వసంతమే రాలేదు కానీ అప్పుడే గ్రీష్మం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఉష్ణతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సూర్యప్రతాపం భయపెడుతోంది. శివరాత్రికి(Shiva Ratri) శివశివ అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఆ చలి ఎప్పుడో వెళ్లిపోయింది. ఇప్పుడే ఉష్ణోగ్రతలు(Temperatures) ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్‌లో ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన మొదలయ్యింది.
వసంతమే రాలేదు కానీ అప్పుడే గ్రీష్మం వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి మధ్యలోనే ఉష్ణతాపం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సూర్యప్రతాపం భయపెడుతోంది. శివరాత్రికి(Shiva Ratri) శివశివ అంటూ చలి వెళ్లిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఆ చలి ఎప్పుడో వెళ్లిపోయింది. ఇప్పుడే ఉష్ణోగ్రతలు(Temperatures) ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్‌లో ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన మొదలయ్యింది. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎండలు మెండుగా ఉంటున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పైనే రికార్డవుతున్నాయి. రాబోయే వేసవి తీవ్రతకు ఇది సంకేతం కావచ్చు. సాధారణంగా ఫిబ్రవరిలో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు మించవు. కానీ ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రానున్న వేసవి(Summer) తీవ్రంగానే ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. వేసవితాపంతో పాటు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని అంటున్నారు. పసిఫిక్ మహా సముద్రంలో(Pacific Oceans) బలంగా ఉన్న ఎల్‌నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండటం, కాలుష్య కారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఎప్పుడైనా ఫిబ్రవరిలో చిన్నపాటి వర్షాలు పడతాయి. ఉష్ణతాపాన్ని అదుపు చేస్తాయి. ఇప్పుడు వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదు. నిరుడుతో పోలిస్తే ఈ వేసవి ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని చెప్పారు. జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడి, లానినా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నందున మే ఆఖరు వరకు ఉష్ణతాపం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు వివరించారు.