ఎయిర్ ఇండియా సిబ్బంది త్వరలో కొత్త యూనిఫామ్‌లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన మొదటి జంబో ఎయిర్‌క్రాఫ్ట్ A-350ని ప్రారంభ సమయంలో
ఎయిర్ ఇండియా(Air India) సిబ్బంది త్వరలో కొత్త యూనిఫామ్(New Uniform)లో కనిపించనున్నారు. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ తన మొదటి జంబో ఎయిర్‌క్రాఫ్ట్ A-350ని ప్రారంభ సమయంలో దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎయిర్‌లైన్ విస్తారాను ఎయిర్ ఇండియా విలీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ మార్పు చేయనున్నట్లు తెలుస్తుంది.
దీంతో 60 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది యూనిఫాం మారబోతోంది. 1962లో జేఆర్‌డీ టాటా(JRD TATA) ఉన్నప్పుడు ఎయిర్ ఇండియా సిబ్బంది పాశ్చాత్య దుస్తుల్లో కనిపించారు. మహిళా ఉద్యోగులు స్కర్టులు, క్యాప్‌లతో కనిపించారు. దీని తరువాత సిబ్బందికి చీరలను యూనిఫారంగా ఎంపిక చేశారు. అప్పుడు టాటా ఎయిర్‌లైన్స్(TATA Airlines)లోని చాలా మంది ఎయిర్ హోస్టెస్(Air Hostess)లు ఆంగ్లో-ఇండియన్ లేదా యూరోపియన్ మూలానికి చెందినవారు. ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్‌ల కోసం చీరలను బిన్నీ మిల్స్ నుండి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కొత్త యూనిఫామ్‌ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా(Manish Malhotra) సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మనీష్ మల్హోత్రా ఇంకా ఎలాంటి స్పందనా ఇవ్వలేదు.
ఎయిర్ ఇండియాలో విస్తారా(Vistara) విలీనం తర్వాత ఈ కంపెనీ సిబ్బంది యూనిఫాం కూడా మారనుండడం గమనార్హం. ఎయిర్ ఇండియా సిబ్బంది మాదిరిగానే విస్తారా విమాన సిబ్బందికి కూడా యూనిఫాం ఉంటుంది. ఎయిర్‌లైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ సమాచారాన్ని ఆగస్టు 10, 2023న అందించారు.