మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టు మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది

మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టు మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది. ఈడీ 10 రోజుల రిమాండ్‌ను కోరింది. ప్రస్తుత కేసులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను చూసిన తర్వాత నిందితుడు కేజ్రీవాల్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్లు రూస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక సీబీఐ జడ్జి కావేరీ బవేజా తన తీర్పులో తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా, ఇతర నిందితులతో ముఖాముఖి విచార‌ణ జ‌ర‌పితే వాస్తవాలన్నీ వెల్లడవుతాయన్న ఈడీ వాదనను జ‌డ్జి అంగీకరించారు.

కేజ్రీవాల్‌కు ఈడీ జారీ చేసిన తొమ్మిది సమన్లను పట్టించుకోకపోవడంతో గురువారం రాత్రి ఆయ‌న‌ అరెస్టు తర్వాత.. కేజ్రీవాల్‌ను శుక్ర‌వారం కోర్టులో హాజరుపరిచగా ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉండి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదిలావుంటే.. కేజ్రీవాల్‌కు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఈడీని ఆదేశించింది. దీంతో పాటు నిర్దేశిత నిబంధనల ప్రకారం.. కేజ్రీవాల్ లాయర్లు, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది.

Updated On 22 March 2024 8:58 PM GMT
Yagnik

Yagnik

Next Story