ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం మరోసారి సమన్లు జారీ చేసింది.

ED issues fresh summons to Delhi CM Kejriwal in excise policy case
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 21న ఈడీ ముందు హాజరుకావాలని సీఎం కేజ్రీవాల్‌ను కోరినట్లు దర్యాప్తుసంస్థ వర్గాలు తెలిపాయి. ఎక్సైజ్ కేసులో ఈడీ(ED) ఇప్పటివరకూ కేజ్రీవాల్‌కు తొమ్మిదవ సారి సమన్లు పంపింది.
సమన్లపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ఇప్పటివరకు ఎనిమిది సమన్లు జారీ చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ప్రతిసారీ ఈడీ సమన్లను ఢిల్లీ సీఎం పట్టించుకోలేదు.
ED మొదటి ఫిర్యాదుపై ACMM దివ్య మల్హోత్రా ఫిబ్రవరి 7న కోర్టుకు హాజరు కావాలని కేజ్రీవాల్‌కు మొదటి సమన్లు జారీ చేశారు. ఫిబ్రవరి 17న బడ్జెట్ సెషన్‌ను ఉటంకిస్తూ వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరిన కేజ్రీవాల్.. మార్చి 16న తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని చెప్పారు.
పలుమార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ కోర్టులో రెండోసారి ఫిర్యాదు చేసింది. దీనిపై మార్చి 7న కోర్టు కేజ్రీవాల్‌కు మార్చి 16న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. అయితే నిన్న బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఆ తర్వాత కూడా సమన్లు జారీ చేయడంతో సర్వత్రా ఏం జరుగనుందనే ఉత్కంఠ నెలకొంది.
