడు. చెవిలోంచి వదిలేస్తాడు. అలా గంగ జాహ్నవి అయింది. ముల్లోకాలు, మూడు దిక్కులు పారి త్రిపథగ పేరును సార్థకం చేసుకుంది....

దేశంలో ఎన్ని నదీనదాలు ప్రవహిస్తున్నా గంగానదికి వున్న విశిష్టత ప్రత్యేకం. రుగ్వేదంలో సింధు, సరస్వతి నదుల ప్రస్తావనే ఎక్కువగా వున్నా, ఆ తర్వాతి కాలంలో ప్రాధాన్యత పొందిన గంగ తానే ఏకైక మహానదిగా స్థిరపడిపోయింది. గంగకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఎన్నేళ్లు నిలువ వుంచినా కలుషితం కాకుండా వుండటం! చిన్న చిన్న కలశాల్లో సీలు వేసి పూజా మందిరంలో పెట్టుకుని పూజించేది అందుకే. అంతిమ ఘడియలు సమీపించినప్పుడు ఈ జలంలో తులసీదళం వేసి ఆ వ్యక్తి నోట్లో పోస్తారు. మరణించే వ్యక్తి దేహాత్మలను ఈ తీర్థం పవిత్రం చేస్తుందని నమ్మకం. సునాయాస మరణాన్ని ప్రసాదిస్తుందన్న విశ్వాసం.

గంగలో మునిగితే పాపాలు తొలగిపోతాయన్నది విశ్వాసమే కావొచ్చు కానీ రోగాలు నయమవుతాయన్నది మాత్రం వాస్తవం. నిజంగానే గంగా జలానికి మహిమ వుంది. వ్యాధులను నయం చేసే గుణం వుంది. శాస్త్రీయంగా రుజువైన నిజం. గంగమ్మ తల్లి నిజంగానే మహిమ గలది! ఆ నీటిని సేవిస్తే కఫం కరిగిపోతుంది. గంగానదిలోని కొన్ని రకాల బ్యాక్టిరియాకు వ్యాధులను తగ్గించే గుణం వుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరే గంగానది కొండలు కోనలు అడవులు మైదానాలు దాటుకుంటూ సాగరంలో సంగమిస్తుంది. ఈ మధ్యన అరుదైన వనమూలికలను, ఔషధ గుణాలున్న మృత్తికను, రోగాలను నయం చేసే మొక్కలను తనలో కలుపుకుంటుంది. ఈ నది జలాలకు ఔషధ గుణాలుండటానికి కారణం ఇదే!

Updated On 25 April 2023 5:07 AM GMT
Ehatv

Ehatv

Next Story