సీతారాముల కళ్యాణోత్సవాలు ఎంత రమణీయంగా ఉంటాయో.. శివపార్వతుల కళ్యాణవేడుకలు కూడా అంతే కమణీయంగా ఉంటాయి. ఆ ఆదిదంపతుల వివాహమహోత్సాన్ని తిలకించాలంటే మధురైలో ఉన్న మీనాక్షి ఆలయానికి వెళ్లాలి. అది కూడా ఈరోజే! ప్రతి ఏడాది ఈ పెళ్లి సంబరాన్ని చిత్తిరై తిరువిళగా జరుపుకుంటారు. పన్నెండు రోజుల పాటు జరిగే వేడుకలను తిలకించడానికి ఆశేషభక్తజనం తరలివస్తారు. మీనాక్షి అమ్మావారి పెళ్లిని చూసి తరించిపోతారు..
సీతారాముల కళ్యాణోత్సవాలు ఎంత రమణీయంగా ఉంటాయో.. శివపార్వతుల కళ్యాణవేడుకలు కూడా అంతే కమణీయంగా ఉంటాయి. ఆ ఆదిదంపతుల వివాహమహోత్సాన్ని తిలకించాలంటే మధురైలో ఉన్న మీనాక్షి ఆలయానికి వెళ్లాలి. అది కూడా ఈరోజే! ప్రతి ఏడాది ఈ పెళ్లి సంబరాన్ని చిత్తిరై తిరువిళగా జరుపుకుంటారు. పన్నెండు రోజుల పాటు జరిగే వేడుకలను తిలకించడానికి ఆశేషభక్తజనం తరలివస్తారు. మీనాక్షి అమ్మావారి పెళ్లిని చూసి తరించిపోతారు..
ముధురై మీనాక్షి ఆలయం. రెండున్నరవేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది! రెండు వేల ఏళ్ల నాటి తమిళ సాహిత్యంలో ఈ ఆలయ ప్రస్తావన ఉందంటే ఎంత పురాతనమైన ఆలయమో అర్థమవుతుంది. ఏడో శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ శైవ తత్వవేత్త తిరుజ్ఞానసంబంధర్ తన రచనల్లో మధురై ఆలయాన్ని ప్రస్తావించాడు. ఆలయంలో కొలువైన ఆదిదేవుడిని అలవాయి ఇరైవన్‌గా అభివర్ణించాడు. 13వ శతాబ్దంలో అన్య మతస్తుల దాడిలో ఆలయం పాక్షికంగా ధ్వంసమయ్యింది. కొన్ని చారిత్రక ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. క్రీస్తుశకం 1559 నుంచి 1600 వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించారు. తర్వాతి కాలంలో మధురైను పాలించిన పాలకులు ఆలయానికి మెరుగులు దిద్దారు. అనేక మండపాలను నిర్మించారు. వేల సంవత్సరాల కిందటి ఆలయానికి రెండు బంగారు గోపురాలు ఉండేవట! వాటితో పాటు అబ్బురపరిచే శిల్పాలతో అలరారే 14 అద్భుతమైన గోపురాలు ఉండేవట! ఈ మందిరానికి సంబంధించి. ఇక్కడ వెలిసిన మీనాక్షి అమ్మవారికి ఓ పురాణగాధ ఉంది.. మధురై పాలకుడైన మలయధ్వజ పాండ్య పార్వతీదేవి కోసం ఘోరమైన తపమాచరించాడు. ఆయన తపస్సుకు మెచ్చి అమ్మవారు వరం కోరుకోమంది. చిన్నారి పాపగా వచ్చి తన ఇంట పెరగాలనే వర కోరుకున్నాడు.. అమ్మవారు తథాస్తు అంది. చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. పెరిగి పెద్దయిన తర్వాత మీనాక్షిగా మధురైని పాలించింది..
భార్య వియోగాన్ని భరించలేక శివుడు కూడా సుందరేశ్వర్ రూపంలో భూమ్మీదకు వస్తాడు. మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడు. వీరిద్దరి వివాహవేడుక నభూతో నభవిష్యతి అన్న రీతిలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆది దంపతుల వివాహానికి ముక్కోటి దేవతలు తరలివస్తారు. సమస్త భూమండలం మధురై సమీపానికి వస్తుంది. తన సోదరి మీనాక్షి పెళ్లిని దగ్గరుండి జరిపించడానికి విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయలుదేరుతున్న సమయంలో ఇంద్రుడు చిన్న పితలాటకం పెడతాడు.. దాంతో కొంచెం ఆలస్యం అవుతుంది.. ఈలోగా తిరుప్పరాంకుండ్రంకు చెందిన స్థానిక దేవుడు పవలాకనైవాల్ పెరుమాళ్ మీనాక్షి సుందరేశ్వర్‌ల పెళ్లిని జరిపిస్తాడు. ఆనాటి నుంచి ప్రతి ఏడాది మీనాక్షి-సుందరేశ్వర్‌ల వివాహాన్ని మధురై దేవాలయంలో జరపడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ వేడుకను చిత్తిరై తిరువిళగా జరుపుకుంటారు. మధురైని నాయక రాజులు పాలిస్తున్న కాలంలో తిరుమలై నాయకర్ అళకర్ తిరువిళాకు మీనాక్షి పెళ్లికి జత కుదిర్చాడు. అందుకే ఈ మహోత్సవాన్ని అళకర్ తిరువిళా అని కూడా అంటారు.
