Delhi High Court : మద్యం తాగి కోర్టుకు వచ్చి జడ్జిని బెదిరించిన న్యాయవాది.. దోషిగా తేల్చిన కోర్టు
మద్యం మత్తులో కోర్టుకు వచ్చి జ్యుడీషియల్ అధికారిని బెదిరించినట్లు గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఇటీవల కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయవాదిని దోషిగా నిర్ధారించింది
మద్యం మత్తులో కోర్టుకు వచ్చి జ్యుడీషియల్ అధికారిని బెదిరించినట్లు గుర్తించిన ఢిల్లీ హైకోర్టు ఇటీవల కోర్టు ధిక్కారానికి పాల్పడిన న్యాయవాదిని దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తులు ప్రతిభా ఎం సింగ్, అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. మత్తులో కోర్టుకు హాజరుకావడం ప్రాథమిక ధిక్కారమని.. న్యాయమూర్తిని ఉద్దేశించి ఆ న్యాయవాది మాట్లాడిన తీరు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. న్యాయవాది సంజయ్ రాథోడ్‌కు వ్యతిరేకంగా సుమోటాగా నమోదైన మోషన్‌పై ఈ వ్యాఖ్యలు చేసింది.
డివిజన్ బెంచ్ విచారణలో.. న్యాయమూర్తి పట్ల ప్రతివాది-కంటమ్నర్ [రాథోడ్] ఉపయోగించిన భాషను పరిశీలిస్తే అది కోర్టు ధిక్కార చట్టం కిందకు వస్తుందనడంలో సందేహం లేదు. సంజయ్ రాథోడ్ ఉపయోగించిన భాష కోర్టుకు చెడ్డపేరు తెచ్చిపెట్టింది. అలాంటి ప్రవర్తన న్యాయ నిర్వహణలో కూడా జోక్యం చేసుకుంటుంది. మాట్లాడే మాటలు మురికిగా, అవమానకరంగా ఉన్నాయి. న్యాయస్థానానికి అధ్యక్షత వహించే జ్యుడీషియల్ అధికారి మహిళా న్యాయమూర్తి అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతివాది న్యాయ అధికారిని ఉద్దేశించి మాట్లాడిన విధానం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. మత్తులో కోర్టుకు హాజరుకావడం కూడా క్షమించరాని విషయం. ఇది కోర్టు ధిక్కారం. అందువల్ల, ప్రతివాది నేరపూరిత ధిక్కారానికి పాల్పడినట్లు నిర్ధారించడంలో ఈ కోర్టుకు ఎటువంటి సందేహం లేదని పేర్కొంది. ఈ ఆరోపణల ఆధారంగా రాథోడ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఐదు నెలలుగా జైలులో ఉన్నందున తదుపరి శిక్ష విధించలేదని ధర్మాసనం పేర్కొంది.
"కోర్టు నిజానికి నేరపూరిత ధిక్కారానికి ప్రతివాదిని శిక్షించడానికి మొగ్గు చూపుతుంది. అయితే.. ఈ ఆరోపణలు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నం. 0885/2015లో ప్రతివాది [రాథోడ్] ఇప్పటికే 5 నెలలకు పైగా శిక్షను అనుభవించినందున ప్రతివాదిపై తదుపరి శిక్ష విధించమని పేర్కొంది.
ఈ సంఘటన 2015 నాటిది. లాయర్ సంజయ్ రాథోడ్ నిందితుడైన డ్రైవర్ కోసం కర్కర్డూమా కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ట్రాఫిక్) కోర్టుకు హాజరయ్యాడు. ఉదయం విచారణ జరిపిన కేసు తదుపరి రోజుకు వాయిదా పడింది. తర్వాత రోజు రాథోడ్ కోర్టు ముందు హాజరై న్యాయమూర్తిపై అరవడం ప్రారంభించాడు. ట్రయల్ కోర్టు ఆదేశం ప్రకారం.. అతడు మద్యం సేవించి.. న్యాయమూర్తిపై అసభ్య పదజాలం ఉపయోగించాడు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కారణంగా రాథోడ్ ఐదు నెలలు జైలులో గడపవలసి వచ్చింది.