జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉగ్రవాదులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోమవారం దోడా జిల్లాలోని దేసా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ అధికారి సహా ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిప భద్రతా సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే.. వీరిలో ఒక అధికారి సహా నలుగురు జవాన్లు మరణించారు. భద్రతా బలగాలు అదనపుసిబ్బందితో ఉగ్రవాదుల కదలికలు ఉన్న ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
జమ్మూ కాశ్మీర్ పోలీస్ రాష్ట్రీయ రైఫిల్స్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సిబ్బంది దేసా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగి వద్ద రాత్రి 7.45 గంటలకు జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
"నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా.. డోడాకు ఉత్తరాన ఉన్న ప్రాంతంలో సైన్యం.. పోలీసులచే ఉమ్మడి ఆపరేషన్ జరుగుతోంది" అని ఆర్మీ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో రాసింది. రాత్రి 9 గంటలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. ఆ తర్వాత భారీ కాల్పులు జరిగాయి. వెంటనే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను రప్పించారు.
24 గంటల క్రితమే ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారాలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నియంత్రణ రేఖ దగ్గర జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదులు భారీ దాడికి సిద్ధమయ్యారు. అయితే దీనికి ముందు అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సిబ్బంది వారి ప్లాన్‌ను భగ్నం చేశాయి.