పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ హత్య కేసు ఇప్పుడు జాతీయ సమస్యగా మారింది

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్‌లో ట్రైనీ మహిళా డాక్టర్ హత్య కేసు ఇప్పుడు జాతీయ సమస్యగా మారింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్యులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. తన కుమార్తె హత్యపై తండ్రి విలేకరులతో మాట్లాడారు. సీబీఐతో జరిపిన సంభాషణ వివరాలను చెప్పడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై కూడా ఆయన స్పందించారు. నిరసనకారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. వారంతా తన కొడుకులు, కూతుళ్లని అన్నారు.

మృతురాలి తండ్రి విలేకరులతో మాట్లాడుతూ.. ‘సీబీఐతో మా సంభాషణ వివరాలను తెలియజేయడం చట్టపరంగా సరికాదు. ఈ కేసుకు సంబంధించి అడిగిన‌ ప్రశ్నల గురించి నేను మీకు ఏమీ చెప్పలేను. వారు మా వాంగ్మూలాలను తీసుకున్నారు. దేశంలో జరుగుతున్న నిరసనలకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో ఎవరు నిలబడతారో వారందరినీ నా కొడుకులు, కూతుళ్లుగా భావిస్తాను. నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని సీబీఐ హామీ ఇచ్చింది. నేను పరిహారం నిరాకరించాను. నేను నష్టపరిహారంగా డబ్బు తీసుకుంటే, నా కుమార్తె చాలా బాధపడేది. నాకు న్యాయం కావాలన్నారు.

ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్ వద్ద నిరసన సందర్భంగా కొంతమంది గుర్తు తెలియని నిరసనకారులు ఎమర్జెన్సీ వార్డులోకి ప్రవేశించి అక్క‌డి వ‌స్తువుల‌ను ధ్వంసం చేశారు. ఈ దాడి తర్వాత బీజేపీ నేత సుభేందు అధికారి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, సీబీఐ డైరెక్టర్‌లకు లేఖ రాశారు. ఆర్‌జి కర్ ఆసుపత్రిలో సాక్ష్యాలను మరింత ధ్వంసం చేయకుండా నిరోధించడానికి సిఎపిఎఫ్‌లను మోహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై కలకత్తా హైకోర్టు ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు.. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అభివర్ణించింది. అదే సమయంలో ఆసుపత్రిని మూసివేస్తే బాగుంటుందని కోర్టు సూచించింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను వేరే ఆసుపత్రికి తరలించాలని పేర్కొంది. అయితే.. ఆసుపత్రిలో జరిగిన విధ్వంసానికి సంబంధించి 30-40 మంది యువకులు లోపలికి ప్రవేశించి ధ్వంసం చేశారని.. వారిలో కొంత‌మందిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story