బంగారంపై మోజు తగ్గిందా?
భారతీయులది, బంగారానిది(Gold) ఫెవికాల్ బంధం. విడదీయలేని సబంధం. బంగారమంటే చాలు మొహాలు బంగారంలా వెలిగిపోతాయి. మగువలకు మరింత ఎక్కువగా! సిరిసంపదలు ఉన్న చోట బంగారం ఉంటుందో, బంగారం ఉన్న చోట సిరిసందలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ బంగారం ఉంటే లక్ష్మీదేవి నట్టింటికి నడిచివస్తుందన్న నమ్మకం అయితే ఉంది. అందుకే తులం బంగారమైనా ఇంట్లో ఉండాలంటారు. బంగారం విలువ పెరుగుతుంటుందే తప్ప తరగదు. అందుకే చాలా మంది బంగారంపై పెట్టుబడి పెడతారు. అందుకే పసిడికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇక పండుగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యాలప్పుడు బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. మనకు కొత్తగా అక్షయ తృతీయ, ధన త్రయోదశిలు కూడా వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పసిడి దిగుమతి అయ్యేది. అయితే ఆశ్చర్యమేమిటంటే బంగారం దిగుమతులు(Gold import) తగ్గుముఖం పట్టడం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 మొదటి నాలుగు నెలలో ఏప్రిల్ నుంచి జూలై వరకు 12.64 బిలియన్ డాలర్లు, మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 1.05 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం దిగుమలు నమోదయ్యాయి. 2023 ఏప్రిల్–జూలై మధ్య దిగుమతులు 13.2 బిలియన్ డాలర్లతో పోల్చినప్పుడు 4.23 శాతం దిగుమతులు తగ్గాయన్నమాట! ఒక్కజూలై నెల వరకే చూస్తే పసిడి దిగుమతులు 10.65 శాతం తగ్గి 3.13 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 జూలైలో 3.5 బిలియన్ డాలర్ల దిగుమతులు నమోదు కావడం గమనార్హం. ఇందుకు కారణం అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులే! అధిక ధరలు కూడా బంగారం దిగుమతులపై ప్రభావం చూపించాయి. అయితే శ్రావణం నుంచి పర్వదినాలు, శుభ వేడుకలు మొదలవుతాయి కాబట్టి సెప్టెంబర్ మాసం నుంచి దిగుమతులు పెరగవచ్చు. దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం తగ్గించడం కూడా దిగుమతులు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇటీవలి బడ్జెట్‌లో బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే.