Delhi Excise Policy Case : సీఎంతోపాటు ఎమ్మెల్యేను కూడా విచారించనున్న సీబీఐ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి లభించిందని సీబీఐ శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి లభించిందని సీబీఐ శుక్రవారం ఢిల్లీ కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు సమాచారం అందించగా.. కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కూడా ఆగస్టు 27తో ముగియనుంది. ఈ కేసులో కేజ్రీవాల్, పాఠక్‌లను విచారించేందుకు అవసరమైన అనుమతిని పొందేందుకు సీబీఐకి ఆగస్టు 12న కోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది.
అంతకు ముందు కేజ్రీవాల్‌కు కూడా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈరోజు సుప్రీంకోర్టులో జరగాల్సిన ఆయన బెయిల్ విచారణ వాయిదా పడింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణ సెప్టెంబర్ 5న జరగనుంది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐకి అనుమతినిచ్చింది. దీంతో పాటు కేజ్రీవాల్‌కు సమాధానం ఇచ్చేందుకు రెండు రోజుల సమయం ఇచ్చింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ ఒక్క పిటిషన్‌పై మాత్రమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని.. దానిని గురువారం రాత్రి 8 గంటలకు తనకు అందజేశారన్నారు. వారంలోగా సమాధానం చెబుతామని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు. దీని తర్వాత కేసు తదుపరి విచారణను బెంచ్ సెప్టెంబర్ 5కి నిర్ణయించింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి ఆగస్టు 14న సుప్రీంకోర్టు నిరాకరించింది. అతని అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐ నుండి స్పందన కోరింది. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.