ఉత్సవాలకు చాలా రోజుల ముందే ధ్వజారోహణం ఉంటుంది. ఆలయంలో ఉన్న కొడిమారమ్ అంటే జెండా దిమ్మ నుంచి పవిత్ర పతాకాన్ని ఎగురవేస్తారు. అంటే ఉత్సవాలు మొదలయ్యాయని అర్థం. ఉత్సవాలు ముగిసేంతవరకు జెండా ఎగురుతూనే ఉంటుంది. ఈ ఏడాది శనివారం నుంచి అసలైన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మీనాక్షి అమ్మవారు భూత, అన్న వాహనాలపై ఊరేగారు. ఆదివారం కైలాసపర్వతం, కామధేను వాహనంలో ఊరేగారు.. సోమవారం తంగపలక్కు.. మంగళవారం తంగ గుత్తిరై వాహనం. బుధవారం రిషభ వాహనం.. గురువారం యాలి వాహనంలో తిరుగాడే మీనాక్షి అమ్మవారికి శుక్రవారం పట్టాభిషేకం జరుగుతుంది.. శనివారం రజున మీనాక్షి దిగ్విజయాన్ని జరుపుతారు. ఆదివారం మీనాక్షి, సుందరేశ్వరన్‌ల వివాహవేడుక జరుగుతుంది. సోమవారం రథోత్సవం. మంగళవారం తీర్థం జరుగుతాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం పట్టాభిషేకం. మీనాక్షి అమ్మవారికి జరిగే పట్టాభిషేకం ఇది! మధురై మహారాణిగా ఆమెకు స్వర్ణకిరీటధారణ చేస్తారు. నాలుగు నెలల పాటు ఆమె రాణిగా ఉంటుంది.. ఆ తర్వాతి ఎనిమిది నెలలు సుందరేశ్వర్ రాజుగా ఉంటాడు. అనంతరం జరిగే దిగ్విజయం కూడా ప్రధాన కార్యక్రమమే! దీనికో పురాణగాధ ఉంది.. మీనాక్షి దేవి పాండ్య రాజ్యపు రాణి బాధ్యతలు తీసుకున్నాక అనేక దేశాలపై యుద్ధాలు చేసి చివరికి శివుడు కొలువై ఉన్న కైలాసానికి వెళుతుంది. అక్కడ పరమేశ్వరుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అదే దిగ్విజయం!
మీనాక్షి సుందరేశ్వర్‌ల వివాహవేడుక తర్వాత రథోత్సవం జరుగుతుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసిన రథంలో మీనాక్షి సుందరేశ్వర్‌ల రూపంలో ఉన్న శివపార్వతులు ఊరేగుతారు. ఈ ఉత్సవాలన్నీ ఒక ఎత్తు. ఆలయ సౌందర్యం మరో ఎత్తు. ఇదో అద్భుతమైన ఆలయం. నాలుగు దిక్కులా నాలుగు ఎత్తయిన రాజగోపురాలతో గంభీరంగా కనిపిస్తుందీ ఆలయం. సాంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి. మూడున్నర అడుగుల ఎత్తులో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఎంత సేపు చూసినా తనివితీరదు. మధురై ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ కోనేరు. ఇది పవిత్రమైన సరస్సుగా భక్తులు భావిస్తారు. దీన్ని పోర్తమారై కులమ్‌గా పిలుచుకుంటారు. అంటే స్వర్ణకమలంతో కూడిన సరస్సు అని అర్థం. ఆ పరమేశ్వరుడు ఇందులో ఏ సముద్రజీవి పెరగలేవని ఓ పక్షికి మాట ఇచ్చాడన్నది ఓ పురాణగాధ. అందుకే ఈ కోనేరులో ఒక్క సముద్రప్రాణి కనిపించదు. అన్నట్టు ఈ సరస్సు సాహిత్యానికి విలువ కట్టేదట! సాహితీవేత్తలు తమ సాహిత్యాన్ని సరస్సులో ఉంచేవారట! రచనలు బాగుంటే నీటిపైన తేలేవట! బాగోలేకపోతే మునిగిపోయేవట! మీనాక్షి అమ్మవారి ఆలయంలో వేయిస్తంభాల మండపాన్ని చూసి తీరాల్సిందే! 1569లో అరియనాథ ముదలియార్ ఈ మండపాన్ని నిర్మించాడు. మండపం ప్రవేశద్వారం దగ్గర ఆయన భారీ విగ్రహం కనిపిస్తుంది. ఇందులోనే ఆలయ కళా వస్తుప్రదర్శనశాల ఉంది. ఇక్కడ వేల సంవత్సరాల చరిత్రకు సంబంధించిన విగ్రహాలు, చిత్తరువులు ఇతర వస్తువులను ప్రదర్శనకు పెట్టారు. ఈ మంటపం వెలుపల, పశ్చిమం వైపుగా, సంగీత స్తంభాలు ఉన్నాయి. ఇక్కడి ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ప్రత్యేక సంగీత స్వరాన్ని వినిపిస్తుంది.