బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను రెమాల్‌గా మారిందని
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను రెమాల్‌గా మారిందని.. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రెమాల్ అంటే అరబిక్‌లో ఇసుక అని అర్ధం, ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను ఇది. ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫానులకు ప్రాంతీయ నామకరణ విధానాన్ని అనుసరించి ఒమన్ ఈ పేరును అందించింది.
వాతావరణ శాఖ ప్రకారం, మే 26, 27 తేదీలలో పశ్చిమ బెంగాల్.. ఉత్తర ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మే 27, 28 తేదీలలో రెమాల్ ప్రభావం కారణంగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోల్‌కతా, హౌరా, నదియా మరియు పుర్బా మెదినీపూర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మే 26, 27 తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెమాల్ తుఫాను కారణంగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుండి 21 గంటల పాటు విమాన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించారు. డైమండ్ హార్బర్‌లో ఫెర్రీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి.