స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) రోజున మనం తప్పనిసరిగా స్మరించుకోవలసిన మహనీయుడు గాంధీ(Gandhi) మహాత్ముడు. మనకే కాదు, ప్రపంచ మానవాళికీ ఆయన మార్గదర్శకుడు! అహింసో పరమోధర్మ: అని నమ్మిన ప్రేమమూర్తి. ఆయన ప్రవచించిన హితోక్తులు సదా ఆచరణీయాలు. గాంధీని గుండె గుడిలో పెట్టుకునే వారు ఎందరో.

స్వాతంత్ర్య దినోత్సవం(Independence Day) రోజున మనం తప్పనిసరిగా స్మరించుకోవలసిన మహనీయుడు గాంధీ(Gandhi) మహాత్ముడు. మనకే కాదు, ప్రపంచ మానవాళికీ ఆయన మార్గదర్శకుడు! అహింసో పరమోధర్మ: అని నమ్మిన ప్రేమమూర్తి. ఆయన ప్రవచించిన హితోక్తులు సదా ఆచరణీయాలు. గాంధీని గుండె గుడిలో పెట్టుకునే వారు ఎందరో. కొందరేమో గుడి కట్టి గుండెల్లో పెట్టుకున్నారు. మహాత్ముడికి గుడి కట్టడమెందుకని అడిగామనుకోండి. ఈ గుడిలో మహాత్ముడిని కాదు, మానవత్వాన్ని పూజిస్తున్నాం. ఆయన జీవిత చరిత్ర మాకు నిత్య పారాయణ గ్రంధం అంటారు. జెండా పండుగ శుభసందర్భాన జాతిపిత ఆలయ విశిష్టతలను తెలుసుకుందాం!
మహాత్మాగాంధీ. జాతిపిత బాపూజీ.

మనమే కాదు ప్రపంచమంతా గౌరవించే మహోన్నత వ్యక్తి. రక్తమాంసాలున్న ఇలాంటి మనిషి భూమ్మీద నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మవేమోనన్నాడు విశ్వవిఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. సత్యాగ్రహమే సాధనంగా స్వరాజ్యం సాధించిన ఆ మహనీయుడు సదా స్మరణీయుడు! ఓ మనిషి వందశాతం పవిత్రాత్ముడైతే దేవుడవుతాడు! ముప్పాతికశాతం పవిత్రాత్మను సంపాదించినవాడు మహాత్ముడవుతాడు. గాంధీ మహాత్ముడే! మహాత్ముడే కాదు. ఓ ప్రవక్త! భారతీయులకు అయితే ఆయనో దేవుడు. దైవసమానుడు. మనం గుండెనిండా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ప్రతీసారి ఆయన గుర్తుకొస్తూనే ఉంటారు.

మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఇప్పటికీ ఆయనున్నారు. ఆ మహానుభావుడికి గుడి కట్టి నిత్యం ధూపదీపాలతో అర్చనలు పూజలు చేస్తున్నవారు కూడా ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలను కలుపుతూపోయే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో కొలువుదీరిందొక బాపూజీ ఆలయం(Gandhi Gudi). నల్లగొండ(Nalgonda) జిల్లా చిట్యాల(chityala) మండలం పెద్దకాపర్తి శివారులో ఉన్న ఈ గుడి మహాత్ముడి స్ఫూర్తికి అద్దంపడుతుంది. ఇందులోకి ప్రవేశిస్తే మనసులో ఆధ్యాత్మిక భావనలు పురివిప్పుకుంటాయి. గుంటూరు జిల్లాకు చెందిన గాంధేయవాదులైన కొందరు టీచర్లు, సామాజిక కార్యకర్తలు ఈ గుడిని నిర్మించారు.

ప్రజలకోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ మహనీయమూర్తికి ఒక ఆలయం ఉంటే బాగుంటుందన్న సంకల్పమే దీనికి ఊతమిచ్చింది. తొలుత, 2002లో మహాత్మాగాంధీ ట్రస్ట్‌ని వారు నెలకొల్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. గాంధీ జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించి బాపూజీ సిద్ధాంతానికి బహుళ ప్రచారం కల్పించారు. ఈ క్రమంలోనే "మహాత్ముడికి గుడి కడితే బాగుంటుంది" అన్న ఆలోచన ట్రస్ట్ నిర్వాహకులకు వచ్చింది. వచ్చిందే తడవుగా వారు కార్యాచరణకు పూనుకున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉండే స్థలం కోసం అన్వేషణ సాగిస్తున్నప్పుడు వారికి హైదరాబాద్- విజయవాడ హైవే పక్కన చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారు ప్రాంతం యోగ్యమైనదిగా తోచింది. అక్కడ నాలుగెకరాల భూమిని కొనుగోలు చేశారు. 2012 అక్టోబర్ రెండున వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గాంధీ గుడికి అంకురార్పణ జరిగింది. నిర్మాణపు పనులు పుంజుకున్నాయి. 2014 సెప్టెంబర్ 15న గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2015 అక్టోబర్ 2న గుడికి ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించారు.

మొదటి అంతస్తులోని గర్భగుడిలో గాంధీ మహాత్ముని విగ్రహం కొలువుదీరింది. విగ్రహానికి ఎదురుగా ధర్మచక్రాన్ని ఏర్పాటుచేశారు. ఇందులోంచి మహాత్ముడిని భక్తులు దర్శించుకుంటారు. మంటపం వెలుపల ధ్వజస్తంభం చుట్టూరా ప్రదక్షిణలు చేసి బలిపీఠాన్ని చేతితో తాకితే పుణ్యప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. గుడిలో నిత్యపూజలు కూడా జరుగుతుంటాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ధాన్యమందిరం ఉంది. అన్ని మతాల పవిత్ర గ్రంథాలతోపాటు గాంధీ రచించిన సత్యశోధన ప్రతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

ఇక ఈ గుడి ప్రత్యేకతల విషయానికి వస్తే, పంచభూతాలు కొలువుదీరినట్టుగా ఈ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లుఉన్నాయి. గాంధీ మహాత్మునితోపాటు పంచభూతాలకు పూజలు చేసి "ప్రకృతి కరుణించాలనీ, పంటలు బాగా పండాలనీ" రైతులు, కూలీలు వేడుకుంటుంటారు. ఆలయంలో నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. గాంధీగుడిని దర్శించుకుంటే తమకు మంచి జరుగుతుందని స్థానికులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ గుడి నిర్మాణం తర్వాత ఈ ప్రాంతలో హైవేపై ప్రమాదాలు కూడా తగ్గాయని అంటున్నారు. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నప్పటికీ ఈ గుడిని దర్శించడం అనేది అనిర్వచనీయ అనుభూతితో సమానమని చెప్పకతప్పదు.

Updated On 14 Aug 2023 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story