ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను
కేరళలోని కాసరగోడ్‌లో జరిగిన మాక్ పోల్‌లో నాలుగు ఈవీఎంలు బీజేపీకి ఒక అదనపు ఓటును నమోదు చేస్తున్నాయంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ వార్తా కథనాన్ని భారత ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ముందు ఖండించింది. కేరళకు సంబంధించిన వార్తలు పూర్తిగా అవాస్తవమని సుప్రీంకోర్టుకు హాజరైన ECI అధికారి తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని.. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యకు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్) స్లిప్పుల సంఖ్యకు మధ్య ఎన్నడూ తేడా రాలేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం వివరించింది. ఈవీఎం ఓట్లతో 4 కోట్లకుపైగా వీవీప్యాట్ స్లిప్‌లు సరిపోలాయని.. ఈ రెండింటికి సంబంధించిన లెక్కలో తేడా వచ్చిన సందర్భమేదీ లేదని ఈసీ స్పష్టం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనానికి ఈ వార్తా కథనాలు అబద్ధమని, అవాస్తవమని తేలిందని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ కుమార్ వ్యాస్ వివరించారు.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT)తో EVMలను ఉపయోగించి పోలైన ఓట్లను పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ వచ్చిన పిటిషన్‌ల విచారణ సందర్భంగా ECI అధికారి ప్రతిస్పందన వచ్చింది. ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ అనే ఎన్జీవోకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేరళలో బీజేపీకి అదనపు ఓట్లు నమోదైన మాక్ పోల్ ఫలితాల నివేదికను ఉదాహరణగా ధర్మాసనం ముందుకు తీసుకుని వచ్చారు. ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ ఎన్నికల కమీషన్ అధికారి తేల్చి చెప్పారు.